జీనాయహా..
క్రమశిక్షణ, సామాన్య జీవన విధానానికి ప్రాధాన్యం ఇచ్చే జైన్‌లు 400 ఏళ్ల క్రితమే నగరంలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నగరం తమ జీవన విధానానికి ఎంతో అనుకూలంగా ఉందంటున్నారు. దేశంలోని ఏ మారుమూల నుంచి ఇక్కడికి వచ్చినా.. అక్కున చేర్చుకునే భాగ్యనగరం అంటే తమకెంతో ఇష్టమంటున్నారు ఇక్కడి జైన్‌లు. కన్నతల్లి, సొంత ఊరును ఎంతలా అభిమానిస్తామో.. జీవన మార్గాన్ని చూపిన హైదరాబాద్‌ను కూడా అంతే ప్రేమిస్తున్నామని చెబుతున్నారు. ‘హమ్ లోగ్ హైదరాబాదీ’ అని అంటున్నారు. ‘జీయో.. ఔర్ జీనే దో..’ అనే జైన్‌లు ఇక్కడి ప్రజలతో మమేకమై తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో జైన్‌ల జీవన విధానం ప్రత్యేకమైనది. జీవహింస మహా పాపమనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మే జైన్‌లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్వేచ్ఛను గౌరవిస్తారు. గో రక్షణలో తమ కర్తవ్యం చాటుకుంటున్న జైన్‌లు.. అదే గోవులను బంధించి సేవ చేయడాన్ని మాత్రం అంగీకరించరు. నవ్‌కార్ మహామంత్ర జపం చేసే వీరు.. అహింసా పరమో ధర్మః అనే మహావీరుడి సూక్తులను త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. నాలుగు శతాబ్దాల కిందట భాగ్యనగరం తలుపు తట్టిన జైన్‌లు.. ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం నగరంలో వీరి జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటుంది.
ఉత్తరాది విడిది విడిచి..
రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన జైన్‌లు ఉత్తరాది విడిచి బతుకును వెతుక్కుంటూ భాగ్యనగరికి చేరుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఫైనాన్స్, జువెలరీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, వస్త్ర వ్యాపారం, మెడికల్, శానిటరీ, మార్బుల్ తదితర వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు. వీరి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం వచ్చారు. నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకునే జైన్‌లు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆలూ, వంకాయలను అసలు వినియోగించరు.
జైన్ గురువులు..
జైన్‌లలో శ్వేతాంబర్ సంఘ్, దిగంబరీ సంఘ్ అనే గురువులు ఉంటారు. వీరు శ్వేత వస్త్రాలు ధరిస్తారు. దిగంబరీ సంఘ్ గురువులు ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉంటారు. మూర్తి పూజక్ (భగవాన్ మహావీర్, పార్శ్యనాథ్ విగ్రహాల పూజలు చేసేవారు), అమూర్తి పూజక్ (విగ్రహారాధన లేని వారు) జైన్‌లు ఉంటారు. భగవాన్ మహావీర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు ఇక్కడి జైన్‌లు. అక్షయ తృతీయ రోజు ఉదయం చెరకు రసం తాగి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు.
నివాస ప్రాంతాలు..
నగరంలోని సిప్లిగంజ్, కబూతర్ ఖానా, శాలిబండ, అలియాబాద్, నూర్‌ఖాన్ బజార్, ఇసామియా బజార్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, పాట్ మార్కెట్, మెట్టుగూడ, బొల్లారం, మల్కాజిగిరి,తిరుమలగిరి, బేగంబజార్, ఆగాపురా, కాచిగూడ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో జైన్‌లు నివాసముంటున్నారు. వీరంతా సంఘాలుగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జైన్ సేవా సంఘ్, తేరాపంత్ మహాసభ, తేరాపంత్ యువ పరిషత్, తేరాపంత్ మహిళా మండల్, ఉపకార్ సేవా సమితి, శ్రీ జైన్ యువ మండల్, శ్రీ జైన్ మహిళా మండల్, శ్రీ వర్ధమాన్ స్థానక్ వాసి, శ్రీ జైన్ మందిర్ మార్గీ, శ్రీ దిగంబరీ జైన్ వంటి అసోసియేషన్లు జైన్‌ల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి.
పిల్లి రాంచందర్
జాతీయ సెలవుగా ప్రకటించాలి..
మహావీర్ జయంతి సందర్భంగా జాతీయ సెలవు దినాన్ని ప్రకటిం చాలి. ప్రపంచ వ్యాప్తంగా మహావీర్ జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. జైన్ గురువుల సందేశాన్ని ప్రభుత్వ ప్రచారంగా నిర్వహించాలి. జైన్‌లు అధికంగా నివసించే ప్రాంతాల్లో జైన్ గురువులు బస చేయడానికి ప్రత్యేక కమ్యూనిటీ హాల్‌లు నిర్మించాలి.
- ప్రమోద్ జైన్, ఉపకార్ సేవా సమితి
వ్యవస్థాకులు, జైన్ సేవా సంఘ్ ప్రతినిధి.