జీవితంపై విరక్తిచెంది.. బుద్ధుని చెంతకొచ్చి!
ప్రశాంతమైన బుద్ధుని వదనం. చుట్టూ సాగరపు అలల అల్లరి అలికిడి. చల్లని గాలులు! చూడటానికి అదొక నందనవనంలా కనిపిస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున నగరానికి తలమానికంగా ఉన్న హుస్సేన్‌సాగర్ గురించే ఇదంతా! భాగ్యనగరానికే భాగ్యరేఖలా ఉన్న హుస్సేన్ సాగర్‌ను చూడటానికి రోజూ వేలమంది పర్యాటకులు తరలివస్తారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను వేరుచేస్తూ నగరానికి నగలా తళుకులీనుతున్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఓవైపు కాలుష్యకాసారంగానే కాదు.. మరోవైపు ఆత్మహత్యలకు హాట్‌స్పాట్‌గా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉంటున్న భగ్నజీవులు, జీవితంపై విరక్తి చెందిన వాళ్లు తమ బలవన్మరణాలకు హుస్సేన్‌సాగర్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 40 మంది హుస్సేన్‌సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. మరో 205 మంది కూడా ఆత్మహత్యాయత్నాలకు ఒడిగట్టారు. పోలీసులు చురుగ్గా స్పందించడంతో వారి ప్రాణాలు బతికి ఒడ్డున పడ్డాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య చిక్కులు, ఇంట్లో గొడవలు, అనుబంధాల్లో చిచ్చులా ఇలా సాధారణ కారణాలతోనే చాలామంది బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారని, దీనికితోడు చాలామంది యుక్తవయస్కులు చాలా అల్పమైన విషయాలకు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని, తల్లిదండ్రులు తిట్టడం, తోబుట్టువులు కొట్లాడుకోవడం వంటి కారణాలకే చేజేతులా తమ సొంత ప్రాణాలను తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో పిల్లలతో సహా దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఎంతోమంది మహిళలను పోలీసులు అడ్డుకోగలిగారు.
నిజానికి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఎవరులేని నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లడమో, ఇంట్లోనే ఎవరు లేనప్పుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడమో చేస్తారని, కానీ చాలామంది బలవన్మరణాలకు హుస్సేన్‌సాగర్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారో కారణాలు తెలియడం లేదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.