టీసీఎస్ జూమ్
న్యూఢిల్లీ: దేశంలో నంబర్ వన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్.. బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14; క్యూ2)లో రూ.4,633 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,512 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 34 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.15,621 కోట్ల నుంచి రూ.20,977 కోట్లకు ఎగబాకింది. 34.3 శాతం వృద్ధి నమోదైంది. అన్ని రంగాలు, వివిధ దేశాల మార్కెట్ల నుంచి ఐటీకి డిమాండ్ జోరందుకోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం వంటివి కంపెనీకి కలిసొచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా(బీఎఫ్‌ఎస్‌ఈ), తయారీ రంగాలు ఈ పటిష్టమైన వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా, యూరప్ సహా అన్ని కీలక ప్రాంతాల నుంచి డిమాండ్ పుంజుకుంది. ఇక డాలరు రూపంలో నికరలాభం కూడా 16.4 శాతం ఎగసి 74.8 కోట్ల డాలర్లకు చేరింది. ఆదాయం 17 శాతం వృద్ధితో 334 కోట్ల డాలర్లుగా నమోదైంది.
త్రైమాసికంగానూ జోష్...
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1, సీక్వెన్షియల్‌గా)తో పోల్చినా టీసీఎస్ లాభాలు దూసుకెళ్లాయి. క్యూ1లో రూ.3,830 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా లాభం క్యూ2లో 22.76 శాతం ఎగసింది. ఇక ఆదాయం క్యూ1లో రూ.17,987 కోట్లుగా ఉంది. దీంతో చూస్తే.. క్యూ2లో 16.6 శాతం వృద్ధి చెందింది.
ఇతర ముఖ్యాంశాలివీ...
- సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీకి 10 కోట్ల డాలర్లకు పైగా విలువగల కాంట్రాక్టులు ఇచ్చిన ముగ్గురు క్లయింట్లు జతయ్యారు.
- బీపీఓ విభాగంతో సహా నికరంగా 7,664 మంది ఉద్యోగులు కంపెనీలో చేరారు(స్థూలంగా 17,362 మంది జతయ్యారు). దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,85,250కి చేరింది.
- పటిష్టమైన వ్యాపార పరివూణంతో పాటు, కరెన్సీ క్షీణత(డాలరుతో పోలిస్తే క్యూ2లో రూపాయి మారకం విలువ 11% పడిపోయింది), కాంట్రాక్టులను కచ్చితత్వంతో అమలు చేయడం తమకు మేలు చేశాయని టీసీఎస్ సీఎఫ్‌ఓ రాజేష్ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. దీంతో దేశీ ఐటీ పరిశ్రమను మించిన నిర్వహణ మార్జిన్లను క్యూ2లో నమోదుచేయగలిగామని చెప్పారు. కరెన్సీ క్షీణతతో మార్జిన్లు 300 బేసిస్ పాయింట్లు మెరుగైనట్లు తెలిపారు.
- వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 4 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. క్యూ1లో కూడా రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. తాజా మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ ఈ నెల 28.
- పటిష్టమైన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో టీసీఎస్ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో ఒకానొకదశలో 2%(రూ.44) ఎగబాకి రూ.2,258ని తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.2,218 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టస్థాయి.
నియామకాలను పెంచే అవకాశం...
ఈ ఏడాది కొత్త ఉద్యోగుల నియామకాల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉందని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ‘ఐటీకి మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీ నియామకాల లక్ష్యాన్ని కూడా కాస్త పెంచొచ్చు’ అని తెలిపారు. అయితే, అదనంగా ఎంతమందిని తీసుకుంటారనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000-50,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. ట్రైనీలను మినహాయిస్తే.. ‘ఉద్యోగుల వినియోగం క్యూ2లో 0.75 శాతం పెరిగి 83.4 శాతానికి చేరింది. క్యూ3లో కూడా ఇది మరింత పెరగనుంది. దీంతో నియామకాలపై దృష్టిపెడుతున్నాం. ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయి. మరోపక్క, ఐటీ విభాగంలో సిబ్బంది వలసల రేటు (అట్రిషన్) 9.8 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే 10.9 శాతంగా నిలిచింది’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఐటీకి అన్ని మార్కెట్లు, పరిశ్రమల నుంచి అత్యంత పటిష్టమైన డిమాండ్ కొనసాగుతోంది. దీంతోపాటు క్లయింట్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఆసరాతో క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించగలిగాం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నాం.
- ఎన్. చంద్రశేఖరన్,టీసీఎస్ ఎండీ, సీఈఓ