సాక్షి, విజయవాడ : కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్న విమర్శలకు గట్టి సమాధానం చెపుతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విభజన హామీలపై ప్రజల ఆందోళన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపీ విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు పరిచామని, దుగరాజపట్నం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వేజోన్ వంటి కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదని తెలిసినా, ఇచ్చిన హామీ మేరకు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు విషయంలోను సానుకూలంగా ఉందని హరిబాబు అన్నారు.
రెవెన్యూలోటు భర్తీకోసం ఇప్పటి వరకూ కేంద్రం రూ.4వేల కోట్లు ఇచ్చిందని, దీనిపై మరింత స్పష్టత రాగానే భర్తీ చేస్తామని తెలిపారు. లక్ష కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులు ఒక్క ఏపీకే ఇచ్చామని, మూడు నాలుగేళ్లలో పూర్తవుతాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన వాటిని హక్కు అంటున్నారు.. ఇవ్వనివి మోదీ పాపం అంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకూ నాలుగు లక్షల గృహాలు మంజూరు చేశామని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు అవసరమైన పరిపాలనా భవనాలు, మౌలిక వసతుల కల్పనకు డిజైన్లు పూర్తి కాకముందే రూ.2500కోట్లు మంజూరు చేశామని, మరో వెయ్యి కోట్లు ఇస్తామని అన్నారు. ఎన్ని భవనాలు కట్టినా నిధులు ఇస్తామని, ముందు కేటాయించిన నిధులు ఖర్చు అయితేనే, బడ్జెట్ నిధులు కేటాయిస్తారని తెలిపారు.
హోదా ఇవ్వకపోయినా దానికి సమానమైన ప్రయోజనాలను ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెడితే 15శాతం పెట్టుబడి రాయితీ కల్పించామని అన్నారు. ఏపీని పెట్రోలియం హబ్‌గా ఏర్పాటు చేస్తామని, హెచ్‌పీసీఎల్ సామర్థ్ంయ విస్తరణ కోసం 20వేల కోట్లు ఇస్తామని వెల్లడించారు. చట్టంలో లేకపోయినా విశాఖకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) ఏర్పాటు చేశామని హరిబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment