- లోక్‌సభలో కార్మిక చట్టం సవరణ బిల్లుపై ఎంపీ వరప్రసాద్‌రావు ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక చట్టంలో సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న సవరణల్లో ఉల్లంఘనలకు తగిన చర్యలేవీ లేవని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
‘‘ఈ బిల్లుపై రాజకీయ కోణంలో మాట్లాడదలుచుకోలేదు. నేను గతంలో తమిళనాడు రాష్ట్రంలో లేబర్ కమిషనర్‌గా పనిచేశాను. అందువల్ల కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నా. నేను ఈ బిల్లుకు వ్యతిరేకంగానూ లేను. మద్దతుగానూ లేను. కార్మిక చ ట్టాలకు సంబంధించి శాసన ప్రక్రియను సరీళకరించడానికి ప్రోత్సాహాన్నిచ్చే రీతిలో ఇది కనిపిస్తోంది. కానీ మీరు లోతుగా చూస్తే సంక్లిష్టత కనిపిస్తుంది. రిజిస్టర్లు, రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో పంపించవచ్చన్న ప్రక్రియ ఒక్కటే సరళతరంగా కనిపిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘2005లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు స్టాండింగ్ కమిటీ దాదాపు 10 సార్లు సమావేశమైంది. తిరిగి 2011లో వచ్చినప్పుడు.. కొన్ని సవరణ ప్రతిపాదనలను తొలగించాలని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కానీ ఈ బిల్లులో ఒక్క లైను కూడా మారలేదు. సంస్థలు రిటర్నులు, రిజిస్టర్లను నిర్వహిస్తే తప్ప కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, వంటి కార్మిక సంక్షేమ చర్యలు అమలు కావు.. అందువల్ల సంఖ్య విషయంలో, జరిమానాల విషయంలో మార్పులు చేయాలి..’ అని వరప్రసాద్ డిమాండ్ చేశారు.
తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?