ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్‌బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్‌బీఐకి మరో సమస్యగా మారింది.
కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు
దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీతో సహా బీఎస్‌ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.
భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు
భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది.
క్రూడాయిల్ ధరల మంటలు
రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి.
రేపు అదానీ విల్మర్ లిస్టింగ్
ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది.
పాలసీ సమావేశం వాయిదా
ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment