subedari police station
-
మానస కేసులో చార్జిషీట్ దాఖలు
వరంగల్ క్రైం: అత్యాచారం, హత్యకు గురైన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్.. నవంబర్ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు. -
రాజస్తాన్‌లో తెలంగాణ పోలీసులపై దాడి
సాక్షి, వరంగల్ : రాజస్తాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ సుబేదార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ శివకుమార్‌తో పాటు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. బేల్వాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు వరంగల్ పోలీసులపై దాడి చేసిన వారిపై రాజస్తాన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి చేసుకున్నాడు.. వద్దంటున్నాడు..
నెక్కొండ: మామునూరు ఎన్సీసీ క్యాంపులో ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ప్రేమ..పెళ్లి వరకు దారితీసింది. పెళ్లయిన అనంతరం దళిత మహిళవంటూ ఓ ప్రబుద్ధుడు ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల నాగారానికి చెందిన మేకల సంగీత, రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బైరు భూపతి ప్రకాష్ 2013 సంవత్సరంలో మామునూరు ఎన్సీసీ క్యాంపునకు హాజరయ్యారు. అక్కడ వీరి పరిచయం ప్రేమగా మారింది. సంగీత మాదిగ, ప్రకాష్ మున్నూరు కాపు కులానికి చెందినవాడు. దీంతో పెళ్లిని ప్రకాష్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలో జనగామ జిల్లా చిల్పూరుగుట్టపై 25 నవంబర్ 2017న వారు పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ప్రకాష్ కొద్ది రోజులు సంగీత ఇంటి వద్ద ఉన్నాడు. అనంతరం ప్రకాష్ ఇంటికి వెళ్లి తండ్రిదండ్రులను ఒప్పిస్తానని తిరిగి నెక్కొండ మండలంలోని గుండ్రపల్లికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సంగీతతోపాటు కుటుంబసభ్యులు ప్రకాష్‌కు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో పెట్టుకున్నాడు. తీరా గుండ్రపల్లికి సంగీత కుటుంబ సభ్యులు వచ్చి సంగీతను ఎప్పుడు తీసుకువెళ్తావని అడిగారు. సంగీత మాదిగ కులానికి చెందినందున తల్లిదండ్రులు వద్దంటున్నారని ప్రకాష్ చెప్పాడు. వెంటనే సంగీత, కుటుంబ సభ్యులు హన్మకొండ సుబేదారిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భూపతి ప్రకాష్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భార్యను వెంట తీసుకపోతానని నమ్మబలికి, కేసు ఉపసంహరించుకోవాలని సంగీతకు సూచించాడు. సంగీత కేసును ఉపసంహరించుకున్న అనంతరం మళ్లీ ఫోన్ ఎత్తకుండా, సమాధానమివ్వకుండా ప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మంగళవారం సంగీత తన కుటుంబ సభ్యులతోపాటు ఎస్సీ మహిళా నాయకులతో కలిసి మండలంలోని గుండ్రపల్లిలో భూపతి ప్రకాష్ ఇంటి ఎదుట బైఠాయించింది. విషయాన్ని తెలుసుకున్న నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు దళిత మహిళవంటూ ప్రకాష్ నిరాకరిస్తున్నాడని సంగీత కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఐ వెంకటేశ్వర్రావు సంగీతకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చా రు. రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకాష్ ఇంటి ఎదుటనే ఆమె బైఠాయించింది. -
ఏఎస్సై.. ఫుల్ బాటిల్!
పనికావాలంటే.. చేయి, గొంతూ తడపాల్సిందే సుబేదారి పోలీస్‌స్టేషన్ ఏఎస్సై తీరిది బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి వరంగల్ : హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ ఏఎస్సై తీరు పోలీసు శాఖకు మాయని మచ్చ తెచ్చింది. ప్రతీ కేసు విషయంలో పిటిషన్‌దారుల నుంచి ఏదో ఒకటి వసూలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. సమస్య పరిష్కరించడానికి డబ్బులు లేదా మద్యం బాటిల్ డిమాండ్ చేయడం... ఇచ్చే వరకు పని పూర్తి చేయకపోవడం ఆయన స్టైల్. ఈయన తీరుతో స్టేషన్ అధికారులు, సిబ్బంది సైతం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ ఏఎస్సై ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకుంటూ గురువారం అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి బుధవారం స్టేషన్‌కు వచ్చి మరొక వ్యక్తి నుంచి తనకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేసి పిటిషన్ ఇచ్చారు. ఈ మేరకు సుబేదారి స్టేషన్ అధికారి వాసాల సతీష్‌కుమార్ ఆ ఇద్దరిని పిలిచి సర్దిచెప్పారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక వివరణ ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ఏఎస్సై పరుశరాములుకు అప్పగించారు. అయితే ఏఎస్సై సీఐ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘నాకు మద్యం బాటిల్ ఇస్తే రేపు పని పూర్తి చేస్తాను’ అని బాధితులతో అన్నాడు. దీంతో బాధితులు ప్రజాసేవ అనే అవినీతి వ్యతిరేక సంస్థకు ఈ ఏఎస్సై గురించి చెప్పారు. వారి సూచన మేరకు గురువారం ఉదయం సదరు బాధితుడు ఏఎస్సైకి ఫోన్ చేయగా.. పోలీస్ స్టేషన్‌కు దగ్గరికి వచ్చి తనకు ఫుల్ బాటిల్ ఇవ్వాలని ఏఎస్సై చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి వెళ్లి ఏఎస్సై పరుశరాములకు మద్యం బాటిల్ ఇచ్చాడు. ఏఎస్సై మద్యం బాటిల్ తీసుకుంటుండగా ప్రజాసేవ బాధ్యులు వీడియో చిత్రీకరించారు. అడ్డంగా దొరికిన ఏఎస్సై తీరు చూసి సుబేదారి పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతం విస్తుపోయారు. ఏఎస్సై రైల్వేకు బదిలీ కేసు విషయంలో బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకున్న సుబేదారి పోలీస్‌స్టేన్ ఏఎస్సై పరుశరాములను రైల్వే పోలీస్‌కు బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్టేషన్ అధికారులు సీపీ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. పిటీషన్‌దారు వద్ద నుంచి బాటిల్ తీసుకున్నట్లు విచారణలో రుజువైనందున క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
ఎన్నికల్లో అలాగే..!
సుబేదారి స్టేషన్ సీఐ తీరే వేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వారికి స్వాగతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సహకారం ఇప్పటికీ చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం బలవంతంగా వాహనాలను సేకరించిన సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన నరేందర్ విషయంలో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన ఎన్నికల సమయాల్లో విధులు నిర్వహించే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. 2015 నవంబరులో జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నేతలు నిబంధలను ఉల్లంఘించడానికి కారణమై విమర్శలపాలయ్యూరు. ఉప ఎన్నికల సమయంలో కలెక్టరేట్లో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియ శాంతిభద్రతలను సీఐ నరేందర్ పర్యవేక్షించారు. ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడాల్సిన నరేందర్.. గుంపుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం చెప్పినంత పని చేశారు. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నవంబరు 2న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మరో 25 మంది నేతలతో కలిసి వచ్చి రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురు నేతలే వెళ్లినప్పటికీ మిగిలిన 25 మంది నేతలు కలెక్టరేట్ ఆవరణలోకి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి గేటు మూసి పెట్టినా ఈ నేతలంతా లోపలికి వెళ్లారు. కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ నరేందర్ వీరిని నిరోధించకుండా అందరినీ నవ్వుతూ లోపలికి పంపించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియగానే ముఖ్యనేతలు బయటికి వచ్చారు. అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో ఏదో హడావుడి జరుగుతోందని గమనించిన అదనపు ఎన్నికల అధికారి (డీఆర్వో) శోభ బయటికి వచ్చారు. ఎక్కువ మంది నేతలు లోపలికి వచ్చిన విషయాన్ని గుర్తించారు. అక్కడ విధుల్లో ఉన్న సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమలు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేసే కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురికావడం ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా కలెక్టర్ వి.