కమలంలో ’టీ’ ఫైట్
వెంకయ్యనాయుడిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు?
పార్టీ జాతీయ నాయకుడిపై విమర్శలతో నేతల్లో కలవరం
వెంకయ్యను సమర్థిస్తూ మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు
ఎమ్మెల్యేల విమర్శలపై వివరణ కోరతామన్న కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే గడువు దగ్గరపడుతున్న దశలో కమలదళంలో విభేదాలు పొడసూపాయి. తెలంగాణ విషయంలో పార్టీ స్వరం మారుతోందన్న ప్రచారం నష్టదాయకంగా భావించిన ఆ ప్రాంత బీజేపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై పార్టీ శాసనసభా పక్షం నేతలు ప్రత్యక్షంగానే విమర్శనాస్త్రాలు సంధించటం బీజేపీలో తీవ్ర కలకలం రేపింది. పార్టీ నేతల మధ్య ఇంతకాలం అంతర్గతంగా కొనసాగుతున్న ప్రాంతాల వారీ విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. వెంకయ్యనాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో పార్టీ తెలంగాణ నేతలైన శాసనసభా పక్షం నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలు ఢిల్లీలో ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. సీమాంధ్ర సమస్యల ప్రస్తావన పేరుతో వెంకయ్య పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి మొత్తం అంశాన్ని పక్కదారి పట్టించే అవకాశముందని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర సమస్యలను సందర్భానుసారంగా లేవనెత్తకుండా ఆ ప్రస్తావన పేరుతో పార్టీ పరంగా తెరమీదకు తెచ్చిన చర్చ తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతోందని చెప్తున్నారు. దానికితోడు విభజన బిల్లును పార్లమెంట్‌లో పెట్టిన తర్వాత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు.. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గళం విప్పేలా చేశాయని అంటున్నారు. పార్టీ జాతీయస్థాయి నేతపై ఎమ్మెల్యేలు సంధించిన విమర్శలు చివరకు ఎక్కడికి దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
పరిష్కరించాలనటమే పాపమా?
చిన్న రాష్ట్రాలకు అనుకూలమన్న పార్టీ వైఖరికి భిన్నంగా వెంకయ్య మాటలు ఉంటున్నాయని తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్తోంటే.. సీమాంధ్ర నేతలు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. తమదొక జాతీయ పార్టీ అని ఎమ్మెల్యేలు మరిచినట్టున్నారని సీమాంధ్ర ఉద్యమ కమిటీ.. టీ-ఎమ్మెల్యేలపై మండిపడింది. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదంటూ.. ‘సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనటమే పాపమా?’ అని ప్రశ్నించింది. ‘తెలంగాణ ఇవ్వడంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయా? 25 పార్లమెంటు సీట్లున్న సీమాంధ్ర అవసరం లేదా?’ అని ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘యెండల లేదా యెన్నం అసెంబ్లీలో మా పార్టీ నాయకులు. వాళ్లు ఏం మాట్లాడినా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. వెంకయ్య ఏ స్థాయి నాయకుడో వీరికిప్పుడు గుర్తుకురావడం బాధాకరం. విచారకరం. వెంకయ్య సీమాంధ్రకే చెందినా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా ఉన్నారు. అటువంటి వ్యక్తికి లేనిపోనివి అంటగట్టడం తగదు’ అని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు.
ఆ విమర్శలు వ్యూహాత్మకమేనా..?
ఇదిలావుంటే.. వెంకయ్యపై విమర్శలు తమ వ్యూహంలో భాగమేనంటున్నారు తెలంగాణవాదులు. సీమాంధ్ర నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్న తెలంగాణవాదులు ఇప్పుడీ వ్యాఖ్యలతో వెంకయ్య తన వైఖరిని పరిశీలించుకునేందుకు పనికి వస్తాయనుకుంటున్నారు. సుష్మాస్వరాజ్, అరుణ్‌జెట్లీ లాంటి వాళ్లు తెలంగాణకు పూర్తి సానుకూలతతో ఉన్నా వెంకయ్యే తెరవెనుక నాటకం ఆడిస్తూ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయిస్తున్నారని.. దీంతో తాము తెలంగాణలో తలెత్తుకోలేకపోతున్నామని వీరు మధనపడుతున్నారు. సరిగ్గా ఈ దశలో ఎమ్మెల్యేల ‘తిరుగుబాటు’ వీరికి ఉపశమనం కలిగించింది. ఆ మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలోనూ యెండల లక్ష్మీనారాయణే వెంకయ్యపై విరుచుకుపడ్డారు. ఈసారి యెన్నం మరో అడుగు ముందుకేసి ‘నోటికాడి బుక్క లాక్కోవద్దు.. పాలకుండలో విషం చుక్క వేయొద్దు..’ అనటం వెంకయ్యపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు ఢిల్లీ బయలుదేరబోయే ముందు కొన్ని వదంతుల్ని ప్రచారంలో పెట్టారు. కేంద్ర నాయకత్వం బేషరతుగా తెలంగాణకు మద్దతివ్వకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వేయించారు. దీనికి పరాకాష్టే ఈ వ్యాఖ్యలని భావిస్తున్నారు.
వివరణ కోరతా: కిషన్‌రెడ్డి
పార్టీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఏం మాట్లాడారో తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారి నుంచి వివరణ కోరతానన్నారు. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ యావత్తు రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉందన్నారు. వ్యతిరేక వార్తలకు ఇస్తున్న ప్రాధాన్యత మిగతావాటికీ ఇవ్వాలని మీడియాకు సలహా ఇచ్చారు. తమ పార్టీ క్రమశిక్షణతో కూడుకున్నదన్నారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు.