గ్రేటర్ తొలి ఫలితం టీఆర్ఎస్‌దే
హైదరాబాద్ : గ్రేటర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారనే ఉత్కంఠకు తెర పడినట్లే. మొట్టమొదటి ఫలితం కూడా వెలువడింది. మాదాపూర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ విజయం సాధించారు. గ్రేటర్‌లో 150 డివిజన్లకు ఈ నెల 2న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి వుండగా పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్ రీపోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఆ తరువాతే అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు కోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,626 మంది విధుల్లో పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
అలాగే మెదక్ జిల్లాలో గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహెచ్ఈఎల్లో హోలిక్రాప్ నర్సింగ్ స్కూల్లో పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్నారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ సెంటర్‌లోకి వెళ్లేవారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 127 ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రం ఐదుగంటల తర్వాత ఫలితం వెలువడనుంది.