ఏఎస్సై.. ఫుల్ బాటిల్!
-
పనికావాలంటే.. చేయి, గొంతూ తడపాల్సిందే
-
సుబేదారి పోలీస్‌స్టేషన్ ఏఎస్సై తీరిది
-
బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి
వరంగల్ : హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ ఏఎస్సై తీరు పోలీసు శాఖకు మాయని మచ్చ తెచ్చింది. ప్రతీ కేసు విషయంలో పిటిషన్‌దారుల నుంచి ఏదో ఒకటి వసూలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. సమస్య పరిష్కరించడానికి డబ్బులు లేదా మద్యం బాటిల్ డిమాండ్ చేయడం... ఇచ్చే వరకు పని పూర్తి చేయకపోవడం ఆయన స్టైల్. ఈయన తీరుతో స్టేషన్ అధికారులు, సిబ్బంది సైతం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ ఏఎస్సై ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకుంటూ గురువారం అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి బుధవారం స్టేషన్‌కు వచ్చి మరొక వ్యక్తి నుంచి తనకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేసి పిటిషన్ ఇచ్చారు. ఈ మేరకు సుబేదారి స్టేషన్ అధికారి వాసాల సతీష్‌కుమార్ ఆ ఇద్దరిని పిలిచి సర్దిచెప్పారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక వివరణ ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ఏఎస్‌సై పరుశరాములుకు అప్పగించారు. అయితే ఏఎస్‌సై సీఐ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘నాకు మద్యం బాటిల్ ఇస్తే రేపు పని పూర్తి చేస్తాను’ అని బాధితులతో అన్నాడు. దీంతో బాధితులు ప్రజాసేవ అనే అవినీతి వ్యతిరేక సంస్థకు ఈ ఏఎస్సై గురించి చెప్పారు. వారి సూచన మేరకు గురువారం ఉదయం సదరు బాధితుడు ఏఎస్‌సైకి ఫోన్ చేయగా.. పోలీస్ స్టేషన్‌కు దగ్గరికి వచ్చి తనకు ఫుల్ బాటిల్ ఇవ్వాలని ఏఎస్‌సై చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి వెళ్లి ఏఎస్‌సై పరుశరాములకు మద్యం బాటిల్ ఇచ్చాడు. ఏఎస్సై మద్యం బాటిల్ తీసుకుంటుండగా ప్రజాసేవ బాధ్యులు వీడియో చిత్రీకరించారు. అడ్డంగా దొరికిన ఏఎస్‌సై తీరు చూసి సుబేదారి పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతం విస్తుపోయారు.
ఏఎస్సై రైల్వేకు బదిలీ
కేసు విషయంలో బాధితుడి నుంచి మద్యం బాటిల్ తీసుకున్న సుబేదారి పోలీస్‌స్టేన్ ఏఎస్సై పరుశరాములను రైల్వే పోలీస్‌కు బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్టేషన్ అధికారులు సీపీ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. పిటీషన్‌దారు వద్ద నుంచి బాటిల్ తీసుకున్నట్లు విచారణలో రుజువైనందున క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.