కరుణ వెంటనే ఈ సంఘటన పూర్వాపరాలను పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబుకు తెలియశేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్ కారణంగానే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అదే అలుసుగా... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు కారణమైనా ఎలాంటి చర్యా లేకపోవడంతో సుబేదారి సీఐ నరేందర్ తీరు మారలేదు. తాజా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణ కోసం బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి కోసం రవాణా వాహనాలను నడిపే వారిపై జులుం ప్రదర్శించి ఎన్నికల విధులకు వీటిని వినియోగించుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సుబేదారి స్టేషన్లో ఖాకీల కోల్డ్‌వార్
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ అధికారి, సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు వచ్చిన సదరు అధికారి వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఆయన వింతపోకడలతో సిబ్బంది ఎవరూ ఆయనకుసహకరించడం లేదని తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందితోపాటు తనపై అధికారులతో కూడా సత్సంబంధాలు లేకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగానే సిబ్బంది ఈ స్టేషన్‌పరిధిలో ప్రజల శాంతిభద్రతలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారి.. ‘సాక్షి’లో మంగళవారం సుబేదారి పోలీస్ అధికారుల పనితీరుపై ‘కాసుల వేటలో కేసులకు పాతర’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివి ఒంటికాలిపై లేచిన సదరు అధికారి.. తన పనితనాన్ని నిరూపించుకునేందుకు ఓ పెద్ద పెండిం గ్ కేసు విచారణలో పడ్డారు. అదేదో హత్యో, దోపిడీ కేసు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన తన సిబ్బందిని పురమారుంచింది చిన్నదాడి కేసు వ్యవహారంలో. హంటర్‌రోడ్‌లో మూడు నెలల క్రితం ఒక వ్యక్తిపై దాడి జరిగిందనే ఆరోపణపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసుల విచారణలోనే అది తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగానే బాధితుడిగా పేర్కొన్న సదరు వ్యక్తి ఫిర్యా దు చేసినట్లు వెల్లడైంది. అరుునా ఇదే కేసులో మళ్లీ విచారించే పని ఉందంటూ హుజూరాబాద్‌లోని అనుమానుతుడి ఇంటికి సదరు అధికా రి ఇద్దరు పోలీసులను పంపించారు. అతడిని పట్టుకుని మాత్రమే స్టేషన్‌కు రావాలని హుకుం జారీచేశారు. ఇంకేముంది అక్కడికి వెళ్లిన పోలీసులు అనుమానితుడి ఇంటి వద్ద నానా హంగామా సృష్టించారు. ఇంట్లో ఉన్న అతడి భార్యను ఇబ్బందులకు గురిచేశారు. తనకు భయంగా ఉందని, తన భర్త వచ్చిన తర్వాత స్టేషన్‌కు పంపుతానని ఆమె చెప్పినా వినకుండా సదరు కానిస్టేబుళ్లు అక్కడే రాత్రి వరకు పడిగాపులు కాశారు. విషయం హన్మకొండ డీఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అధికారిని ఫోన్ చేసి మందలించినట్లు తెలిసిం ది. అయన మాత్రం ‘డీఎస్పీ కాదు.. ఎస్పీ చెప్పినా వినేది లేదు.. పట్టుకురావాల్సిందే’ అంటూ పంతం పట్టారు. కాగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై బుధవారం అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఐజీ డాక్టర్ ఎం కాంతారావుకు ఫిర్యాదు చేయనున్నట్లు హుజురాబాద్‌కు చెందిన సదరు మహిళ పేర్కొంది. ఇలా అసలు కేసులను వదిలేసి.. ఇలాంటి కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది. వివాహిత హత్య కేసు సంగతేంటి..? మార్చి 8న విజయపాల్ కాలనీలో పట్టపగలే ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అనుమానితులుగా భావించి సుమారు 30 మందిని మూడు నెలలుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ప్రతిరోజు వారిని ఉదయం స్టేషన్‌కు పిలిపించడం, సాయంత్రం వరకూ కూర్చోబెట్టడం రాత్రికి ఇంటికి పంపడం నిత్యకృత్యమైంది. ఇలా కేసు విచారణను పూర్తిచేయలేమని తెలిసినా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంలో ఉద్దేశం ఏమిటో సదరు అధికారికే తెలియాల్సి ఉంది. హత్య జరిగి నెలలు గడస్తున్నా కేసు పురోగతి అంగుళం కూడా లేకపోవడం గమనార్హం. దీంతోపాటు నందిహిల్స్‌లో భారీ దోపిడీ జరిగి రోజులు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పోలీసుల వైఫల్యంతో ఈ స్టేషన్ పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడే తిష్ట వేసేందుకు పైరవీ.. ఎన్నికల బదిలీపై వచ్చిన సదరు అధికారి మళ్వీ త్వరలో జరగబోయే బదిలీల్లో ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే తిష్టవేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇక్కడే ఉంటే సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను గాలికి వదిలేయాల్సిందేనని సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.