సంపద సృష్టికి సక్సెస్ మార్గం! | Success is the Path to Wealth Creation | Sakshi
Sakshi News home page

సంపద సృష్టికి సక్సెస్ మార్గం!

Published Mon, Sep 11 2023 7:36 AM | Last Updated on Mon, Sep 11 2023 1:00 PM

Success is the Path to Wealth Creation - Sakshi

పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా మలిచి, మంచి రాబడి తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఈ విషయంలో సక్సెస్‌ చూసే వారు కొద్ది మందే ఉంటారు. పెట్టుబడి అనేది వాస్తవిక దృక్పథం, విస్తృతమైన అధ్యయనం, సమాచార విశ్లేషణ ఆధారంగానే ఉండాలి. లేదంటే.. చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంతగా అధ్యయనం చేసినప్పటికీ, ఒక్క తప్పు దొర్లినా ఆశించిన ఫలితం రాకుండా పోతుంది. అందుకే మంచి రాబడి కోసం పెట్టుబడి ఉంటే చాలదు. అనుసరించే మార్గం తెలియాలి. ఇన్వెస్టర్‌గా ఎలాంటి తప్పులు చేయకూడదనే అవగాహన కలిగి ఉండాలి. నువమా వెల్త్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ జైన్‌ పెట్టుబడుల విషయంలో ఎలాంటి తప్పులకు దూరంగా ఉండాలనే విషయాల గురించి వెల్లడించారు.   

తగినంత వ్యవధి
పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలి. పెట్టుబడుల విజయానికి ఇది కీలకం అవుతుంది. నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల సమీక్షకు కొంత సమయం కేటాయించుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లు కీలకమైన ఈ సమీక్షకు దూరంగా ఉంటుంటారు. ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను కలసి పెట్టుబడుల విషయంలో వారి నుంచి కీలక సూచనలు తీసుకోవాలి. దీనివల్ల మీరు అనుసరిస్తున్న పెట్టుబడులు మీ లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయా? అన్నది తెలుసుకునే వీలు చిక్కుతుంది. పెట్టుబడులను సమీక్షించడం వల్ల మెరుగుపరుచుకునే అవకాశాలు, మార్పులు చేర్పులకు అవకాశం లభిస్తుంది. మారుతున్న మార్కెట్, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పెట్టుబడుల నిర్వహణ సాధ్యపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుని, రిస్క్‌ను అధిగమించొచ్చు. లోపాలను ఆరంభంలోనే తొలగించుకోవచ్చు. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను కలిసి సమీక్షించుకోవాలి.  

పొదుపు చేయలేకపోవడం
తగినంత పొదుపు చేయడం పెట్టుబడులకు కీలకం. లేదంటే లక్ష్యాలకు కావాల్సినంత పెట్టుబడులు సమకూర్చుకోలేరు. పొదుపులో 50–30–20 బడ్జెట్‌ సూత్రాన్ని అనుసరించాలి. నెలవారీ నికర ఆదాయం నుంచి 50 శాతమే ఖర్చు చేయాలి. అది కూడా గ్రోసరీ, యుటిలిటీ, పిల్లల స్కూల్‌ ఫీజులు, ఇంటి అద్దె కోసం. ఇక 30 శాతాన్ని అత్యవసరం కాని రెస్టారెంట్‌ ఫుడ్, పర్యటనలు, గ్యాడ్జెట్ల కొనుగోలు, మూవీ తదితర వాటికి కేటాయించుకోవాలి. మరో 20 శాతాన్ని పొదుపు చేసి, దాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలి.  

అస్సెట్‌ అలోకేషన్
గుడ్లు అన్నింటినీ ఒక్కటే బుట్టలో పెట్టేయకూడదన్న సూత్రం తెలిసే ఉంటుంది. అలాగే పెట్టుబడులు అన్నింటికీ తీసుకెళ్లి ఒకే సాధనంలో ఉంచేయకూడదు. ఎందుకంటే ఆయా విభాగం నిర్ణీత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టయితే పోర్ట్‌ఫోలియో విలువపై (పెట్టుబడులు) ప్రభావం పడుతుంది. నష్టాలు కనిపిస్తాయి. అందుకే పెట్టుబడులను వివిధ సాధనాల (అస్సెట్‌ క్లాసెస్‌) మధ్య వర్గీకరించుకోవాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఒక్కో విభాగంలో ఉండే రిస్క్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది. వైవిధ్యం చేసుకోవడం వల్ల వివిధ విభాగాల్లో ఏదైనా ఒకటి రెండు ప్రతికూల ఫలితాలు చూపించినా, అదే కాలంలో మిగిలిన విభాగాల్లో మెరుగైన పనితీరు నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. తగినంత వైవిధ్యం కోసం పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌), కమోడిటీ, రియల్‌ ఎస్టేట్‌ బంగారం మధ్య విస్తరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లో ఏదైనా ఒకటి రెండు విభాగాలు ప్రతికూలతలు ఎదురు చూసినా, మిగిలినవి ఆదుకుంటాయి. 

సరైన పెట్టుబడి సాధనం
ఆర్థిక మార్కెట్లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మార్కెట్‌ పరిస్థితులు, ఆర్థిక, భౌగోళిక అంశాలు వివిధ పెట్టుబడి సాధనాల పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. కనుక సరైన లేదా కచ్చితమైన పెట్టుబడి సాధనం కోసం అన్వే షించడం అనేది అవకాశాలను కోల్పోయేందుకు దారితీయవచ్చు. పరిమితికి మించి సమాచారాన్ని మెదడులోకి చేర్చుకోవడం వల్ల నిర్ణయాల్లో జాప్యానికి దారితీస్తుంది. దీంతో అనుకూలమైన పెట్టుబడి అవకాశాలను కోల్పోవాల్సి రావచ్చు. అందుకే ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యాలకు అనుకూలమైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేయాలి.  

టిప్స్ ఫాలో అవ్వడం
నేడు సోషల్‌ మీడియాలో సలహాలిచ్చే వారు కోకొల్లలు కనిపిస్తుంటారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్, యూట్యూబ్‌లో భారీ సంఖ్యలోనే అకౌంట్లు ఉన్నాయి. వేగంగా లాభాలు సంపాదించాలనే ఆశే ఇన్వెస్టర్లను నష్టపోయేలా చేస్తుంటుంది. టిప్స్‌ సాయంతో త్వరగా పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలనే ధోరణి ఇక్కడ పనికిరాదు. పెట్టుబడి ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయాలు, టెక్నాలజీలో పురోగతి తదితర ఎన్నో అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. వీటిని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. కనుక పెట్టుబడుల విషయంలో స్వీయ అప్రమత్తత, అవగాహన అవసరం. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలే కానీ, ఉచిత టిప్స్‌ను అనుసరించడం సురక్షితం కాదు.   

కంపౌండింగ్
పెట్టుబడులకు కాలం కూడా కీలకమే. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా అది కాంపౌండింగ్‌ (వృద్ధి) అవుతుంది. కాంపౌండింగ్‌ అంటే పెట్టుబడిపై వృద్ధి కాకుండా, రాబడి కూడా వృద్ధి చెందడం. దీన్ని రాబడిపై రాబడిగా చెబుతారు. ముందుగానే పెట్టుబడిని ఆరంభించడం వల్ల ఈ కాంపౌండింగ్‌ ప్రయోజనంతో దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడులు మొదలు పెట్టినా, కనీసం 5–10 ఏళ్లపాటు వాటిని కొనసాగించినప్పుడే కాంపౌండింగ్‌ ప్రయోజనం కనిపిస్తుంది. మధ్యలో నిలిపివేస్తే పూర్తి స్థాయిలో ఆ ఫలితం కనిపించదు. కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందేందుకు ఎంతో ఓపిక, క్రమశిక్షణ అవసరం. 

రిస్క్‌ అంతర్భాగం
పెట్టుబడుల్లో రిస్క్‌ అంతర్భాగంగా ఉంటుంది. ప్రతీ పెట్టుబడితోనూ వచ్చే రిస్క్‌ను అర్థం చేసుకున్నప్పుడే దాన్ని అధిగమించడం సాధ్యపడుతుంది. మార్కెట్‌ అనుసంధానిత సాధనం అయిన స్టాక్, ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు వాస్తవ అంశాలను తెలుసుకోవాలి. కంపెనీల ఆర్థిక మూలాలు, క్రెడిట్‌ నాణ్యత ఇవన్నీ చూడాలి. మీ రిస్క్‌ సామర్థ్యం (అస్థిరతలను ఏ మేరకు భరించగలరు) గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అధిక రిస్క్‌ తీసుకునేట్టు అయితే ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  

ఇతరులను అనుసరించడం
మెజారిటీ ఇన్వెస్టర్లు సాధారణంగా ఇతరుల పెట్టుబడులను, నిర్ణయాలను అనుసరిస్తుంటారు. సరైన సమయంలో కొనుగోళ్లు, విక్రయాలు చేయడం కాకుండా, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఒకే సమయంలో ఎక్కువ మంది ఏదైనా సాధనాన్ని అనుసరించినప్పుడు అక్కడ ధరలు కృత్రిమంగా పెరిగిపోతాయి. దీన్నే స్పెక్యులేషన్‌ బబుల్‌గా చెబుతారు. దీంతో ఆయా సాధనాల విలువలు ఖరీదుగా మారతాయి. దీంతో తదుపరి మార్కెట్‌ కరెక్షన్‌లో అవి ఎక్కువ నష్టాన్ని చూసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఇన్వెస్టర్‌ తనకుంటూ ఓ విధానాన్ని రూపొందించుకోవాలి. మార్కెట్‌ ధోరణులను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. తమ రిస్క్‌ సామర్థ్యం పరిధిలోనే పెట్టుబడుల నిర్ణయాలు ఉండాలి. తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టాలి.     

నిపుణుల సాయం
చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగలమని భావిస్తుంటారు. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకుంటే మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, ప్లానర్లు, వెల్త్‌ మేనేజర్లు అందరూ ఫైనాన్షియల్‌ మార్కెట్ల పట్ల లోతైన విషయ పరిజ్ఞానంతో ఉంటారు. ఆధునిక ధోరణులు, ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు. దీనికి అనుగుణంగా పెట్టుబడుల విధానాల్లో మార్పులు చేస్తుంటారు. కనుక నిపుణుల సాయంతో రాబడిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్‌ పతనాల్లో నిపుణుల సాయం ఎంతో ఆదుకుంటుంది. మనో ధైర్యాన్ని, మెరుగైన మార్గాన్ని చూపుతుంది. వారి విలువైన సలహాలతో రిస్క్‌ను సులభంగా అధిగమించగలరు.  

లక్ష్యం లేకుండా
పెట్టుబడికి లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే అది చుక్కాని లేని నావ మాదిరే అవుతుంది. మీరు ఎందుకు ఇన్వెస్ట్‌ చేస్తున్నారనేది మీకు తెలిసి ఉండాలి. లక్ష్యం తెలిసినప్పుడే చేసే పెట్టుబడి ఆశించిన రాబడులు ఇస్తుంది. వివిధ లక్ష్యాలకు భిన్నమైన పెట్టుబడి వ్యూహాలు అవసరం పడొచ్చు. మీ పెట్టుబడుల విధానానికి మీ లక్ష్యం బ్లూప్రింట్‌ మాదిరిగా పనిచేస్తుంది. మీ లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అని మూడు భాగాలుగా వర్గీకరించుకోవాలి. నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల కాలానికి సంబంధించినవి స్వల్పకాల లక్ష్యాల కిందకు వస్తాయి. 

అత్యవసర నిధి, సెలవుల్లో పర్యటనలకు కావాల్సినది సమకూర్చుకోవడం ఇలాంటివి స్వల్పకాల లక్ష్యాలు అవుతాయి. 2–5 ఏళ్ల కాల అవసరాలు మధ్యకాలిక లక్ష్యాల కిందకు వస్తాయి. ఇల్లు లేదా కారు కొనుగోలుకు కావాల్సిన డౌన్‌ పేమెంట్‌ సమకూర్చుకోవడం వంటివి మధ్యకాల లక్ష్యాలు అవుతాయి. ఇక 10–20 ఏళ్లు అంతకుమించిన కాలానికి ఉద్దేశించినవి దీర్ఘకాల లక్ష్యాల కిందకు వస్తాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్‌ లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవి అవుతాయి. 

ఈ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలం, మధ్యకాలానికి సంబంధించి పెట్టుబడులను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు అయిన బ్యాంక్‌ ఎఫ్‌డీలు, కార్పొరేట్‌ బాండ్లు, ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల మధ్య వర్గీకరించుకోవచ్చు. మీ ఆదాయం, రుణ బాధ్యతలు, రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా అనుకూలమైన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సాయం తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement