అవాంఛనీయ కూటమి
విశ్లేషణ
ఏపీ విఠల్
ఒక జాతి పక్షులు ఒకే చోట కూడతాయన్నట్టు అభివృద్ధి అంటే కోటీశ్వరులకు ఊడిగం చేయడమనీ; రైతుల, కూలీల, చిరుద్యోగుల కడుపు మాడ్చడమన్న వైఖరితో పాటు ట్విట్టర్, సోషల్ మీడియా... ఇలా టెక్కు, నిక్కులకు మోజుపడే ఆ ఇరువురూ కలిసిపోయారు.
అత్యంత ప్రమాదకరమైన రీతిలో చంద్రబాబు-నరేంద్ర మోడీ కూటమి ఇవాళ రాష్ట్రంలో అవతరించాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకే దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన లక్షలాది పేదల మద్దతుతో వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడం అనివార్యమైంది. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈ పార్టీయే లేకుంటే, చేతగాని కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించవలసి వచ్చేది. అప్పుడైనా రాష్ర్టం ఆ కూటమి విషవలయంలో ఇరుక్కుని ఉండేది. ఇప్పుడా ప్రమాదం లేదు. అయినా ‘చంద్రబాబు-నరేంద్ర కూటమి’ పట్ల అప్రమత్తంగా ఉండక తప్పదు.
సర్వాధికారాలు మోడీకే కావాలి
నరేంద్ర మోడీ అహంభావి! ఆయన ఉపన్యాసాలలో ఎన్‌డీఏ, బీజేపీ అని కాకుండా, నేను ‘నా’ పాలన, ప్రభుత్వం అన్న ధోరణి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలలో గెలిస్తే అమెరికా అధ్యక్షుని మాదిరిగా సర్వాధికారాలు గుప్పెట్లో ఉంచుకుం దామని ఆయన అభిలాష. 2002 నాటి గోద్రా ఘటనల నేపథ్యంలో జరిగిన ముస్లింల ఊచకోత, గుజరాత్ ప్రభుత్వం పాత్ర, ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ వైఖరుల గురించి లోకం కోడై కూసింది. లోకం దాకా దేనికి? నేడు నిర్లజ్జగా ఆ మోడీ పంచన చేరిన చంద్రబాబు కూడా మోడీని ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించం అన్నారు. బీజేపీతో చెలిమి చేయడమే చారిత్రక తప్పిదమని చెంపలు వేసుకున్నారు. ఓట్ల కోసం అన్నింటినీ దిగమింగి చంద్రబాబు మళ్లీ మోడీతో పొత్తు కోసం ప్రాధేయపడి ఉండవచ్చు. కానీ చిరుత తన మచ్చలను ఎలా మార్చుకోలేదో, మోడీ సహజ పరమత ద్వేషమూ మారదు.
ప్రమాదకర కూటమి
ప్రధాని కావాలన్న మోడీ ఆకాంక్ష ఉత్తరప్రదేశ్‌లో ఎన్ని ఎక్కువ స్థానాలు సాధిస్తే అంత సులభమవుతుంది. ఆ రాష్ట్రంలో ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? అమిత్ షా. ఈయన గుజరాత్ హోంమంత్రిగా మోడీ తరఫున ఎన్నో అక్రమాలు సాగించాడు. బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా జరిపించాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల జరిగిన మతకల్లోలాల సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా జాట్‌లను రెచ్చగొట్టిన మతోన్మాది! ఎన్నికల ప్రచారంలో చాలా సున్నితమైన అంశాలు లేవనెత్తి పాకిస్థాన్, చైనాలతో కొత్త విభేదాలు సృష్టించేందుకు సైతం వెనకాడని పదవీ దాహం మోడీది. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనతో విసిగిన జనం నుంచి మోడీకి మద్దతు లభించవచ్చునేమోగానీ, మతోన్మాదాన్నీ, మతపరంగా ప్రజలను విభజించే ధోరణినీ మన సమాజం మాత్రం అంగీకరించదు.
ఇక చంద్రబాబును గురించి తెలియని వారుండరు. ఆయన వెన్నుపోటుకు ట్రేడ్ మార్కు. ఎన్.టి.రామారావు ‘జామాతా దశమగ్రహ’ పేరిట ఒక క్యాసెట్ రూపొందించి ప్రచారం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో చంద్రబాబు అవినీతిపరుడనీ, మోసగాడనీ, తననూ, తానిచ్చిన పదవినీ అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకున్నాడనీ, ఇంతటి నమ్మకద్రోహి మరొకరుండరనీ తన అల్లుడు చంద్రబాబుకు ఎన్‌టిఆర్ కితాబులు ఇచ్చారు. కానీ సొంత డబ్బా వాయించుకోవడానికి చంద్రబాబుకు జంకు గొంకూ ఉండదు. ‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే! నా హయాంలో బిల్ క్లింటన్‌ను తీసుకువచ్చాను. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాను. కలామ్ గార్ని రాష్ట్రపతిని చేసింది నేను’ ఇలా. అసలు నరేంద్రమోడీ నన్ను చూసే గుజరాత్‌ను అభివృద్ధి చేశాడని ఇదివరకు అన్నారు. కానీ, ఇప్పుడు మోడీ సభలలో అనడం లేదు. ఈయన చేసిన అభివృద్ధి ఏమిటో రైతుల ఆత్మహత్యలే చెబుతాయి? నాడు గుర్రాల కాళ్ల కింద నలిగిన అంగన్‌వాడీ కార్యకర్తలే చెబుతారు. ఇంకా విద్యుత్ ఉద్యమంలో పోలీసు కాల్పులలో అసువులు బాసిన అమరవీరులు కూడా చెబుతారు. ఆ అభివృద్ధికి ఇప్పుడు మోడీ అభివృద్ధి తోడవుతుంది కాబోలు అని ప్రజానీకం హడలిపోతున్నారు.
ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పటికీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నట్టు మిన్నూ మన్నూ ఏకం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. వస్తాననడం పాపం, ప్రతి కాంగ్రెస్ నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారు. సైకిలు తొక్కి తొక్కి, నిష్ణాతులమనుకుంటున్న ‘తమ్ముళ్ల’ను కరివేపాకులల్లే తీసేశారు. ఒక జాతి పక్షులు ఒకే చోట కూడతాయన్నట్టు అభివృద్ధి అంటే కోటీశ్వరులకు ఊడిగం చేయడమనీ; రైతుల, కూలీల, చిరుద్యోగుల కడుపు మాడ్చడమన్న వైఖరితో పాటు; ట్విట్టర్, సోషల్ మీడియా... ఇలా టెక్కు, నిక్కులకు మోజుపడే ఆ ఇరువురూ కలిసిపోయారు.
పవన్ బలిపశువు కాక తప్పదు
ఎంత కాలమైనా అన్నచాటు తమ్ముడినేనా? నేనూ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించి, ఏదో ఒక పదవి కొట్టెయ్యలేనా? అన్నట్టు జనసేన అంటూ హడావుడి చేశారు పవన్‌కల్యాణ్. తీరా జనసేనను మోడీ భజనసేనగా మలిచారు. ఈయనతో పోలిస్తే అన్నగారు తెలివి తక్కువవాడు. పార్టీ పెట్టక్కరలేదు. ఎన్నికలలో పోటీ చేయనక్కరలేదు. మోడీ అంతటి మొనగాడు లేడని ఆరంభించి, చివరకు చంద్రబాబు కీర్తనతో తరించేందుకు పవన్ తయారయ్యారు. తాను తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉన్నారట! హతోస్మి! ఆ మాట చెప్పి, మోడీ, బాబుల భజన చేస్తుంటే ఆ పోరాట యోధుల మనసు ఎంత క్షోభిస్తున్నదో? తెలంగాణ సాయుధ పోరాట యోధులు పవన్‌ను లైట్ తీసుకోవాలి. పవన్ కల్యాణ్‌కు ఏమీ తెలియదు! తెలిసిందల్లా తనతోపాటు అందరి పరువును బాబు, మోడీలకు తాకట్టు పెట్టి, కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఏదో పదవి దక్కించుకోవడమే. నన్నేమన్నా భరిస్తాను, మోడీని అంటే మాత్రం ఊరుకోను అని గర్జిస్తున్నాడు పవన్. మోడీ అనుంగు శిష్యుడు అమిత్ షా కూడా ఇలా అన్నాడో లేదో! జనాన్ని చూసి, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా, ‘కేసీఆర్! నీ తాట తీస్తా!’ అన్నాడు. ఒకటని పది అనిపించు కున్నారు. ‘ఆఫ్ట్రాల్ వాడెవరో, సినిమా వాడు, చిటికేస్తే వేయి ముక్కలవుతాడు కొడుకు?’అంటూ కేసీఆర్ తనదైన శైలిలో నాలుగూ వడ్డించారు. పైగా ‘తనని విమర్శించినట్టే జగన్ కేసీఆర్‌ను ఎందుకు విమర్శించరు? ఆయనకు ఆత్మగౌరవం లేదా?’ అంటూ కుంటి సవాళ్లు.
‘కాంగ్రెస్ వాళ్లను బట్టలూడదీసి కొట్టండి’ అన్న అయిదు సంవత్సరాలకు మళ్లీ ఇప్పుడు కనిపించారు పవన్! మళ్లీ ఎప్పుడో! మళ్లీ ఎన్ని అనిపించుకుంటారో? సరుకు లేని వారు ఇలా తాటలు తీస్తామంటూ నోటి దురద తీర్చుకుంటారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇలా ఏమీ లేని విస్తరిలా ఎగిరిపడరు? తాను చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా హృదయానికి హత్తుకునేట్లు చెప్పగలరు! నిజానికి పవన్ కల్యాణ్ గురించి ఇంత చెప్పుకోనక్కరలేదు. కానీ అందర్నీ వాడుకుని వదిలెయ్యడంలో మొనగాడైన చంద్రబాబు ఆయన దోస్త్ నరేంద్ర మోడీ ఎగదోస్తుంటే చివరికి ఆగమౌతాడేమోనన్న బాధతోనే, సదుద్దేశంతోనే ఈ మాటలు చెప్పడం. పవన్ అర్థం చేసుకున్నా లేకున్నా ఆయన శ్రేయోభిలాషులు మాత్రం చంద్రబాబు, మోడీల ఆటలో పవన్ బలిపశువు కాకుండా చూడాలని కోరుతున్నాను.
దేశభక్తులైన సీమాంధ్రప్రజలు బాబూ మోడీ ద్వయాన్ని ఓడించాలి! ఓడిస్తారు కూడా! కాంగ్రెస్ ఎలాగూ నిలువరించే స్థితిలో లేదు. రాష్ట్ర విభజనలో చంద్రబాబు, మోడీ పార్టీ బీజేపీ నిర్వహించిన పాత్ర ఒక రకం. ఇక విభజన ఆపుతానంటూ చివరి వరకూ ప్రగల్భాలు పలికి, కేంద్రం ఆదేశించిన విధంగా అన్ని రాజ్యాంగ ప్రక్రియలు పూర్తి చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మొత్తం ప్రక్రియలో జయచంద్రుని వంటివాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశాడట! కేసు వేసేందుకు పార్టీ దేనికి? ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ ఒక ప్రహసనం.
మెజారిటీ ప్రజల అండదండలున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే! మోడీ-బాబు ప్రమాదకర కూటమిని ఓడించగల సత్తా ఉన్న పార్టీ అదొక్కటే. మిగిలిన ఆలోచలనీ, ఆరోపణలనీ పక్కన పెట్టండి. అంతిమంగా నిప్పులాంటి నిజం నిగ్గు తేలుతుంది.
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు)