సరైన ఆచరణతోనే సంపద సృష్టి! | New Year Resolutions to Achieve Financial Success in 2024 | Sakshi
Sakshi News home page

సరైన ఆచరణతోనే సంపద సృష్టి!

Published Mon, Jan 1 2024 5:43 AM | Last Updated on Mon, Jan 1 2024 6:49 AM

New Year Resolutions to Achieve Financial Success in 2024 - Sakshi

సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్‌లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు.  

మనీ ఒక్కటేనా..?
అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్‌ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం.
     
దీర్ఘ ప్రయాణం
సంపద సృష్టించడం అన్నది ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్‌ కట్స్, ఇన్‌స్టంట్స్‌ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి.

సంపద అంటే..?
సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి.   

ఆదాయం.. వ్యయం..
ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్‌ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్‌ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్‌ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి.

వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్‌ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్‌లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది.  

సరైన సాధనాలు
సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్‌ ప్లాన్లు, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి.

ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లలోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్‌ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్‌ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్‌ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌పీఎస్‌ వంటి పథకాలను పరిశీలించొచ్చు.

పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజులు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్‌ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్‌ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు.  

ఇతరులను అనుసరించడం
ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్‌ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్‌ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్‌ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి.  

ఆర్థిక రక్షణ
మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్‌ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్‌ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.  

రాబడి ఒక్కటే కాదు..
పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్‌ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్‌ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్‌ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్‌ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.  

తప్పులకు దూరంగా..
పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్‌ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్‌ ఫండ్స్‌ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్‌బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్‌ మేనేజర్లపై వేయాలి.   

లక్ష్యం.. ప్రణాళిక
ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్‌ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి.  

రుణాలు–చెల్లింపులు
తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి.
 
నామినేషన్‌
చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్‌ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్‌ ఖాతాలు, ఈపీఎఫ్‌ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్‌ లేకపోతే వెంటనే నమోదు చేయాలి.

మార్గమిది...
లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలి.    

స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం .   

ఇన్‌స్టంట్‌ సక్సెస్‌: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి
ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి.  

కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు.  

ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్‌ తెలిసి ఉండాలి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement