యస్ బ్యాంక్ క్యూ1 లాభం 33% జంప్
ముంబై : ప్రైవేటు రంగ యస్ బ్యాంకు జూన్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. కంపెనీ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ.732 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు సైతం 0.46% నుంచి 0.79%కి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 24.2% వృద్ధితో రూ.1,316 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 33% వృద్ధి, కరెంట్, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లలో 29 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. వడ్డీయేతర ఆదాయం సైతం 65.2 శాతం వృద్ధితో రూ.900.5 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్లు స్వల్ప పెరుగుదలతో 3.4 శాతంగా ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి...
అసెట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటుకు సెబీ నుంచి అనుమతి లభించినట్టు యస్ బ్యాంకు ప్రకటించింది. రానున్న కొన్ని నెలల్లో దీనికి తుదిరూపు తీసుకొచ్చి వచ్చే ఏడాది ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెడతామని తెలిపింది. కాగా, బ్యాంకు వ్యాపారాన్ని సహజసిద్ధంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, అదే సమయంలో కొనుగోళ్లకు సైతం సిద్ధంగా ఉన్నామని యస్ బ్యాంకు సీఈవో, ఎండీ రాణాకపూర్ ప్రకటించారు. వచ్చే వారం ఏడు రకాల క్రెడిట్ కార్డులను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఎన్‌పీఏల పెరుగుదల ఆందోళనలపై మాట్లాడుతూ... నికర ఎన్‌పీఏలు 0.29 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బిలియన్ డాలర్ల నిధుల సమీకరణను క్యూఐపీ విధానంలో 2017 మార్చి లోపు పూర్తి చేయనున్నట్టు చెప్పారు.