ఐటీ హబ్‌గా ఓరుగల్లు
హసన్‌పర్తి: వరంగల్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) హబ్‌గా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. వరంగల్ జిల్లాకు మరిన్ని ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు అవసరమైన స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్‌లోనూ త్వరలోనే ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండలో సైయంట్ న్యూ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ టవర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఒక్క సైయంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీలోనే వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు ఉంటే.. అందులో 7 వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని వివరించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు రెండు, మూడు కంపెనీలు ఉత్సాహం కనబరుస్తున్నాయన్నారు. మున్ముందు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వరంగల్ నిట్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మడికొండలోని ఇంక్యుబేషన్ టవర్ రెండో దశకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
టాస్క్ ద్వారా తర్ఫీదు
ఇంజనీరింగ్‌తో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపా ధి అవకాశాలు మెరుగుపరిచేందుకు టాస్క్ పేరుతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలి పారు. ఈ శిక్షణతో చదువు పూర్తయిన వెంటనే క్యాం పస్ ప్లేస్‌మెంట్ ద్వారా విద్యార్థులు ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, సైయంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ అధినేత మోహన్‌రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సైయంట్ సెంటర్‌కు శంకుస్థాపన అనంతరం మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.