47 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనీస విద్యా ప్రమాణాలు పాటించని వివిధ కళాశాలల గుర్తింపును రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు తగిన రీతిలో లేని కారణంగా 47 ఇంజనీరింగ్ కళాశాలలు, 17 ఫార్మసీ కళాశా లలు, 10 ఎంబీఏ కళాశాలల గుర్తింపును రద్దు చేశామని ఈ అంశంపై మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నకు కడియం బదులిచ్చారు. రాష్ట్రంలో అవసరానికి మించి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, కన్వీనర్ కోటా సైతం భర్తీ అయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో సైతం ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలన దశలోనే ఉందన్నారు.
ప్రభుత్వ ప్రకటనల ఖర్చు రూ. 872 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వ పథకాలు, జర్నలిస్టుల సంక్షేమానికి కలిపి సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా రూ. 872 కోట్ల మేర ఖర్చు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. 2014–15లో రూ.102 కోట్లు, 2015–16లో 265.86 కోట్లు, 2016–17లో రూ. 505.92 కోట్లు ఖర్చు పెట్టామని షబ్బీర్ అలీ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, అభివృద్ధిని దేశానికి చాటేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు బడ్జెట్‌కు లోబడే ప్రకటనలు జారీ చేశామన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే చర్యలు మొదలు పెట్టామని, వెల్‌నెస్ కార్డులు సైతం ఇచ్చామని మంత్రి తెలిపారు.
మూసీ సుందరీకరణకు స్పెషల్ అథారిటీ
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణకు స్పెషల్ అథారిటీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ. 2,960 కోట్లతో పీపీపీ పద్ధతిలో సుందరీకరణ పనులు చేపట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 93 శాతం మురుగు మూసిలోకే వెళ్తోందని, మురుగు నీటిని శుద్ధి చేయకుండా సుందరీకరణ సాధ్యం కాదన్నారు.
నారదాసు దంపతులకు శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఆదర్శ వివాహం చేసుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్షలకు శాసనమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మండలి టీ విరామ సమయంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, పోచారం, ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో పాటు మండలి సభ్యులంతా కలసి అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేక్‌ను నవదంపతులతో కట్ చేయించారు.
మండలిలో ప్రశ్నోత్తరాలు
Published Wed, Dec 28 2016 12:32 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement