యస్ బ్యాంక్ లాభం 27 శాతం అప్
♦ క్యూ4లో రూ.702 కోట్లు
♦ వడ్డీయేతర ఆదాయం జోరు...
♦ రెట్టింపైన మొండి బకాయిలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.702 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.551 కోట్లు)తో పోల్చితే ఇది 27 శాతం అధికం. కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగం నుంచి అధిక ఫీజులు రావడంతో వడ్డీయేతర ఆదాయం జోరుగా పెరిగిందని, దీంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని యస్ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 18 శాతం వృద్ధి చెంది రూ.4,331 కోట్లకు పెరిగిందని తెలిపారు.
నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 27 శాతం పెరిగి రూ.1,241 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 36 శాతం ఎగసి రూ.803 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొండి బకాయిలకు కేటాయింపులు 48 శాతం వృద్ధితో రూ.187 కోట్లకు పెంచామని తెలిపారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 0.12 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 0.29 శాతానికి పెరిగాయని వివరించారు. అలాగే స్థూల మొండి బకాయిలు 0.41 శాతం నుంచి 0.76 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 3.4 శాతానికి పెరగ్గా, రుణ వృద్ధి 30 శాతం పెరిగిందని తెలిపారు. రూ..16,500 కోట్ల సమీకరణకు బ్యాంక్ బోర్డ్ ఆమోదం తెలిపిందని రాణా కపూర్ తెలిపారు.