శాంతి సమాజానికి కాంతి
కడప కల్చరల్ :
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం. వివిధ దేశాల మధ్య శాంతిని పెంచేందుకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1981లో తమ సమావేశాల మొదటిరోజున శాంతి దినోత్సవాన్ని పాటించింది. అప్పటి నుంచి ప్రతి సెప్టెంబరు 21న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ధాల నుంచి, హింస నుంచి మానవజాతికి విముక్తి కల్పించాలన్నదే ఈ దినోత్సవం ఉద్దేశ్యం.
‘లక్షలాది సైన్యాన్ని సమీకరించవచ్చు. కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. కానీ మనసుకు గుప్పెడంత శాంతిని సంపాదించుకున్న వాడే నిజమైన జగజ్జేత’ అన్నాడు మహా సామ్రాట్, ప్రపంచ విజేత అలెగ్జాండర్.
– శాంతి విలువ ఏమిటో అనుభవాల తర్వాతే తెలిసి వస్తుంది. ప్రశాంతంగా జీవించాలన్న కాంక్ష నేటì ది కాదు. అందుకే మహా గాయకుడు త్యాగరాజస్వామి ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అని ఆనాడే తెలిపాడు.
ఆర్థిక, సామాజిక రాజకీయ కారణాలతో ప్రజల్లో అశాంతి నెలకొంటుంది. నేటికీ పలు దేశాలు యుద్ధ వాతావరణంలో తీవ్ర అశాంతితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచానికి శాంతిని బోధించిన బుద్ధుడు పుట్టిన మన దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే అశాంతి తక్కువే. కానీ పేదరికం, సామాజిక అసమానతలు, పొరుగు దేశాల ఆక్రమణ యత్నాలు మన దేశంలో కూడా అశాంతిని రగిలిస్తూనే ఉన్నాయి.
శాంతి పేరిట ఓ వీధి..
మౌంట్ ఆబు ప్రధాన కేంద్రంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా శాంతి సాధనకు నిరంతరాయంగా కృషి చేస్తోంది. ప్రపంచమంతటా వేలాది శాఖలుగల ఈ సంస్థకు మన జిల్లాలో వందకు పైగా శాఖలు ఉన్నాయి. కడప నగరం ఓం శాంతి నగర్‌లో సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఏర్పాటయ్యాకనే ఆ ప్రాంతానికి ఓం శాంతినగర్‌గా పేరొచ్చింది. ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ గీతా బెహన్ అలుపెరగకుండా తన బృందంతో జిల్లా అంతటా శాంతి బోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావంగల ప్రాంతాలలో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి శాంతి బోధనలు చేస్తున్నారు.
జైనుల సేవ..
జిల్లాలో శాంతి కోసం జైనులు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో వస్త్రాలు, బంగారం, ఫ్యాన్సీ, తినుబండారాల వ్యాపారాలలో పాతిక సంవత్సరాలకు మించి జిల్లాలో స్థిరపడ్డ జైనులు తాము ప్రశాంత జీవనం గడుపుతూ జైన మందిరాలు నిర్మించి ప్రశాంతమైన జీవనం గడిపేందుకు ధ్యానాన్ని మార్గంగా ఎంచుకున్నారు. తమ పర్వదినాల్లో జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
శాంతితోనే ఉజ్వల భవిష్యత్తు
శాంతంగా ఉన్నప్పుడే మానవుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అశాంతితో ఏ పని సక్రమంగా చేయలేం. శాంతి సాధనకు యోగ, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయి.
– బ్రహ్మకుమారి గీతా బెహన్, జిల్లా కో ఆర్డినేటర్, ఓం శాంతి సంస్థ,కడప
అలజడులు అనారోగ్యానికి మూలం..
మనసుకు శాంతి లేకపోవడం అన్ని రకాల అలజడులు, అనారోగ్యాలను కలిగిస్తుంది. అశాంతి ఉన్న శక్తిని తగ్గించి వేస్తుంది. యోగా సాధన ద్వారా మనసును నియంత్రించి శాంతిని పొందవచ్చు.
– డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, యోగా థెరఫిస్ట్, మిత్ర యోగా కేంద్రం, కడప