యస్ బ్యాంక్‌కు వడ్డీ ఆదాయం జోరు
31 శాతం పెరిగిన నికర లాభం
ముంబై: ప్రైవేట్‌రంగంలోని యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.883 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.676 కోట్లు)తో పోల్చితే 31 శాతం వృద్ధి సాధించామని యస్ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.1,507 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.998 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్ చెప్పారు. వడ్డీ ఆదాయం జోరుతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వివరించారు.
తక్కువ వ్యయమయ్యే కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు జోరుగా పెరగడంతో నికర వడ్డీ మార్జిన్ 3.5 శాతానికి చేరిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా వచ్చిన రూ.8,068 కోట్ల డిపాజిట్లతో కలుపుకొని మొత్తం రూ.10,168 కోట్ల డిపాజిట్లు వచ్చాయని ఈ డిపాజిట్లు దీర్ఘకాలం ఉంటాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీంతో తమ నికర వడ్డీ మార్జిన్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 0.85%కి చేరాయని తెలిపారు.