ముగిసిన ప్రచారం
ఓటర్లకు ప్రలోభాలు మొదలు
డబ్బులు, మద్యం పంపిణీలో అభ్యర్థులు
అడ్డుకోలేకపోతున్న పోలీసులు
వరంగల్ : వారం రోజులుగా రాజకీయ పార్టీల ప్రచారంతో దద్దరిల్లిన వరంగల్ నగరం నిశ్శబ్దమైంది. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రచార గడువు ముగియడంతో మైకులు ముగబోయాయి. రోడ్‌షోలు నిలిచిపోయాయి.. ఇంటింటి ప్రచారానికి తెరపడింది.. ఓట్ల అభ్యర్థనలు అధికారికంగా ఆగిపోయాయి. ఇక.. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓట్లు పొందేందుకు తమదైన మార్గంలో ప్రయత్నాలు తీవ్రం చేశారు. నగదు, మద్యం పంపిణీ మొదలుపెట్టారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పుడు ఈ పనిలో నిమగ్నమయ్యారు. పలు డివిజన్లలో స్వతంత్రులు కూడా ఇదే పని చేస్తున్నారు. అరుుతే మద్యం, నగదు పంపిణీ విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాగా నమ్మకస్తులైన వ్యక్తులకే పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. డివిజన్లలోని కాలనీల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. వీరిపై పర్యవేక్షణకు సొంత మనుషులను నియమించుకున్నారు. నగదు ఓటర్లకు చేరిందా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు.
మొత్తంగా గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భారీ స్థాయిలో డబ్బు, మద్యం... ఓటర్లకు ప్రలోభాల రూపంలో అందుతోంది. ప్రలోభాల నియంత్రణకు అన్ని ఎన్నికల్లోనూ కీలకంగా పని చేసిన పోలీసులు.. గ్రేటర్ వరంగల్ ఎన్నికలో ఆశించిన మేరకు పనితీరు లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి, ప్రలోభాలను అడ్డుకునే విషయంలో నమోదైన కేసుల సంఖ్య దీన్నే స్పష్టం చేస్తోంది. మొత్తంగా అభ్యర్థుల ప్రలోభాలతో చప్పుడులేని రాజకీయ సందడి పెరిగింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవిని భారీ మెజారిటీతో దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగిన టీఆర్‌ఎస్ అన్ని వ్యవహారాలను ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్‌రావు చూసుకున్నారు. చివరి రోజు వరకు ప్రచారం చేశారు. ఆఖరి రోజు పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు.
టీఆర్‌ఎస్ మరో ముఖ్యనేత కేటీఆర్ సైతం గ్రేటర్ వరంగల్‌లోని పలు డివిజన్లలో రోడ్‌షోతో ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు.
సీపీఎం అభ్యర్థి తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా చివరి రోజు ఎక్కువగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తమను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.
సప్పుడు బంద్
Published Sat, Mar 5 2016 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
Advertisement
Advertisement