
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేకి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫోన్‌పే రూ.696 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ఓ పోస్ట్ పెట్టారు. అయితే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ పోస్టు ఫేక్ అని, ఫోన్‌పే అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదీ ప్రకటించలేదని తేలింది.
అసలేముంది ఆ పోస్ట్‌లో?
ఈ ఐపీఎల్ సీజన్లో ఫోన్‌పే రూ.696 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోందని 'ఐపీఎల్-హబ్' అనే ఫేస్‌బుక్ యూజర్ మార్చి 22న పోస్ట్ చేశారు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి యూజర్ల కోసం రిజిస్ట్రేషన్ లింక్‌ను కూడా పోస్ట్‌లో పొందుపరిచారు. హిందీలో రాసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నిజమేనేమోనని చాలా మంది యూజర్లు దీన్ని షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.
మరి ఏం తేలింది?
ఇన్‌విడ్ అనే టూల్ ద్వారా ఈ వైరల్ పోస్ట్‌ను పరీక్షించగా ఇలాంటివే మరికొన్ని ఫేక్ పోస్టులు కనిపించాయి. ఫోన్‌పే అటువంటి క్యాష్‌బ్యాక్ పథకాన్ని ఏమైనా ప్రారంభించిందా అని తదుపరి ధ్రువీకరణ కోసం ఫోన్‌పేకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించినా అటువంటి ఆఫర్ ఏదీ కనిపించలేదు. ఈ పక్రియలో ఫోన్‌పే అధికారిక వెబ్‌సైట్లో ఒక బ్లాగ్ కనిపించింది. క్యాష్‌బ్యాక్ మోసాల నుండి అప్రమత్తంగా ఉండండి" అంటూ పేర్కొంది. ఫోన్ కాల్స్ లేదా లింక్‌ల ద్వారా ఫోన్‌పే క్యాష్ బ్యాక్‌లు, రివార్డులను అందించదని అందులో వివరించింది.