పబ్లిక్‌ చార్జింగా.. బుక్‌ అయిపోతారు! | Public Charging Stations May Hack Your Smartphone | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 4:40 AM | Last Updated on Thu, Jan 3 2019 4:40 AM

Public Charging Stations May Hack Your Smartphone - Sakshi

పబ్లిక్‌ వైఫైలు వాడితే ఇబ్బంది ఉంటుందని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఇలా చార్జింగ్‌ చేసుకున్నా సమస్యలు తప్పవని ఇటీవలే తెలిసింది. ఇందులో టెక్నిక్‌ చాలా సింపుల్‌. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్‌ స్టేషన్లతోపాటు చాలా షాపింగ్‌ మాళ్లలో స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఉంటాయి కదా.. హ్యాకర్లు అక్కడి యూఎస్‌బీ పోర్ట్‌లను మార్చేస్తారు. ఇదేమీ తెలియని మనం ఆ పోర్ట్‌కు మన ల్యాప్‌టాప్‌/ఫోన్‌లను కనెక్ట్‌ చేశామనుకోండి. గాడ్జెట్లు చార్జ్‌ అవుతాయిగానీ.. అదే సమయంలో వాటిలోని వివరాలను హ్యాక్‌ చేసేందుకు తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట. హ్యాకర్లు మార్చేసిన యూఎస్‌బీ పోర్టులోనే సమాచారాన్ని తస్కరించేందుకు, స్టోర్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండటంతో ఇది సాధ్యమవుతుందన్నమాట. లేదంటే.. స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌లోకి దురుద్దేశపూర్వకమైన మాల్‌వేర్‌ను జొప్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాల్‌వేర్‌ ద్వారా డేటా మొత్తాన్ని లాక్‌ చేసేసి ఓపెన్‌ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేయవచ్చు. లేదంటే మీ బ్యాంక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయి (పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌ వంటివి మీరు గాడ్జెట్‌లో స్టోర్‌ చేసుకుని ఉంటే) డబ్బులు కాజేసేందుకూ అవకాశం ఉంటుంది. దీన్నే జ్యూస్‌ జాకింగ్‌ అంటారు. 

కొత్తదేమీ కాదు..
సైబర్‌ ప్రపంచంలో జ్యూస్‌ జాకింగ్‌ పేరు వినపడటం మొదలైంది ఈ మధ్యనే అయినప్పటికీ 2011లోనే కొంతమంది టెకీలు ఈ ప్రక్రియతో పాటు పేరును కూడా ఖాయం చేశారు. ఆ ఏడాది జరిగిన అంతర్జాతీయ హ్యాకర్ల సమావేశం డెఫ్‌కాన్‌లో కొంతమంది మార్చేసిన యూఎస్‌బీ పోర్టులతో ఒక చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గాడ్జెట్‌ ఏదీ చార్జింగ్‌కు లేనప్పుడు ఈ స్టేషన్‌ తాలూకూ ఎల్‌సీడీ తెరపై ఉచిత చార్జింగ్‌ కేంద్రం అన్న ప్రకటన చూపుతూ ఉండగా.. స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌ను అనుసంధానించగానే సమాచారాన్ని దోచుకునే మాల్‌వేర్‌ను జొప్పించేశారు. ఆ తరువాత దీని గురించి గాడ్జెట్‌ యజమానులకు వివరించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కూడా. అయితే అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకూ ఈ జ్యూస్‌ జాకింగ్‌ను వాడింది చాలా తక్కువ. ఢిల్లీ రాజధానిలో ఒక యువకుడి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకర్లు ఇలా జ్యూస్‌ జాక్‌ చేశారన్న వార్తలు రావడంతో వారం పది రోజులుగా దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. 

మరి ఏం చేయాలి?
ఏముంది.. ఎక్కడపడితే అక్కడ చార్జింగ్‌ చేసుకోకపోతే సగం సమస్యలు తీరిపోయినట్లే. ఇది జరగాలంటే వీలైనంత వరకూ మన ఫోన్‌/ల్యాప్‌టాప్‌ ఇంట్లోనే ఫుల్‌గా చార్జ్‌ చేసుకోవాలి. లేదంటే.. ల్యాప్‌టాప్‌ బ్యాటరీ ఒకటి ఎక్స్‌ట్రా పట్టుకెళ్లడం స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్‌ ఒకటి అందుబాటులో ఉంచుకోవడం. ఇవేవీ కుదరపోతే ఇంకో మార్గమూ ఉంది. చార్జింగ్‌ స్టేషన్లలోని యూఎస్‌బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ ప్లగ్‌ల ద్వారా మీదైన చార్జర్‌తో ఫోన్‌/ల్యాప్‌టాప్‌ చార్జ్‌ చేసుకోండి. ఎందుకంటే విద్యుత్తు ప్రవహించే చోట్ల డేటా ట్రాన్స్‌ఫర్‌ సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్‌ యూఎస్‌బీ పోర్టు ద్వారానే చార్జ్‌ చేసుకోవాల్సి వస్తే.. మీ గాడ్జెట్‌ను ఆఫ్‌ చేసేయండి. దీంతో కూడా డేటా ట్రాన్స్‌ఫర్‌ జరగదు కాబట్టి ఎవరూ మీ గాడ్జెట్‌లోకి మాల్‌వేర్‌ను వేయడంగానీ.. సమాచారాన్ని తస్కరించడం గానీ జరగదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement