Power Banks
-
పవర్ బ్యాంక్ కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
ఈ రోజు చాలా వరకు స్మార్ట్ఫోన్లు పెద్ద బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మన బ్యాటరీ తొందరగా ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా వేదించే సమస్య బ్యాటరీ. అందుకే వారు తమ వేంట తప్పనిసరిగా పవర్ బ్యాంక్ తీసుకెళ్తుంటారు. మనం పవర్ బ్యాంక్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. చాలా వరకు పవర్ బ్యాంక్ కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనుగోలు చేయమని సలహాలు ఇస్తుంటాయి. అయితే, మనం వారి మార్కెట్ బుట్టలో పడవద్దు. మన వాడే మొబైలును బట్టి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలి. ఉదా: ఫోన్ యొక్క బ్యాటరీ సామర్ధ్యం అనేది 4000 ఎంఏహెచ్ అనుకుంటే 10,000 ఎంఏహెచ్ సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు ఔట్పుట్ వచ్చేది సుమారు 8,000 ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకుల తీసుకునేటప్పుడు కొలతలు, బరువు, ఆకారం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి. పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది. ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే. మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, ఛార్జింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది. ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల జీవితం ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే. చదవండి: ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది -
499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. మీరు కూడా కొత్త పవర్ బ్యాంక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది ఒక మంచి సమయం. అమెజాన్ లో తాజాగా పవర్ బ్యాంక్ డేస్ సేల్ ఈ రోజు (డిసెంబర్ 13) నుండి నిర్వహిస్తుంది. ఈ సేల్ మూడు రోజుల పాటు(డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 15) కొనసాగుతుంది. ఈ సేల్ లో మీకు తక్కువ ధరకే మంచి నాణ్యత గల పవర్ బ్యాంక్ లు లభిస్తాయి. ఈ సేల్ లో తీసుకొచ్చిన కొన్ని పవర్ బ్యాంకు వివరాలు మీకు అందిస్తున్నాం.(చదవండి: నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్) రెడ్మీ పవర్‌బ్యాంక్: రెడ్మి యొక్క ఈ పవర్ బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది, దీని ధర 699 రూపాయలు మాత్రమే. పవర్‌బ్యాంక్ బరువు 246.5 గ్రాములు. ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. దీనికి రెండు అవుట్‌పుట్ పోర్టులు మరియు రెండు ఇన్పుట్ పోర్టులు ఉన్నాయి.| అంబ్రేన్ పవర్‌బ్యాంక్: అంబ్రేన్కు చెందిన ఈ పవర్‌బ్యాంక్ ధర 649 రూపాయలు. పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 7 గంటలు పడుతుంది. సిస్కా పవర్‌బ్యాంక్: సిస్కోకు చెందిన 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ పవర్‌బ్యాంక్ ధర రూ.599. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా లభిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పవర్‌బ్యాంక్‌లో ఓవర్ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ రక్షణ కూడా ఇవ్వబడింది. యూఆర్బీఎన్(URBN) పవర్‌బ్యాంక్: యూఆర్బీఎన్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్ లో అతి తక్కువ ధరకు రూ.499 లభించేది ఇదే. ఈ అల్ట్రా స్లిమ్ పవర్‌బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది 12వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్‌బ్యాంక్ బరువు కేవలం 354 గ్రాములు. -
పబ్లిక్ చార్జింగా.. బుక్ అయిపోతారు!
