న్యూఢిల్లీ, సాక్షి: నారా చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేదు. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన సాగడం విశేషం. అలాంటిది మరోసారి సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒకరు చంద్రబాబు సంపద సృష్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారిప్పుడు.
సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు.
పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు.
చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్ జగన్ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు.
అయితే.. అధికారంలోకి వచ్చాక ‘వీటన్నింటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారు’? అని ప్రశ్నిస్తే మాత్రం అరిగిపోయిన రికార్డులాగా.. సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ లేని సీఎంగా పేరున్న చంద్రబాబు గత మూడు టర్మ్‌లు ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి పంచిపెట్టారు..? అనే విశ్లేషణలు తరచూ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు స్వయానా ఆయన కేబినెట్‌లోని మంత్రి తాజా ప్రకటనతో.. ఆ సంపద సృష్టి కూడా మోసం అనేది తేటతెల్లమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment