* ప్రభుత్వానికి జైళ్లశాఖ ప్రతిపాదన
* ఖైదీల మానసిక ప్రశాంత కోసమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ సంస్కరణల్లో భాగంగా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖైదీలకు మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న జైళ్లశాఖ తాజాగా పరిసరాలపై దృష్టిపెట్టింది. నిండుగా తెలుపు రంగు కనిపిస్తే ఖైదీల్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనే భావనతో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు తెల్ల సున్నం వేయించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకూ ఖైదీలు ఉండే బ్యారక్‌లలో గోడలకు సిమెంట్ పూతతోనే వదిలేస్తుండటంతో ఏళ్లు గడిచే కొద్ది అవి నల్లగా మారిపోయాయి. దీనివల్ల ఖైదీలు మానసిక ప్రశాంతత కోల్పోవడంతోపాటు వారికి కంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు ఖైదీలకు ఇప్పటికే యోగా, మానసిక వైద్య నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న తాజాగా వారికి శారీరక ఉల్లాసం కల్పించేందుకు క్రీడలపై దృష్టిసారించింది.
ఆరోగ్యం కోసం క్రీడలను తప్పనిసరి చేస్తూ అందుకు కావాల్సిన క్రీడా సామాగ్రి కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. జైలు సామర్థ్యాన్ని బట్టి గరిష్టంగా రూ. 10 వేల వరకు ప్రత్యేక క్రీడల బడ్జెట్ కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే సిబ్బంది క్రీడల కోసం కూడా ప్రతి క్వార్టర్‌కు రూ. 3 వేలు కేటాయించాలని నిర్ణయించింది.
పోలీసుశాఖలో మాదిరిగా జైళ్లశాఖలోనూ ఇకపై 40 ఏళ్లు పైబడ్డ సిబ్బంది, వారి కుటుంబానికి పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జైళ్లశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిని కూడా ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనల్లో పేర్కొంది.
జైళ్లకు తెల్ల సున్నం..!
Published Fri, Dec 25 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement