Jains
-
అదిగదిగో బాహుబలి
► మహామస్తకాభిషేకానికి మొదలైన ఏర్పాట్లు ► గోమఠేశ్వరుని విగ్రహం శుద్ధి సాక్షి, బెంగళూరు: జైనులు పరమపవిత్రంగా భావించే హాసన్ జిల్లా శ్రావణ బెళగోళలో కొండపై కొలువైన గోమఠేశ్వరుని ఆధ్యాత్మికోత్సవం మహామస్తకాభిషేకానికి ఏర్పాట్లు మొదలైనాయి. గురువారం విగ్రహాన్ని శాస్త్రోక్తంగా జలాలతో శుభ్రం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా వేడుకల్లో బృహత్ శిలా విగ్రహానికి చందనం, కుంకుమ, పసుపు, వివిధ నదీజలాలతో నిండిన 1,008 కళశాలతో అభిషేకం చేస్తారు. 57 అడుగుల ఎత్తైన ఈ ఏకశిలా విగ్రహాన్ని క్రీస్తుశకం 981లో గంగ వంశానికి చెందిన రాజులు ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 2006 ఫిబ్రవరిలో 87వ మహామస్తకాభిషేకం నిర్వహించారు. 88వ మహామస్తకాభిషేకం 2018 ఫిబ్రవరి 7 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే దాదాపు 30 లక్షల మంది భక్తులు బాహుబలిని సందర్శించుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా ఎందరో ప్రముఖులు మస్తకాభిషేకాల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. -
శాంతి సమాజానికి కాంతి
కడప కల్చరల్ : నేడు ప్రపంచ శాంతి దినోత్సవం. వివిధ దేశాల మధ్య శాంతిని పెంచేందుకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1981లో తమ సమావేశాల మొదటిరోజున శాంతి దినోత్సవాన్ని పాటించింది. అప్పటి నుంచి ప్రతి సెప్టెంబరు 21న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ధాల నుంచి, హింస నుంచి మానవజాతికి విముక్తి కల్పించాలన్నదే ఈ దినోత్సవం ఉద్దేశ్యం. ‘లక్షలాది సైన్యాన్ని సమీకరించవచ్చు. కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. కానీ మనసుకు గుప్పెడంత శాంతిని సంపాదించుకున్న వాడే నిజమైన జగజ్జేత’ అన్నాడు మహా సామ్రాట్, ప్రపంచ విజేత అలెగ్జాండర్. – శాంతి విలువ ఏమిటో అనుభవాల తర్వాతే తెలిసి వస్తుంది. ప్రశాంతంగా జీవించాలన్న కాంక్ష నేటì ది కాదు. అందుకే మహా గాయకుడు త్యాగరాజస్వామి ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అని ఆనాడే తెలిపాడు. ఆర్థిక, సామాజిక రాజకీయ కారణాలతో ప్రజల్లో అశాంతి నెలకొంటుంది. నేటికీ పలు దేశాలు యుద్ధ వాతావరణంలో తీవ్ర అశాంతితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచానికి శాంతిని బోధించిన బుద్ధుడు పుట్టిన మన దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే అశాంతి తక్కువే. కానీ పేదరికం, సామాజిక అసమానతలు, పొరుగు దేశాల ఆక్రమణ యత్నాలు మన దేశంలో కూడా అశాంతిని రగిలిస్తూనే ఉన్నాయి. శాంతి పేరిట ఓ వీధి.. మౌంట్ ఆబు ప్రధాన కేంద్రంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా శాంతి సాధనకు నిరంతరాయంగా కృషి చేస్తోంది. ప్రపంచమంతటా వేలాది శాఖలుగల ఈ సంస్థకు మన జిల్లాలో వందకు పైగా శాఖలు ఉన్నాయి. కడప నగరం ఓం శాంతి నగర్లో సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఏర్పాటయ్యాకనే ఆ ప్రాంతానికి ఓం శాంతినగర్గా పేరొచ్చింది. ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ గీతా బెహన్ అలుపెరగకుండా తన బృందంతో జిల్లా అంతటా శాంతి బోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావంగల ప్రాంతాలలో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి శాంతి బోధనలు చేస్తున్నారు. జైనుల సేవ.. జిల్లాలో శాంతి కోసం జైనులు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో వస్త్రాలు, బంగారం, ఫ్యాన్సీ, తినుబండారాల వ్యాపారాలలో పాతిక సంవత్సరాలకు మించి జిల్లాలో స్థిరపడ్డ జైనులు తాము ప్రశాంత జీవనం గడుపుతూ జైన మందిరాలు నిర్మించి ప్రశాంతమైన జీవనం గడిపేందుకు ధ్యానాన్ని మార్గంగా ఎంచుకున్నారు. తమ పర్వదినాల్లో జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతితోనే ఉజ్వల భవిష్యత్తు శాంతంగా ఉన్నప్పుడే మానవుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అశాంతితో ఏ పని సక్రమంగా చేయలేం. శాంతి సాధనకు యోగ, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయి. – బ్రహ్మకుమారి గీతా బెహన్, జిల్లా కో ఆర్డినేటర్, ఓం శాంతి సంస్థ,కడప అలజడులు అనారోగ్యానికి మూలం.. మనసుకు శాంతి లేకపోవడం అన్ని రకాల అలజడులు, అనారోగ్యాలను కలిగిస్తుంది. అశాంతి ఉన్న శక్తిని తగ్గించి వేస్తుంది. యోగా సాధన ద్వారా మనసును నియంత్రించి శాంతిని పొందవచ్చు. – డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, యోగా థెరఫిస్ట్, మిత్ర యోగా కేంద్రం, కడప -
ధర్మాన్ని రక్షిద్దాం
కర్నూలు(న్యూసిటీ): ప్రతి ఒక్కరు ధర్మాన్ని రక్షించాలని జైనుల గురువు రాజ్‌తిలక్ సురీశ్వరజీ అన్నారు. జైనుల పర్యుషన్ పండగ సందర్భంగా ఆదివారం కర్నూలులోని బొంగుల బజార్ శ్రీశాంతినా«ద్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైనుల గురువులు రాజ్‌తిలక్ సురీశ్వరజీ చాతుర్మాస్య దీక్షల్లో భాగంగా జైనుశ్వేతాంబర్‌మూర్తి పూజక్ సంఘ్ ఆధ్యర్యంలో కార్యక్రమాన్ని వైభంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ జీవహింస చేయరాదన్నారు. జైనుల 45 రోజులపాటు ఉపవాసదీక్షలు పాటించిన 18 మంది యువతీ, యువకులను సన్మానించారు. ముందుగా పాతబస్టాండు నుంచి కాంగ్రెసు ఆఫీసు, రాధకష్ణ టాకీసు, మీదుగా శాంతినా«ద్ జైన దేవాలయం వరకు అంగరంగ వైభవంగా ర«థాల మీద ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జైనుశ్వేతాంబర్‌మూర్తి పూజక్ సంఘ్ నాయకులు దీలీప్‌కుమార్‌జైను, అంబాలాల్‌జైను, శాంతిలాల్‌జైను రాజీన్‌షాజైనుతో పాటు అనేక మంది జైనులు పాల్గొన్నారు. -
జాతీయాలు
జైనుడి చేతిలో పేను! జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాళ్ల కింద సూక్ష్మజీవులు చనిపోతాయని నెమలీకలతో నడిచినంత మేరా నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను దున్ని చేసే వ్యవసాయం చేయరు. జైనుల అహింసా సిద్ధాంతం ఆచరణసాధ్యం కానంత తీవ్రస్థాయిలో ఉంటుందనే విమర్శ కూడా లేకపోలేదు. వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి. అందులో ఒకటి అతడికి చిక్కింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడేగానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చంపకుంటే మనసు శాంతించదు. చంపితే మతధర్మం ఒప్పుకోదు. ‘చంపడమా? వదిలిపెట్టడమా?’ అనే సంఘర్షణలో జైనుడితో పాటు ఆ పేను కూడా నరకం అనుభవించింది. ఈ కథ సంగతి ఎలా ఉన్నా...ఒక విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా ఒక అవకాశం చేతికి చిక్కినప్పటికీ ఏమీ చేయలేని స్థితి ఎదురైనప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. రోకలి చిగుళ్లు! ‘రోకలికి చిగుళ్లు కోయవద్దు. జరిగే పనేనా కాదా అనేది చెప్పు’ ‘నువ్వు చెప్పిన పని పొరపాటున కూడా సాధ్యం కాదు. రోకలికి చిగుళ్లు మొలుస్తాయా?’ ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. చెట్టునో, కొమ్మనో నరికి ఎండబెట్టి రోకలిగా చెక్కుతారు. ఇక అలాంటి రోకలి చిగుళ్లు వేయడం అనేది అసంభవం అనే విషయం అందరికీ తెలుసు. అసాధ్యం, అసంభవం అనుకునే పనుల విషయంలో ఉపయోగించే మాట ఇది! జాపరమేశ్వరా! ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ఆపదలో ఉన్న వ్యక్తి... ‘‘దేవుడా కాపాడు’’ అని అంటూ పరుగెత్తుతాడు. దీనికి సమానమైనదే ఈ జాపరమేశ్వరా! ‘తన ఇబ్బంది గ్రహించి జాపరమేశ్వర అని పారిపోయాడు’ ‘జాపరమేశ్వర అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’ ఇలాంటి మాటలు వింటుంటాం. జా, పరమేశ్వరా పదాలతో ఏర్పడినదే జాపరమేశ్వర! ‘జా’ అంటే హిందీలో ‘వెళ్లు’ అని అర్థం. ‘పరమేశ్వరా’ అనేది ఇష్టదైవాన్ని తలుచుకోవడం. -
గుజరాత్లో జైనులకు ‘మైనారిటీ’
అహ్మదాబాద్: గుజరాత్‌లోని జైనులకు మైనారిటీ హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. యూపీఏ ప్రభుత్వం 2014 జనవరిలోనే జైనులను మైనారిటీలుగా గుర్తించింది. గుజరాత్ కూడా దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలోపే పటేళ్ల ఆందోళన ఉధృతం అవటంతో.. పక్కన పెట్టిందని. రాష్ట్ర రవాణా మంత్రి, రాష్ట్ర బీజేపీ కమిటీ చీఫ్ రూపానీ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల జైనుల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. విజయ్ కూడా జైనుడే కావటం విశేషం. -
బిక్షుదయ చేపట్టిన జైనులు
హైదరాబాద్: జైన మమస్తులు ఒక రోజు పాటు తమ మత గురువు మాదిరిగా జీవితాన్ని గడిపే బిక్షుదయ కార్యక్రమాన్ని ఆదివారం కాచిగూడలోని జైన్‌భవన్‌లో చేపట్టారు. దాదాపు 1,500 మంది జైనులు ఎలాంటి సౌకర్యాలు, వసతుల జోలికి పోకుండా... గురువుల్లా వస్త్రాలను ధరించారు. ఆభరణాలను, డబ్బును త్యజించి కాచిగూడ జైన్ సంస్థాన్‌లో తమ మత గురువులు శ్రీ వినయ్ ముని ఆలియాస్ వర్గీసే, గౌతమ్ ముని, సంజ ముని, సాగర్ ముని సాన్నిధ్యంలో ప్రార్థనలు చేస్తూ, వారి ప్రవచనలను వింటూ గడిపారు. భోజన సమయంలో పరిసర ప్రాంతాలలో జైన కుటుంబాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. బిక్షాటన ద్వారా తీసుకొచ్చిన భోజనాన్ని స్వీకరించారు. గురువులు ఎంత కఠోర పరిశ్రమతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రేటర్ హైదరాబాద్ శ్రీ వర్ధమాన్ స్థానక్ వాసీ జైన్ శ్రావక్ సంఘ్ అధ్యక్షుడు ప్రకాష్‌చంద్ లోద, కార్యదర్శి కాంతిలాల్‌జీ పిట్లీయా తెలిపారు. -
ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మకం బంద్
థానే: మాంసం అమ్మకాలను మహారాష్ట్రలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) ఓ ఎనిమిది రోజులపాటు నిషేధించనుంది. ఈ నెలలో జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు ఎవరూ మాంసం విక్రయించడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. జైనులు పవిత్రంగా ఉండే ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని 'పర్యుషాన్' అని అంటారు. దీనిని ఈ నెల 11 నుంచి 18వరకు పాటించనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక భేటీ నిర్వహించిన ఎంబీఎంసీ పాలక మండలి ఈ ఎనిమది రోజులు పూర్తయ్యేవరకు ఎవరూ తమ కార్పొరేషన్లో మాంసం విక్రయించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని నిర్ణయించారు. దీనిపై సోమవారం అధికారికంగా నిర్ణయం తీసుకునేందుకు మరో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా హాజరుకానున్నారు. -
ఆ.. 'మరణ' దీక్షకు అనుమతి మంజూరు
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన జైన మతస్తుల ఉపవాస దీక్షలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జైనులు చేపట్టే సంతారా (నిరాహారదీక్షతో పరమపదించే ప్రక్రియ) ఆత్మహత్యతో సమానమని భావించిన కింది కోర్టులు ఆ ప్రకియను నిషేధించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. కింది కోర్లు తీర్పుపై స్టే ఇవ్వడంతోపాటు ఆమరణ దీక్షలు నిరాటంకంగా చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. జైనుల మతాచారం అయిన సంతారాపై గతంలో రాజస్తాన్ హైకోర్టు నిషేదించడంపై ఆ మతస్తులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంద్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ దాదాపు 10 వేల దుకాణాలు మూతపడ్డాయి. మోక్షం పొందడం కోసం తాము ఆచరించే సంతారాపై నిషేధం మతహక్కులకు భంగం కల్గించడమేనని నినదించిన జైనులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు మతాలలో ఉపవాస దీక్ష సంప్రదాయం ఉందని, అలాగే జైనులలో మరింత కఠినమైన దీక్ష చేస్తారని, మహావీరుడి కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నదని, దానిని అనుమతించకపోవడం సరికాదని జైనుల వాదన. -
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
పూర్వ సాహిత్యం తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు. బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన.... పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా- ‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య శివుడేమి నరుల భక్షింప రక్కసుడె? శిశువు సద్భక్తుని సిరియాళునంబి పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు. మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే. భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది. - కాసుల ప్రతాపరెడ్డి (ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం) -
జీనాయహా..
క్రమశిక్షణ, సామాన్య జీవన విధానానికి ప్రాధాన్యం ఇచ్చే జైన్లు 400 ఏళ్ల క్రితమే నగరంలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నగరం తమ జీవన విధానానికి ఎంతో అనుకూలంగా ఉందంటున్నారు. దేశంలోని ఏ మారుమూల నుంచి ఇక్కడికి వచ్చినా.. అక్కున చేర్చుకునే భాగ్యనగరం అంటే తమకెంతో ఇష్టమంటున్నారు ఇక్కడి జైన్లు. కన్నతల్లి, సొంత ఊరును ఎంతలా అభిమానిస్తామో.. జీవన మార్గాన్ని చూపిన హైదరాబాద్‌ను కూడా అంతే ప్రేమిస్తున్నామని చెబుతున్నారు. ‘హమ్ లోగ్ హైదరాబాదీ’ అని అంటున్నారు. ‘జీయో.. ఔర్ జీనే దో..’ అనే జైన్లు ఇక్కడి ప్రజలతో మమేకమై తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో జైన్ల జీవన విధానం ప్రత్యేకమైనది. జీవహింస మహా పాపమనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మే జైన్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్వేచ్ఛను గౌరవిస్తారు. గో రక్షణలో తమ కర్తవ్యం చాటుకుంటున్న జైన్లు.. అదే గోవులను బంధించి సేవ చేయడాన్ని మాత్రం అంగీకరించరు. నవ్కార్ మహామంత్ర జపం చేసే వీరు.. అహింసా పరమో ధర్మః అనే మహావీరుడి సూక్తులను త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. నాలుగు శతాబ్దాల కిందట భాగ్యనగరం తలుపు తట్టిన జైన్లు.. ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం నగరంలో వీరి జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటుంది. ఉత్తరాది విడిది విడిచి.. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన జైన్లు ఉత్తరాది విడిచి బతుకును వెతుక్కుంటూ భాగ్యనగరికి చేరుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఫైనాన్స్, జువెలరీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, వస్త్ర వ్యాపారం, మెడికల్, శానిటరీ, మార్బుల్ తదితర వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు. వీరి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం వచ్చారు. నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకునే జైన్లు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆలూ, వంకాయలను అసలు వినియోగించరు. జైన్ గురువులు.. జైన్లలో శ్వేతాంబర్ సంఘ్, దిగంబరీ సంఘ్ అనే గురువులు ఉంటారు. వీరు శ్వేత వస్త్రాలు ధరిస్తారు. దిగంబరీ సంఘ్ గురువులు ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉంటారు. మూర్తి పూజక్ (భగవాన్ మహావీర్, పార్శ్యనాథ్ విగ్రహాల పూజలు చేసేవారు), అమూర్తి పూజక్ (విగ్రహారాధన లేని వారు) జైన్లు ఉంటారు. భగవాన్ మహావీర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు ఇక్కడి జైన్లు. అక్షయ తృతీయ రోజు ఉదయం చెరకు రసం తాగి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. నివాస ప్రాంతాలు.. నగరంలోని సిప్లిగంజ్, కబూతర్ ఖానా, శాలిబండ, అలియాబాద్, నూర్ఖాన్ బజార్, ఇసామియా బజార్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, పాట్ మార్కెట్, మెట్టుగూడ, బొల్లారం, మల్కాజిగిరి,తిరుమలగిరి, బేగంబజార్, ఆగాపురా, కాచిగూడ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో జైన్లు నివాసముంటున్నారు. వీరంతా సంఘాలుగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జైన్ సేవా సంఘ్, తేరాపంత్ మహాసభ, తేరాపంత్ యువ పరిషత్, తేరాపంత్ మహిళా మండల్, ఉపకార్ సేవా సమితి, శ్రీ జైన్ యువ మండల్, శ్రీ జైన్ మహిళా మండల్, శ్రీ వర్ధమాన్ స్థానక్ వాసి, శ్రీ జైన్ మందిర్ మార్గీ, శ్రీ దిగంబరీ జైన్ వంటి అసోసియేషన్లు జైన్ల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లి రాంచందర్ జాతీయ సెలవుగా ప్రకటించాలి.. మహావీర్ జయంతి సందర్భంగా జాతీయ సెలవు దినాన్ని ప్రకటిం చాలి. ప్రపంచ వ్యాప్తంగా మహావీర్ జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. జైన్ గురువుల సందేశాన్ని ప్రభుత్వ ప్రచారంగా నిర్వహించాలి. జైన్లు అధికంగా నివసించే ప్రాంతాల్లో జైన్ గురువులు బస చేయడానికి ప్రత్యేక కమ్యూనిటీ హాల్లు నిర్మించాలి. - ప్రమోద్ జైన్, ఉపకార్ సేవా సమితి వ్యవస్థాకులు, జైన్ సేవా సంఘ్ ప్రతినిధి.