గేమ్ ప్లేలోకి వెళితే... యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘ఫైనల్ ఫాంటసీ’లో క్లైవ్ రాస్పెల్ అవుతారు. సాహస దారుల్లో ప్రయాణం చేస్తారు. జియోలొకేషన్–బేస్డ్ రోల్‌ప్లేయింగ్ గేమ్ ‘డ్రాగన్ క్వెస్ట్ వాక్’లోకి వెళ్లి మాన్‌స్టర్‌లతో తలపడతారు. హిట్ పాయింట్స్ కొడతారు. గేమింగ్ జోన్‌లోకి అడుగు పెడితే యూత్‌కు ఉత్సాహమే ఉత్సాహం. నిన్నటి వరకు అయితే ‘గేమింగ్’ అనేది యూత్‌కు ప్యాషన్ మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫ్యాన్సీ కెరీర్ కూడా. గేమ్ డెవలపర్ నుంచి నెరేటివ్ డిజైనర్ వరకు ఎన్నో అవకాశాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆన్‌లైన్ కోర్సులు చేయడం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఎన్నో విధానాల ద్వారా గేమింగ్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలపై పట్టు సాధిస్తున్నారు...
వీడియో గేమ్స్ అనేవి యూత్‌కు ఇక ‘జస్ట్ ఫర్ ఫన్’ ఎంతమాత్రం కాదు. తమకు నచ్చిన రంగంలోనే యువత ఉపాధి అవకాశాలు చూసుకుంటోంది. వీడియో గేమ్‌లపై అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో డెవలపర్‌లు, డిజైనర్‌లు, టెస్టర్స్... మొదలైన నైపుణ్యవంతులకు డిమాండ్ పెరిగింది.
‘గేమింగ్ అనేది ఇప్పుడు కేవలం రీక్రియేషన్ కాదు. సీరియస్ కెరీర్ ఆప్షన్’ అంటుంది భోపాల్‌కు చెందిన అనీష. ఆమె గేమింగ్ లోకంలోకి వెళితే మరో లోకం తెలియదు. అలాంటి అనీష ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది.
‘గేమింగ్’ అనే మహాప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు... ఇన్–డిమాండ్ రోల్స్, స్కిల్స్, కోర్సులు....మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది యువతరం. ‘గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్‌కు వ్యయప్రయాసలు అక్కర్లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు’ అంటుంది ముంబైకి చెందిన కైరా. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆన్‌లైన్ కోర్సు చేయడంతో పాటు బుక్స్ చదువుతోంది. గేమ్ డిజైన్‌కు సంబంధించి స్పెషలైజ్‌డ్ ప్రోగ్రామ్స్ చేసింది.
గేమ్ మెకానిక్స్ క్రియేట్ చేసే గేమ్ డెవలపర్‌లు, వోవరాల్ కాన్సెప్ట్, స్టోరీలైన్, క్యారెక్టర్లు, గేమ్‌ప్లేపై దృష్టి పెట్టే గేమ్ డిజైనర్‌లు, బగ్స్ బాధ లేకుండా చూసే అసూరెన్స్ టెస్టర్‌లు, విజువల్ ఎలిమెంట్స్‌ను క్రియేట్ చేసే గ్రాఫిక్ ఆర్టిస్‌లు, యానిమేటర్‌లు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ వోవర్‌లాంటి ఆడియో యాస్పెక్ట్స్‌కు సంబంధించిన సౌండ్ డిజైనర్‌లు...గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ యువతరం తమను తాము నిరూపించుకోవడానికి గేమింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అంటున్నాడు వీఆర్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆటోవీఆర్’ సీయివో, కో–ఫౌండర్ అశ్విన్ జైశంకర్. ‘ఎలాంటి అవకాశాలు ఉన్నాయి’ ‘ఏ కోర్సు చేస్తే మంచిది’లాంటి వాటి గురించి అశ్విన్ జైశంకర్‌లాంటి నిపుణులు చెబుతున్న విషయాలను యువతరం జాగ్రత్తగా వింటోంది.
‘అన్‌రియల్ ఇంజిన్ డెవలపర్ కోర్సు, యూనిటీ సర్టిఫైడ్ డెవలప్ కోర్సు, గేమ్ డిజైన్ అండ్ క్రియేషన్ స్పెషలైజేషన్... మొదలైనవి గేమ్ క్రియేషన్‌కు సంబంధించిన సరిౖయెన దారులు’ అంటున్నాడు అశ్విన్ జైశంకర్. గేమింగ్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, గేమింగ్ కంపెనీల విస్తరణ కారణంగా గేమింగ్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో కంపెనీలు తమప్రాజెక్ట్‌లను దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటున్నాయి.
మరోవైపు గేమింగ్ సెక్టార్‌లో ‘ఫ్రీలాన్సింగ్ ట్రెండ్’ పెరుగుతోంది. గేమ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కీలక దశలో ఫ్రీలాన్సర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ డెవలపర్‌ల నుంచి నెరేటివ్ డిజైనర్‌ల వరకు ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
మార్పు వచ్చింది..
గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే విషయంలో పిల్లల ఆసక్తి సరే, తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం వరకు ‘గేమింగ్ అనేది కెరీర్ ఆప్షన్ కాదు’ అనే భావన వారికి బలంగా ఉండేది. ఈ పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది.
‘ఒకప్పుడు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను గేమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులలో చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్నాడు గేమింగ్ కంపెనీ ‘బ్యాక్‌స్టేజ్ పాస్’ ఫౌండర్ సూర్య.
Comments
Please login to add a commentAdd a comment