
ప్రజలకు డబ్బు ఆదా..
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకూ లబ్ధి: మోదీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధికి ఇది ‘డబుల్ డోసు’ మద్దతు అని తేల్చిచెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పన్నుల విధానం గందరగోళం ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థను సంస్కరించి, సరళీకృతం చేశామని పేర్కొన్నారు.
జీఎస్టీలో తాజా సంస్కరణలను ప్రసార మాధ్యమాలు ‘జీఎస్టీ 2.0’గా అభివరి్ణస్తున్నాయని తెలిపారు. తాజా మార్పులతో రెండు విధాలుగా లబ్ధి కలుగుతుందని వివరించారు. సాధారణ ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. అందుకే ఇది డబుల్ డోసు అని స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన విజేతలతో మోదీ మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు.
ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
‘‘దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం తదుపరి తరం సంస్కరణలను ఆపే ప్రసక్తేలేదు. దేశ ప్రజలకు డబుల్ ధమాకా ఇస్తానని ఎర్రకోట నుంచి హామీ ఇచ్చా. సెపె్టంబర్ 22న నవరాత్రుల తొలి రోజు నుంచే ఈ ధమాకా అందుబాటులోకి రాబోతోంది. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు విధించాయి. వంట గదిలో వాడుకొనే వస్తువులను, ఆఖరికి ఔషధాలను కూడా వదిలిపెట్టలేదు. అప్పటి పాలన ఇంకా కొనసాగుతూ ఉంటే రూ.100 విలువైన వస్తువు కొనుగోలుపై రూ.25 పన్ను చెల్లించాల్సి వచ్చేది.
ప్రజల చేతుల్లో డబ్బులు మిగిల్చి, వారి జీవితాలను మెరుగుపర్చాలన్న ధ్యేయంతో మేము పని చేస్తున్నాం. ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకొచ్చాం. ఈ విషయంలో మాపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని నిర్ణయించాం. గేమింగ్ అనేది చెడ్డది కాకపోయినా అదే పేరుతో జూదం ఆడడం ప్రమాదకరమే. ఆన్‌లైన్ గేమింగ్ సరైన రీతిలో నిర్వహిస్తే గ్లోబల్ మార్కెట్‌లో మన దేశమే నంబర్ వన్ అవుతుంది. మన దేశ ప్రగతి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.