ఒక్క రూపాయికే రెడ్మి నోట్4... షియోమి ఆఫర్ అదుర్స్
ఒక్క రూపాయికే రెడ్మి నోట్4... షియోమి ఆఫర్ అదుర్స్
Published Tue, Apr 4 2017 3:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
రెడ్మి ఫోన్ల సంచలన విక్రయాలతో రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4 కొనుగోలు చేసుకునేలా రూ.1 ఫ్లాష్ సేల్ ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 6న నిర్వహించబోతున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్' లో భాగంగా తమ యాప్ ద్వారా కొనుగోలు చేసే ఉత్పత్తులను ఒక్క రూపాయికే అందించనున్నట్టు షియోమి ప్రకటించింది. యాప్ తో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్ కు షియోమి ఉత్పత్తులపై ఆఫర్లు పొందాలంటే కచ్చితంగా తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని, రిజిస్ట్రర్ చేసుకోవాల్సిందేనని ప్రకటించింది.
ఎంఐ.కామ్ సైట్పైనా ఈ ఫెస్టివల్ ను కంపెనీ నిర్వహిస్తోంది. అయితే యాప్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ విక్రయం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం 20 రెడ్మి నోట్4 స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఒక్క రూపాయికి ఎంఐ స్టోర్ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకూ ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ సేల్ లో మాత్రం ఎంఐ బ్యాండ్ 2 లు రూపాయికి అందుబాటులో ఉంటాయి. అవి కూడా 40 యూనిట్లేనని తెలిపింది. అదేసమయంలో 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకులను 50 మేర విక్రయించనున్నట్టు ప్రకటించింది.
వన్-డే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్మి 4ఏ, రెడ్మి నోట్ 4 ఫోన్లను విక్రయానికి అందుబాటులో ఉంచనుంది. ఇతర స్మార్ట్ ఫోన్లు రెడ్మి 3 ఎస్ ప్రైమ్, ఎంఐ 5, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్ లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. షియోమి ఇతర ఉత్పత్తులు ఎయిర్ ఫ్యూరిఫైయర్, ఇయర్ ఫోన్లు, ఎంఐ బ్యాండ్ వంటి అన్ని ఉత్పత్తులపైనా 500 రూపాయిల వరకు తగ్గింపును కంపెనీ ఇవ్వనుంది. గురువారం నిర్వహించబోయే ఈ సేల్ కు బుధవారం వరకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. 10 గంటల నుంచి సేల్ ప్రారంభించి, స్టాక్ అయిపోయే వరకు ఈ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.
Advertisement
Advertisement