ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.802 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,003 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరిగినప్పటికీ, నికర లాభం ఈ స్థాయిలో పెరగటం గమనార్హం. అయితే రుణ నాణ్యత క్షీణించింది.
గత క్యూ2లో రూ.1,412 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ2లో 34 శాతం వృద్ధితో రూ.1,885 కోట్లకు చేరినట్లు బ్యాంకు సీఈఓ రాణా కపూర్ తెలియజేశారు. మార్జిన్లు పెరగడం, రుణాలు, కాసా ఆదాయం నిలకడగా వృద్ధి సాధించడం వల్ల నికర వడ్డీ ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని చెప్పారాయన. మొత్తం ఆదాయం రూ.4,982 కోట్ల నుంచి రూ.6,049 కోట్లకు పెరిగింది.
ఇక నిర్వహణ లాభం 38 శాతం వృద్ధితో రూ.1,907 కోట్లకు, ఇతర ఆదాయం 35 శాతం వృద్ధితో రూ.1,248 కోట్లకు, నిర్వహణ లాభం 38 శాతం వృద్ధితో రూ.1,907 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం, నిర్వహణ లాభం పెరగడం వల్ల నికర లాభం 25 శాతం వృద్ధి చెందిందని కపూర్ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 3.7 శాతానికి చేరింది.
మూడు రెట్లు పెరిగిన మొండి బకాయిలు...
గత క్యూ2లో రూ.917 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో మూడు రెట్లు పెరిగి రూ.2,720 కోట్లకు చేరాయి. నికర మొండి బకాయిలు కూడా రూ.545 కోట్ల నుంచి రూ.1,543 కోట్లకు పెరిగాయి. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 0.83 శాతం నుంచి ఏకంగా 1.82 శాతానికి, నికర మొండి బకాయిలు 0.29 శాతం నుంచి 1.04 శాతానికి పెరిగాయి.
దీంతో కేటాయింపులు కూడా రూ.162 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.447 కోట్లకు పెంచినట్లు రాణా కపూర్ చెప్పారు. ఆర్‌బీఐ యాన్యువల్ రిస్క్ బేస్‌డ్ సూపర్‌విజన్(ఆర్‌బీఎస్) మార్గదర్శకాల ప్రకారం ఖాతాల వర్గీకరణ కారణంగా మొండి బకాయిలు, కేటాయింపులు భారీగా పెరిగిపోయాయని ఆయన తెలియజేశారు.
ఎన్‌పీఏల పరంగా ఇది తాత్కాలిక ఎదురుదెబ్బ అని, ఈ ఏడాదిలోనే ప్రొవిజనింగ్ పూర్తిచేసి ఆస్తుల నాణ్యతను పెంచుకుంటామన్నారు. మొత్తం రుణాలు 35% వృద్ధితో రూ.1.48 లక్షల కోట్లకు, డిపాజిట్లు 23% వృద్ధితో 1.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ రుణాలు 78% వృద్ధితో 11.4 %కి ఎగిశాయి.
యస్ బ్యాంక్ షేర్ 1% లాభపడి రూ.332 వద్ద ముగిసింది. అయితే ఫలితాలు మార్కెట్లు ముగిసిన అనంతరం వెలువడటంతో శుక్రవారం షేరుపై ప్రభావం ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment