హత్య చేసి..‘దొంగ’నాటకం | A person murdered his family and attempts suicide due to debts | Sakshi
Sakshi News home page

హత్య చేసి..‘దొంగ’నాటకం

Published Thu, Sep 5 2013 2:14 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

హత్య చేసి..‘దొంగ’నాటకం - Sakshi

హత్య చేసి..‘దొంగ’నాటకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: భార్య, కొడుకును హతమార్చిన ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. హత్యానేరం నుంచి తప్పించుకొనేందుకు భార్య, కొడుకును దొంగలు చంపి రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారని కట్టుకథ అల్లాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కె.రమేష్‌వర్మ (40).. భార్య పార్వతి (35), కుమారుడు వాసుదేవ్ (10)తో కలిసి గాజులరామారంలోని వీఎస్‌ఆర్ టవర్స్ బి-బ్లాక్ 407 ఫ్లాట్‌లో ఉంటున్నాడు. రమేష్ ఆన్‌లైన్ షేర్ బిజినెస్ చేస్తున్నాడు. రూ.కోటి వరకు అప్పులున్నాయి. ఇటీవల రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో భార్య, కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
 మంగళవారం అర్ధరాత్రి భార్య, కుమారుడితో నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక బుధవారం ఉదయం అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ మహిళను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు వచ్చాడు. హుస్సేన్‌సాగర్‌లో విహారానికి పడవ ఎక్కారు. బోట్ బుద్దుని విగ్రహం వద్దకు రాగానే రమేష్ నీళ్లలోకి దూకేశాడు. కానీ గజఈతగాడు శ్రీనివాస్ అతన్ని రక్షించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భార్య, కుమారుడిని దొంగలు చంపేసి డబ్బు దోచుకున్నారని, ఇక తానెవరి కోసం బతకాలంటూ రమేష్ రోదించాడు. అయితే పోలీసుల విచారణలో తానే ఇద్దరినీ హత్య చేశానని నేరం నుంచి తప్పించుకునేందుకే దోపిడీ కథ అల్లానని అంగీకరించాడు. రమేష్ భార్య, కొడుకును హత్యచేసిన విషయం తనకు తెలియదని, పనిమీద బయటకు వెళ్దామంటే వచ్చానని అతనితో ఉన్న మహిళ చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement