హైదరాబాద్ మూడు ముక్కలు
- హైదరాబాద్‌తో పాటు కొత్త జిల్లాలుగా గోల్కొండ, సికింద్రాబాద్
- వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా
- భూపరిపాలన విభాగం కసరత్తు పూర్తి
- 14-15 కొత్త జిల్లాలపై నమూనా మ్యాప్‌లు సిద్ధం
- నేటి నుంచి రెండు రోజులు కలెక్టర్లతో వర్క్‌షాప్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో కీలకంగా మారిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన కొలిక్కి వచ్చింది. వీటి విభజనపై ముందునుంచీ గందరగోళం నెలకొనడం తెలిసిందే. రాజధానికి కేంద్రంగా విస్తరించిన గ్రేటర్ సిటీ కావటంతో దీన్ని ఎన్ని జిల్లాలుగా విభజిస్తారు, ఏ ప్రాంతాలను ఎందులో కలుపుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలుమార్లు జరిగిన ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ ఈ రెండు జిల్లాలపైనే సుదీర్ఘంగా తర్జనభర్జనలు జరిగాయి. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వాటి పునర్ వ్యవస్థీకరణ కసరత్తును సీసీఎల్‌ఏ ఎట్టకేలకు పూర్తి చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నాలుగు జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి.
హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లాలుగా విభజిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వీటిలో విలీనం చేస్తారు. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఏ ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో ఉంచాలనే విషయంలోనూ సీసీఎల్‌ఏ నమూనా మ్యాపులు సిద్ధం చేసింది. మొత్తం 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెదక్ జిల్లాలో సిద్ధిపేట, సంగారెడ్డి; ఆదిలాబాద్‌లో మంచిర్యాల (కొమురం భీం జిల్లా); నిజామాబాద్‌లో కామారెడ్డి; ఖమ్మంలో కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా); కరీంనగర్‌లో జగిత్యాల, వరంగల్‌లో భూపాలపల్లి (ఆచార్య జయశంకర్ జిల్లా); మహబూబాబాద్; నల్లగొండ జిల్లాలో సూర్యాపేట; మహబూబ్‌నగర్‌లో నాగర్‌కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు తుది పరిశీలనలో ఉంది. కరీంనగర్ జిల్లాకు ‘పీవీ నరసింహరావు జిల్లా’ అని పేరు పెట్టాలనే అభ్యర్థనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
నేడు, రేపు కలెక్టర్ల వర్క్‌షాప్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇదే ప్రధాన ఎజెండాగా మంగళ, బుధవారాల్లో కలెక్టర్లతో వర్క్‌షాప్ నిర్వహించనుంది. తొలి రోజు సదస్సును రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ నిర్వహిస్తారు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవిన్యూ డివిజన్ల పునర్ వ్వవస్థీకరణ, ఏయే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి, వాటిలో ఏ మండలాలను విలీనం చేయాలనే అంశాలను ప్రధానంగా చర్చిస్తారు. భేటీకి ముసాయిదా ప్రతిపాదనలతో రావాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సోమవారమే సమాచారమిచ్చింది.
నమూనా మ్యాప్‌లు: ముఖ్యమంత్రి సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాను భూ పరిపాలన విభాగం సిద్ధం చేసింది. మూడు వేర్వేరు ప్రతిపాదనలతో జాబితాలు రూపొందించింది. వీటికి అనుగుణంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌లో భౌగోళిక సరిహద్దులను సూచించే నమూనా మ్యాపులను తయారు చేయించింది. జోన్ల హద్దులు మీరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రాజ్యాంగపరమైన చిక్కులొస్తాయనే ముందుజాగ్రత్తతో ఒక జాబితాను, జోన్లను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున అందుకనుగుణంగా మరో జాబితాను తయారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ముసాయిదాలతో పాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలు, డిమాండ్లైపై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దాంతో కొత్త జిల్లాలకు మరింత రూట్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలంటున్నాయి.