ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, జెన్‌ టెక్‌, తాజ్‌ జీవీకే, రేమండ్‌ ఫలితాలు | indian corporate companies latest quarterly results | Sakshi
Sakshi News home page

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, జెన్‌ టెక్‌, తాజ్‌ జీవీకే, రేమండ్‌ ఫలితాలు

Published Tue, Nov 5 2024 2:41 PM | Last Updated on Tue, Nov 5 2024 2:41 PM

indian corporate companies latest quarterly results

ఆటో, టెలికం రంగ బ్యాటరీల తయారీ దిగ్గజం ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 233 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, నిల్వలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,372 కోట్ల నుంచి రూ. 4,450 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,044 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు పెరిగాయి. తయారీ వ్యయాలు, నిల్వల పద్దు రూ. 107 కోట్ల నుంచి రూ. 229 కోట్లకు పెరిగింది. కాగా.. ద్విచక్ర, కార్ల విభాగాలలో రీప్లేస్‌మెంట్‌ మార్కెట్‌ నుంచి భారీ డిమాండ్‌ కనిపిస్తున్నట్లు ఎక్సైడ్‌ పేర్కొంది. ఇండస్ట్రియల్‌– యూపీఎస్, సోలార్‌ విభాగంలోనూ డిమాండ్‌ నెలకొన్నప్పటకీ హోమ్‌ యూపీఎస్‌ విభాగం మందగించినట్లు వెల్లడించింది.

జెన్‌ టెక్నాలజీస్‌

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జెన్‌ టెక్నాలజీస్‌ ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 242 కోట్లకు పెరిగింది. లాభం రూ. 17 కోట్ల నుంచి రూ.65 కోట్లకు ఎగిసింది. ప్రథమార్ధానికి సంబంధించి ఆదాయం రూ. 196 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు, లాభం రూ. 64 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌ 30 నాటికి తమ ఆర్డర్‌ బుక్‌ రూ. 957 కోట్ల స్థాయిలో పటిష్టంగా ఉందని సంస్థ సీఎండీ అశోక్‌ అట్లూరి తెలిపారు.  

తాజ్‌ జీవీకే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఆదాయం రూ. 107 కోట్లుగా, లాభం సుమారు రూ. 20 కోట్లుగా (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) నమోదైంది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 90 కోట్లు కాగా, లాభం రూ. 11 కోట్లు. తాజ్‌ డెక్కన్‌ హోటల్‌ పునరుద్ధరణ పనులు పూర్తవడంతో రాబోయే త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని సంస్థ చైర్మన్‌ జీవీకే రెడ్డి తెలిపారు. బెంగలూరులోని యెలహంకలో నిర్మిస్తున్న 253 గదుల తాజ్‌ హోటల్‌ను 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్‌ ధరించిన మార్క్‌

రేమండ్‌

రేమండ్‌ లిమిటెడ్‌ సెపె్టంబర్‌ త్రైమాసికానికి రూ.59 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.161 కోట్లతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గిపోయింది. మొత్తం ఆదా యం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.512 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,101 కోట్లకు చేరింది. రియల్‌ ఎస్టేట్, ఇంజనీరింగ్‌ వ్యాపారాల్లో మంచి వృద్ధిని చూసినట్టు సంస్థ చైర్మన్, ఎండీ గౌతమ్‌ హరి సింఘానియా ప్రకటించారు. థానేలో రిటైల్‌ స్పేస్‌ ప్రాజెక్ట్‌ పార్క్‌ అవెన్యూని ప్రారంభించినట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement