చట్టాల్లో మార్పులు అవసరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఖైదీలను దండించడానికే రూపొందించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. విశాఖలో సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు జరిగే అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సుకు సోమవారం ప్రారంభమైంది.
ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలో జైళ్ల సామర్థ్యం కంటే 25 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్టు చెప్పారు. అందులో 80 శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలేనని వెల్లడించారు. పూర్వకాలం నాటి చట్టాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందన్నారు. జైళ్లు దండించడానికి కాదని, ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రిటిషర్ల ఆలోచనా ధోరణితో రూపుదిద్దుకున్న చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు నుంచి విచారణ వరకు అన్నీ వేగవంతంగా జరిగేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు.
కొత్త బిల్లుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో చేపట్టిన జైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,100 జైళ్లలో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు.
కేంద్ర కారాగారాల్లో నైపుణ్య కేంద్రాలు
సదస్సుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జైలు అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాలు జైలు అభివృద్ధి నిధి ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. ఆ నిధి ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్టు చెప్పారు.
అన్ని కేంద్ర కారాగారాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గర్భిణి ఖైదీలకు, వారి పిల్లలకు, వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. సదస్సులో బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ్, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు.