వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక.. | Income planning in old ageand after Retairment | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..

Published Mon, Jun 12 2023 4:17 AM | Last Updated on Mon, Jun 12 2023 4:17 AM

Income planning in old ageand after Retairment - Sakshi

ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి.

మనలో చాలా మంది రిటైర్మెంట్‌ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్‌ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.  

ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే
రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి.

మీరు మీ ఫండ్‌ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్‌ తర్వాత రిస్క్‌ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్‌ తర్వాత ఈక్విటీ రిస్క్‌ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు.

అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్‌ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు అది రిస్క్‌ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్‌ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్‌ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి.  

ఎంత నిధి కావాలి?
రిటైర్మెంట్‌కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్‌ ఫండ్‌ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్‌ తర్వాత అవసరం అవుతుంది.

ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్‌ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం.

మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి.

అస్సెట్‌ అలోకేషన్‌
అస్సెట్‌ అలోకేషన్‌ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్‌ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్‌ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్‌పై రాసుకోవాలి.

మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్‌ అలోకేషన్‌ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్‌ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్‌ అలోకేషన్‌ను సవరించుకోవచ్చు.

రిటైర్మెంట్‌ ఫండ్‌పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్‌ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్‌ ఫండ్‌ను ఈక్విటీ, డెట్‌కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్‌కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్‌కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్‌ చేసుకుంటూ ఉండాలి.  

కార్యాచరణ ప్రణాళిక..
రిటైర్మెంట్‌ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్‌ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్‌ అలోకేషన్‌) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్‌కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి.

పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్‌ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు.

మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్‌ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది.

ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్, పీపీఎఫ్‌లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్‌ సాధనాలు. ఏటా ఏప్రిల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్‌లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. 

ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్‌లో సమానంగా ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement