ఆమెకే అగ్రపీఠం
గ్రేటర్‌లో సగం సీట్లు మహిళలకే...
‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’... మహిళల విషయంలో ఎన్నాళ్లగానో వినిపిస్తున్న మాట ఇది.
గ్రేటర్‌లో ఇన్నాళ్లకు ఈ మాట వాస్తవ రూపం దాల్చబోతోంది.
ఇకపై మహిళలు జీహెచ్‌ఎంసీ పాలనలో ‘సగమే’...కాదు...అగ్రభాగం కాబోతున్నారు. ‘మహా’ చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఓటర్లుగా తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలోనే కాదు... కార్పొరేటర్లుగా భాగ్యనగరి తలరాతను మార్చబోతున్నది మహిళలే.
- సాక్షి, సిటీబ్యూరో
మహా నగరపాలక సంస్థ ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు 14 నెలల స్పెషలాఫీసర్ పాలన అనంతరం తిరిగి కొత్త పాలకమండలి కొలువు దీరనుంది. ఈమేరకు ప్రభుత్వం శుక్రవారమే వార్డుల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూలు ఒకదాని వెనుక ఒకటిగా ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను జీహెచ్‌ఎంసీలో తొలిసారిగా అమలు చేస్తున్నారు. దీంతో ఈసారి వారు చక్రం తిప్పనున్నారు.
గత పాలకమండలిలో వారికి 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. అన్నింటా పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళలకు స్థానిక పాలనలోనూ సమానావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 సీట్లకుగాను మహిళలకు 75 సీట్లు రిజర్వు చేశారు. గత పాలకమండలిలో వారికి 50 సీట్లు మాత్రమే లభించాయి. ఇక ఓపెన్ కేటగిరీలో గతంలో 58 సీట్లుండగా, ఈసారి అవి 44కు తగ్గాయి. ఎస్సీలకు గతంలో 12 ఉండగా, ప్రస్తుతం 10కి తగ్గాయి.
గతంలో మహిళలు ప్రాతినిధ్యం వహించిన వార్డులు..
జంగమ్మెట్, యాప్రాల్, అడ్డగుట్ట, పద్మారావునగర్, అల్వాల్, పుురానాపూల్, నవాబ్‌సాహెబ్‌కుంట, మారేడ్‌పల్లి, రెడ్‌హిల్స్, చిలకలగూడ, కాచిగూడ, ఫలక్‌నుమా, రామ్‌గోపాల్‌పేట, గుడిమల్కాపూర్, కార్వాన్, జహనుమా,బౌద్దనగర్, నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, రామ్‌నగర్, ఆర్‌సీపురం, దత్తాత్రేయనగర్. బల్కంపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీ కాలనీ,కర్మాన్‌ఘాట్,బంజారాహిల్స్, చింతల్‌బస్తీ, విజయనగర్‌కాలనీ, దోమలగూడ, గౌతంనగర్, సఫిల్‌గూడ, బేగంపేట, డిఫెన్స్‌కాలనీ, మౌలాలి, గాంధీనగర్, ముషీరాబాద్, అత్తాపూర్, రామకష్ణాపురం, హిమాయత్‌నగర్, తార్నాక, బోరబండ, సరూర్‌నగర్, ఉప్పల్, ఘాన్సిబజార్, నల్లకుంట, అడిక్‌మెట్, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ.
హైకోర్టు ఆదేశాలతోనే..
ఎంసీహెచ్‌గా ఏర్పాటైన నాటినుంచీ పాలకమండలి ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే జరిగాయి. 1970 నాటి నుంచే స్పెషలాఫీసర్లు పాలన కొనసాగించారు. 1970 నుంచి 1986 వరకు , తిరిగి 2007 నుంచి 2016 మధ్య కాలంలో స్పెషలాఫీసర్లుగా పనిచేసినవారు పాతికమందికి పైగా ఉన్నారు.
స్పెషలాఫీసర్ పాలన..
మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి రద్దయిన ప్రతిసారీ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుండటం ఆనవాయితీగా వస్తోంది. 1970 నుంచి 1986 వరకు పాలకమండలి ఎన్నికలు జరుగకపోవడంతో స్పెషల్‌ఆఫీసర్ పాలనే నడిచింది. అనంతరం తిరిగి 1993 నుంచి 2002 వరకు కూడా స్పెషల్‌ఆఫీసర్ పాలనే కొనసాగింది. 2007లో పాలకమండలి గడువు ముగిశాక రెండునెలలపాటు స్పెషలాఫీసర్ పాలన నడిచింది. 2007లో జీహెచ్‌ఎంసీగా అవతరించాక 2009 ఎన్నికలు జరిగేంత వరకు స్పెషలాఫీసర్ పాలనే నడిచింది.
ఏడోసారి ఎన్నికలు..
హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్‌లు విలీనమై ఎంసీహెచ్‌గా అవతరించినప్పటి నుంచి ఎంసీహెచ్ అంతరించే వరకు ఐదు సార్లు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక ఒక పర్యాయం వెరసి ఇప్పటి వరకు మొత్తం ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి నాలుగేళ్లకోమారు 1968 వరకు ఎన్నికలు జరగ్గా, 1968 తర్వాత పద్దెనిమిదేళ్ల వరకు (1986) జరగలేదు. 1986 నుంచి 2002 వరకు 16 సంవత్సరాలు ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోలేదు.
నీవిక్కడుంటే... నేనక్కడుంటా
‘నీవిక్కడుంటే..నేనక్కడుంటా...’ అంటూ మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల వేళ...గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఓ ఒప్పందం గురించి వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. శుక్రవారం తార్నాక డివిజన్‌లో పర్యటించిన ఆయన..గత ఎన్నికల సమయంలో తాను, మంత్రి పద్మారావులు ఓ రహస్య ఒప్పందాన్ని అమలు చేశామని, అదే ‘నీవిక్కడుంటే... నేనక్కడుంటా’ అంటూ సెలవిచ్చారు.
అందులోని పరమార్ధాన్ని ఇలా వివరించారు... ‘2014 సార్వత్రిక ఎన్నికల ముందు..అన్నా నువ్వు టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా సికింద్రాబాద్‌లో ఉండు...నేను తెలుగుదేశం పార్టీ ద్వారా సనత్‌నగర్‌లో ఉంటాను...ఇద్దరం ఎవరి నియోజకవర్గాన్ని వారు అభివృద్ధి చేసుకుందాం అని పద్మారావుకు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఇద్దరం గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే తాము బదురుకున్నాం’ అని తలసాని స్వయంగా తెలపడంతో సభలో నవ్వులు విరిశాయి. సేవ చేసే ఉద్దేశం ఉన్న మాకు గెలిచే అవకాశం కూడా ఉండాలనే ఇలా చేశామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
- లాలాపేట
70 శాతం పోలింగ్ లక్ష్యంగా...
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 70 శాతం పోలింగ్ జరగాలన్నదే మా సుపరిపాలన వేదిక లక్ష్యం. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 శాతమే ఓటేశారు. ఈ సారి ఓటింగ్ శాతం పెంచేందుకు 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాడవాడలా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాం. ఈ సారి ఎన్నికల్లో నేరచరితులకు, బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వరాదని మేము అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్
మహిళామణులకు అందలం
జీహెచ్‌ఎంసీ పదవుల్లో మహిళలకు యాభై శాతం సీట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ప్రజలకు దూరమైన పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మొప్పు పొందే పరిస్థితి లేక అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. వీలైనంత మేరకు ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నాయి. విజ్ఞులైన నగర ప్రజలు ఎవరివైపు ఉంటారో త్వరలో తేలుతుంది.
- టి.పద్మారావు, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి
రిజర్వేషన్లలో శాస్త్రీయత ఏదీ?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో శాస్త్రీయత లోపించింది. ఈ రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం స్వప్రయోజనాలకు పెద్దపీట వేసింది. రిజర్వేషన్లు ప్రకటించి, తగినంత సమయం ఇచ్చాక ఎన్నికల షెడ్యూలు ప్రకటించాలి. కానీ రిజర్వేషన్లు ప్రకటించిన మూడు గంటల్లోనే షెడ్యూలు విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో కుట్ర దాగి ఉంది. మొదటినుంచీ గ్రేటర్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తూనే ఉంది.
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
దళితులను మోసగించారు
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తామన్న కేసీఆర్ దాన్ని పాటించలేదు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ వార్డుల కేటాయింపులోనూ దళితులకు అన్యాయం చేశారు. గతంలో దళితులకు 12 స్థానాలు రిజర్వుకాగా వాటిని 10కి తగ్గించారు. దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప ఎన్నికలు జరపని ప్రభుత్వం...అన్ని విషయాల్లోనూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
- మాగంటి గోపీనాథ్, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
పారదర్శకతకు పాతరేశారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పారదర్శకతకు పాతరేసింది. ఓటర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియ కుదింపు, రిజర్వేషన్ల కేటాయింపు అంశాల్లో అన్నింటా చట్టాలను తుంగలో తొక్కింది. మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తప్ప ప్రభుత్వానికి కనువిప్పు కాలేదు. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు వస్తారని జనం ఊహించలేకపోయారు. అన్ని విలువలను వదిలేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం.
- మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్)
ఇవీ మహిళా రాజ్యాలు..
1. డా.ఏఎస్‌రావునగర్
2. నాచారం
3. చిలుకానగర్
4. హబ్సిగూడ
5. రామంతాపూర్
6. ఉప్పల్
7. నాగోల్
8. హస్తినాపురం
9. సరూర్‌నగర్
10. రామకృష్ణాపురం
11. సైదాబాద్
12. మూసారంబాగ్
13. ఓల్డ్‌మలక్‌పేట
14. ఆజంపురా
15. మొఘల్‌పురా
16. తలాబ్‌చంచలం
17. గౌలిపురా
18. కుర్మగూడ
19. ఐఎస్ సదన్
20. కంచన్‌బాగ్
21. బార్కాస్
22. నవాబ్‌సాహెబ్‌కుంట
23. ఘాన్సిబజార్
24. సులేమాన్‌నగర్
25. రాజేంద్రనగర్
26. అత్తాపూర్
27. మంగళ్‌హాట్
28. లంగర్‌హౌస్
29. గోల్కొండ
30. టోలిచౌకి
31. ఆసిఫ్‌నగర్
32. విజయనగర్‌కాలనీ
33. అహ్మద్‌నగర్
34. రెడ్‌హిల్స్
35. మల్లేపల్లి
36. గన్‌ఫౌండ్రి
37. హిమాయత్‌నగర్
38. కాచిగూడ
39. నల్లకుంట
40. గోల్నాక
41. బాగ్‌అంబర్‌పేట
42. అడిక్‌మెట్
43. ముషీరాబాద్
44. గాంధీనగర్
45. కవాడిగూడ
46. ఖైరతాబాద్
47. వెంకటేశ్వరకాలనీ
48. సోమాజిగూడ
49. అమీర్‌పేట,
50. సనత్‌నగర్
51. ఎర్రగడ్డ
52. హఫీజ్‌పేట
53. చందానగర్
54. భారతీనగర్
55. బాలాజినగర్
56. అల్లాపూర్
57. వివేకానందనగర్
58. చింతల్
59. సుభాష్‌నగర్
60. కుత్బుల్లాపూర్
61. జీడిమెట్ల
62. అల్వాల్
63. నేరేడ్‌మెట్
64. వినాయకనగర్
65. మౌలాలి
66. గౌతమ్‌నగర్
67. అడ్డగుట్ట
68. తార్నాక
69. మెట్టుగూడ
70. సీతాఫల్‌మండి
71. బౌద్దనగర్
72. బన్సీలాల్‌పేట
73. రామ్‌గోపాల్‌పేట
74. బేగంపేట
75. మోండామార్కెట్