ఒక పొయ్యి.. రెండు వెలుగులు
పొగ... కాలుష్యం లేని కట్టెల పొయ్యి వంటకే కాక ఫోన్ చార్జింగ్‌కూ ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతోనే ఊపిరిపోసుకుంది బయోలైట్ స్టవ్. ఏటా ఎంతోమంది ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడకుండా కాపాడుతోంది ఈ స్టవ్.
వంట పొయ్యిల మీద పరిశోధన చే సే ఒక అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు సగం ప్రపంచం కట్టెల పొయ్యిల మీదే వంట వండుకుంటోంది. ఆరుబయట వండే పొయ్యిల నుంచి వచ్చే పొగ, కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారని 2011లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వంటింట్లో ఉండే పొయ్యిలను కూడా కలిపితే ఈ సంఖ్య 35 లక్షలుగా ఉంటుందంటూ 2012లో లెక్క గట్టింది. గ్రామాల్లో ఇలాంటి వంట పొయ్యిలతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తు కాగా.. కరెంటు కోతలు మరో ఎత్తు. కరెంటు సౌకర్యం లేని ప్రాంతాలూ ఎక్కువే. మారుమూల ప్రాంతాల్లోనూ సెల్‌ఫోన్ల వినియోగం పెరిగిపోతున్న తరుణంలో వాటి చార్జింగ్‌కు కరెంటు కొరతతో ఇబ్బందే. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లుగా.. ఒక్క స్టవ్‌తో ఈ రెండు సమస్యలను పరిష్కరించారు న్యూయార్క్‌కి చెందిన జొనాథన్ సెడార్, అలెక్ డ్రమండ్.
స్టవ్ పనిచేసేదిలా..
మంటలోని వేడిమిని విద్యుచ్ఛక్తి కింద మార్చేలా హోమ్‌స్టవ్‌ని డిజైన్ చేశారు. మంటను ఎగదోయడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న ఫ్యాన్ ఈ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల 50 శాతం మేర ఇంధనం ఆదా అవుతుంది. ఇక స్టవ్ నుంచి వెలువడే పొగ 94 శాతం మేర, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు 91 శాతం తగ్గుతాయి. మరోవైపు, ఈ స్టవ్‌కు ఒక యూఎస్‌బీ పోర్టును అమర్చారు. దీనితో.. ఫోన్లూ, ఎల్‌ఈడీ లైట్లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు.
ఏటా 72 డాలర్ల ఆదా..
ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో టూర్లకు వెళ్లినప్పుడు ఉపయోగించుకునేలా క్యాంప్‌స్టవ్‌ని సెడార్, డ్రమండ్ రూపొందించారు. అయితే, ఆ తర్వాత వర్ధమాన దేశాల్లో దీని ఉపయోగాన్ని గుర్తించి మరింత మందికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం, మన దేశంతో పాటు ఉగాండా, ఘనాలో బయోలైట్ స్టవ్‌లను విక్రయిస్తున్నారు. మన దేశంలో ఉస్మానాబాద్, అహ్మదాబాద్, మంగళూరు దగ్గర్లోని ఒజిరేలో ఈ స్టవ్‌లను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. హోమ్‌స్టవ్‌ని ఉపయోగించడం ద్వారా భారత్‌లో ఒక కుటుంబం సగటున ఏటా 72 డాలర్ల మేర (సుమారు రూ.4,500) ఆదా చేయొచ్చని (సెల్ ఫోన్, ఎల్‌ఈడీ లైటింగ్ చార్జింగ్‌కయ్యే కరెంటు ఖర్చులు, ఇంధన వ్యయాలు కలిపి) బయోలైట్ సంస్థ చెబుతోంది. హోమ్‌స్టవ్‌కి వచ్చే స్పందనను బట్టి రేటును సుమారు 45-60 డాలర్ల స్థాయిలో నిర్ణయించే అవకాశముంది. ఇది ఎక్కువగానే అనిపించినా.. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంధన వ్యయాలతో పోలిస్తే ఈ పెట్టుబడిని 4 నుంచి 8నెలల్లోగా రాబట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం క్యాంప్ స్టవ్‌లను 130 డాలర్లకు విక్రయిస్తోంది.