అభివృద్ధికి దూరంగా గూడూరు..
సాక్షి, గూడూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్‌రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వేకువనే నిద్ర లేస్తూ.. పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి పట్టణంలో ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. మాంసం మార్కెట్లో ఎదురైన దుర్భర పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ వస్తున్న దుర్వాసన ఎలా తట్లుకుంటున్నారంటూ అక్కడి వ్యాపారులను అడిగారు. ఇదేనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ విమర్శించారు.
అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూతన మార్కెట్‌ను కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తే... ఎమ్మెల్యే ఆ పనులను సాగనివ్వలేదంటూ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తానని, లేదంటే తనను నిలదీయాలని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో మహిళలు యూరిన్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, నాయకులు పడియాల శ్రీహరి, రుదీప్రెడ్డి, ఎస్సీసెల్ నాయకులు నర్సయ్య, మనోహర్, చంద్రనీల్, సురేష్, వినీల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
గూడూరు రూరల్: తనను గూడూరు ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపితే నిబద్ధతో పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు యద్దల నరేంద్రరెడ్డి నివాసానికి వెళ్లి గూడూరు మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.
నామినేషన్ వేసిన తరువాత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావును శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, వెందోటి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సునీల్‌రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గూడూరు నిమ్మ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని వెలగలపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. పట్టణ సమీపంలోని నిమ్మ మార్కెట్లో ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నాయకులు పొనకా శివకుమార్‌రెడ్డి, తలమంచి సిద్దారెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్‌రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, డాక్టర్ రాధా జోత్స్నలత, పిట్టి నాగరాజు తదితరులతో కలసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నిమ్మ పంటపై ఆధారపడిన రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.