పబ్లిక్ వైఫైలు వాడితే ఇబ్బంది ఉంటుందని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఇలా చార్జింగ్ చేసుకున్నా సమస్యలు తప్పవని ఇటీవలే తెలిసింది. ఇందులో టెక్నిక్ చాలా సింపుల్. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్ స్టేషన్లతోపాటు చాలా షాపింగ్ మాళ్లలో స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ స్టేషన్లు ఉంటాయి కదా.. హ్యాకర్లు అక్కడి యూఎస్బీ పోర్ట్‌లను మార్చేస్తారు. ఇదేమీ తెలియని మనం ఆ పోర్ట్‌కు మన ల్యాప్‌టాప్/ఫోన్లను కనెక్ట్ చేశామనుకోండి. గాడ్జెట్లు చార్జ్ అవుతాయిగానీ.. అదే సమయంలో వాటిలోని వివరాలను హ్యాక్ చేసేందుకు తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట. హ్యాకర్లు మార్చేసిన యూఎస్బీ పోర్టులోనే సమాచారాన్ని తస్కరించేందుకు, స్టోర్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండటంతో ఇది సాధ్యమవుతుందన్నమాట. లేదంటే.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌లోకి దురుద్దేశపూర్వకమైన మాల్వేర్ను జొప్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాల్వేర్ ద్వారా డేటా మొత్తాన్ని లాక్ చేసేసి ఓపెన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయవచ్చు. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయి (పాస్వర్డ్, యూజర్‌నేమ్ వంటివి మీరు గాడ్జెట్‌లో స్టోర్ చేసుకుని ఉంటే) డబ్బులు కాజేసేందుకూ అవకాశం ఉంటుంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. కొత్తదేమీ కాదు.. సైబర్ ప్రపంచంలో జ్యూస్ జాకింగ్ పేరు వినపడటం మొదలైంది ఈ మధ్యనే అయినప్పటికీ 2011లోనే కొంతమంది టెకీలు ఈ ప్రక్రియతో పాటు పేరును కూడా ఖాయం చేశారు. ఆ ఏడాది జరిగిన అంతర్జాతీయ హ్యాకర్ల సమావేశం డెఫ్‌కాన్‌లో కొంతమంది మార్చేసిన యూఎస్బీ పోర్టులతో ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గాడ్జెట్ ఏదీ చార్జింగ్కు లేనప్పుడు ఈ స్టేషన్ తాలూకూ ఎల్సీడీ తెరపై ఉచిత చార్జింగ్ కేంద్రం అన్న ప్రకటన చూపుతూ ఉండగా.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌ను అనుసంధానించగానే సమాచారాన్ని దోచుకునే మాల్వేర్ను జొప్పించేశారు. ఆ తరువాత దీని గురించి గాడ్జెట్ యజమానులకు వివరించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కూడా. అయితే అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకూ ఈ జ్యూస్ జాకింగ్‌ను వాడింది చాలా తక్కువ. ఢిల్లీ రాజధానిలో ఒక యువకుడి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకర్లు ఇలా జ్యూస్ జాక్ చేశారన్న వార్తలు రావడంతో వారం పది రోజులుగా దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. మరి ఏం చేయాలి? ఏముంది.. ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ చేసుకోకపోతే సగం సమస్యలు తీరిపోయినట్లే. ఇది జరగాలంటే వీలైనంత వరకూ మన ఫోన్/ల్యాప్‌టాప్ ఇంట్లోనే ఫుల్‌గా చార్జ్ చేసుకోవాలి. లేదంటే.. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఒకటి ఎక్స్ట్రా పట్టుకెళ్లడం స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్ ఒకటి అందుబాటులో ఉంచుకోవడం. ఇవేవీ కుదరపోతే ఇంకో మార్గమూ ఉంది. చార్జింగ్ స్టేషన్లలోని యూఎస్బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్‌ల ద్వారా మీదైన చార్జర్‌తో ఫోన్/ల్యాప్‌టాప్ చార్జ్ చేసుకోండి. ఎందుకంటే విద్యుత్తు ప్రవహించే చోట్ల డేటా ట్రాన్స్ఫర్ సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ యూఎస్బీ పోర్టు ద్వారానే చార్జ్ చేసుకోవాల్సి వస్తే.. మీ గాడ్జెట్‌ను ఆఫ్ చేసేయండి. దీంతో కూడా డేటా ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి ఎవరూ మీ గాడ్జెట్‌లోకి మాల్వేర్ను వేయడంగానీ.. సమాచారాన్ని తస్కరించడం గానీ జరగదు. -
కేరళ వరదలు: షావోమి విరాళం ఏంటంటే..
