యాక్సిస్ బ్యాంక్ లాభం 21% వృద్ధి
యాక్సిస్ బ్యాంక్ లాభం 21% వృద్ధి
Published Fri, Oct 18 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్ అగ్రగామి యాక్సిస్ బ్యాంక్.. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్(2013-14, క్యూ2)లో రూ.1,362 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,124 కోట్లతో పోలిస్తే 21.2 శాతం వృద్ధిని నమోదుచేసింది. మెరుగైన నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం), రూ.280 కోట్ల వన్‌టైమ్ ఆదాయం(వడ్డీయేతర) ఇందుకు దోహదం చేశాయని బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.8,280 కోట్ల నుంచి రూ.9,375 కోట్లకు పెరిగింది. 13.2 శాతం వృద్ధి చెందింది. కాగా, ఇతర ఆదాయం క్రితం క్యూ2లో రూ.1,593 కోట్ల నుంచి ఇప్పుడు రూ.1,766 కోట్లకు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ సెప్టెంబర్ చివరినాటికి 16 శాతం పెరిగి రూ.3,51,363 కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సోమనాథ్ సేన్‌గుప్తా చెప్పారు. ఇక మొత్తం రుణాలు క్యూ2లో 17 శాతం ఎగబాకి రూ.2,01,303 కోట్లకు ఎగిశాయి.
బ్యాంక్ నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ-మొండిబకాయిలు) క్యూ2లో స్వల్పంగా పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు 1.10 శాతం నుంచి 1.19 శాతానికి; నికర ఎన్‌పీఏలు 0.33 శాతం నుంచి 0.37 శాతానికి చేరాయి. కాగా, క్యూ2లో తాజా మొండిబకాయిలు కార్పొరేట్ రంగం నుంచే నమోదయ్యాయని సేన్‌గుప్తా వివరించారు. ఎన్‌ఐఎం 3.46 శాతం నుంచి 3.79 శాతానికి పెరిగింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 26 శాతం వృద్ధితో రూ.2,327 కోట్ల నుంచి రూ.2,937 కోట్లకు ఎగసింది. కాగా, క్యూ2లో రూ.1,030 కోట్ల విలువైన రుణాలను పునర్‌వ్యవస్థీకరించినట్లు సేన్‌గుప్తా వెల్లడించారు. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరం మిగతా క్వార్టర్లలో కూడా ఎన్‌ఐఎం 3.5% పైనే కొనసాగగలదని ఆయన అంచనా వేశారు.
తొలి ఆరు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 18% వృద్ధి చెందింది. రూ.2,277 కోట్ల నుంచి రూ.2,771 కోట్లకు ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.18,434 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.16,098 కోట్లతో పోలిస్తే... 14.5 శాతం వృద్ధి నమోదైంది. కాగా, గురువారం బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 1.26 శాతం పెరిగి రూ. 1,095 వద్ద స్థిరపడింది.
Advertisement
Advertisement