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. వేలకోట్ల రూపాయలను నష్టపోయిన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి నడుం బిగించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో రారాజులా వెలుగొందుతున్న షావోమి రంగంలోకి దిగడం విశేషం. వరద ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సాయపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజల సహాయార్దం ముందుకు వచ్చింది. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు పూర్తిగా చార్జింగ్ చేసిన వేలాది పవర్ బ్యాంకులను ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి బాక్స్‌ను వాలంటీర్లకు అందించామని షావోమీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవర్ బ్యాంకులకు చార్జింగ్ చేసిన తమ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా గత శతాబ్ద కాలంలో లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమైన వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దాదాపు మూడున్నర లక్షలమంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. #Xiaomi is supplying thousands of fully charged Mi PowerBanks to relief camps in #Kerala, with help of @CNNnews18. Respect for our team members for charging these powerbanks & helping our countrymen! 1st box being handed over to a volunteer. #XiaomiWithKerala #KeralaFloods pic.twitter.com/BtoMbdVbPV — Manu Kumar Jain (@manukumarjain) August 18, 2018 -
రూ.799కి ఫ్లిప్‌కార్ట్ కొత్త గాడ్జెట్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన బిలియన్ బ్రాండ్‌ను విస్తరిస్తోంది. ఈ బ్రాండు కింద కొత్తగా రెండు పవర్ బ్యాంక్‌లను లాంచ్ చేసింది. ఒకటి 10000ఎంఏహెచ్ వెర్షన్ దీని ధర 799 రూపాయలు. రెండోది 15000ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన మోడల్. దీని ధర 999 రూపాయలు. ఈ రెండు మోడల్స్ మల్టిపుల్ యూఎస్బీ పోర్ట్స్‌ను కలిగి ఉన్నాయి. అన్ని యూఎస్బీ పోర్ట్స్‌కి కూడా 5వీ / 2.1ఏ పవర్ అవుట్‌పుట్ సామర్థ్యం ఉంది. ''ఏ+ గ్రేడ్'' ''లిథియం-అయాన్'' బ్యాటరీస్తో ఇది రూపొందాయి. ఫ్లిప్‌కార్ట్ గతేడాది జూలైలో తన బిలియన్ బ్రాండును మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండు కింద తొలి ప్రొడక్ట్‌గా బిలియన్ క్యాప్చర్+ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ రెండు పవర్ బ్యాంక్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్, కాపర్, రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఈ పవర్ బ్యాంక్‌లకు ఎల్ఈడీ టార్చ్ కూడా ఉంది. ఏడు రకాల భద్రతాపరమైన ఫీచర్లతో బిలియన్ పవర్ బ్యాంక్‌లను తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. వాటిలో అండర్-ఓల్టేజీ, ఓవర్ ఓల్టేజీ ప్రొటెక్షన్, బిల్ట్-ఇన్ ప్రొటెక్షన్, షార్ట్-సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉన్నాయి. టాప్-సెల్లింగ్ పవర్ బ్యాంక్‌ల కంటే 13 శాతం తేలికగా ఉన్నట్టు కూడా కంపెనీ తెలిపింది. డిజైన్ పరంగా రంగుల నుంచి కూడా భారతీయులు అభిరుచులకు అనుగుణంగా ఈ పవర్ బ్యాంక్‌లను వీటిని రూపొందించామని, భారతీయులు ఎక్కువగా రోజ్ గోల్డ్, కాపర్ కలర్స్‌ను ఇష్టపడతారని బిలియన్ కేటగిరీ హెడ్ హ్రిషికేష్ థైట్ తెలిపారు. ఈ పవర్ బ్యాంక్‌లకు ఏడాది పాటు ఇంటి వద్దనే సర్వీసు వారెంటీని కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం వీటిని యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాగ, ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ కూడా రూ.799కే లభ్యమవుతోంది. -
పవర్ బ్యాంక్ పేరుతో బురిడీ
చిట్టినగర్(విజయవాడవెస్ట్): సార్ పవర్ బ్యాంక్ హోనా.. రూ. 8 వందలది.. నాలుగు వందలకే ఇస్తాం.. సార్.. మేము ఢిల్లీలో కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇలా తిరుగుతూ అమ్ముకుంటాం సార్.. అంటూ ఆ మహిళలు నకిలీ పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ప్రతి నిత్యం తమ మాటల చాతుర్యంతో వందల సంఖ్యలో పవర్ బ్యాంక్‌లను ఫోన్ వినియోగదారులకు అంటకడుతున్నారు. అయితే మార్కెట్లో వేల రూపాయలలో ఉండే పవర్ బ్యాంక్ తక్కువ ధరకు వస్తుందని చెప్పి వెనుక ముందు ఆలోచించకుండా వందలాది రూపాయలు పెట్టి పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పవర్ బ్యాంక్‌ను పరిశీలిస్తే అందులో కేవలం సాదారణ మొబైల్ ఫోన్లో ఉండే తక్కువ రకం బ్యాటరీ ఉంటుంది. అంతా కలుపుకుంటే రూ.50 లోపే ఉంటుంది. గుట్టు రట్టు చేసిన పోలీసులు..... ముగ్గురు.. నలుగురు మహిళలు ఇటువంటి పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తూ శుక్రవారం పంజా సెంటర్, చిట్టినగర్, సాయిరాం థియేటర్, పాలప్రాజెక్టు మీదగా కబేళా సెంటర్‌కు చేరుకున్నారు. అయితే నైనవరం ఫ్లై ఓవర్ వద్ద పోలీసు సిబ్బంది ఈ పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్న మహిళల మాటలపై అనుమానంతో వాటిని పరిశీలించారు. చివరకు అవి నకిలీవి అని తేలడంతో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఒక్క రోజు వీరు సుమారు రెండు వందలకు పైగా ఈ నకిలీ పవర్ బ్యాంక్‌లను విక్రయించినట్లు చెబుతున్నారు. -
ఒక్క రూపాయికే రెడ్మి నోట్4... షియోమి ఆఫర్ అదుర్స్
రెడ్మి ఫోన్ల సంచలన విక్రయాలతో రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4 కొనుగోలు చేసుకునేలా రూ.1 ఫ్లాష్ సేల్ ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 6న నిర్వహించబోతున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్' లో భాగంగా తమ యాప్ ద్వారా కొనుగోలు చేసే ఉత్పత్తులను ఒక్క రూపాయికే అందించనున్నట్టు షియోమి ప్రకటించింది. యాప్ తో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్ కు షియోమి ఉత్పత్తులపై ఆఫర్లు పొందాలంటే కచ్చితంగా తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని, రిజిస్ట్రర్ చేసుకోవాల్సిందేనని ప్రకటించింది. ఎంఐ.కామ్ సైట్పైనా ఈ ఫెస్టివల్ ను కంపెనీ నిర్వహిస్తోంది. అయితే యాప్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ విక్రయం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం 20 రెడ్మి నోట్4 స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఒక్క రూపాయికి ఎంఐ స్టోర్ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకూ ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ సేల్ లో మాత్రం ఎంఐ బ్యాండ్ 2 లు రూపాయికి అందుబాటులో ఉంటాయి. అవి కూడా 40 యూనిట్లేనని తెలిపింది. అదేసమయంలో 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకులను 50 మేర విక్రయించనున్నట్టు ప్రకటించింది. వన్-డే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్మి 4ఏ, రెడ్మి నోట్ 4 ఫోన్లను విక్రయానికి అందుబాటులో ఉంచనుంది. ఇతర స్మార్ట్ ఫోన్లు రెడ్మి 3 ఎస్ ప్రైమ్, ఎంఐ 5, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్ లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. షియోమి ఇతర ఉత్పత్తులు ఎయిర్ ఫ్యూరిఫైయర్, ఇయర్ ఫోన్లు, ఎంఐ బ్యాండ్ వంటి అన్ని ఉత్పత్తులపైనా 500 రూపాయిల వరకు తగ్గింపును కంపెనీ ఇవ్వనుంది. గురువారం నిర్వహించబోయే ఈ సేల్ కు బుధవారం వరకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. 10 గంటల నుంచి సేల్ ప్రారంభించి, స్టాక్ అయిపోయే వరకు ఈ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.