మోదీతో మాటల్లేవ్!
- ప్రధాని స్వాగత కార్యక్రమానికి 62 మంది బీజేపీ రాష్ట్ర నేతలు
- పుష్పగుచ్ఛాల అందజేతకే పరిమితం
- అధికారిక కార్యక్రమం, బిజీషెడ్యూల్ కావడంతో పార్టీ నేతలతో మాటామంతీ లేనట్లే
సాక్షి, హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం గురువారం రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ ఏపీ నేతల్లో 62 మందికి మాత్రమే అవకాశం దక్కింది. తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టులో 40 మంది కోస్తా ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు మోదీకి స్వాగతం తెలుపుతారు. ఆ తరువాత తిరుపతి విమానాశ్రయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన 22 నేతలు ప్రధానికి నమస్సులు తెలుపుతారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ శాఖ ప్రధాని భద్రతా సిబ్బందికి సమాచారం అందజేసింది.
ఏపీలో ప్రధాని పాల్గొనేవన్నీ అధికారిక కార్యక్రమాలే కావడంతోపాటు షెడ్యూల్ కూడా బిజీగా ఉండటంతో స్థానిక బీజేపీ నేతలతో మోదీ మాట్లాడే అవకాశమే లేదు. నాయకులంతా కేవలం స్వాగతం పలకడానికి మాత్రమే పరిమితమవుతారు. 'రాష్ట్ర పర్యటనలో ప్రధాని బీజీ షెడ్యూల్ కారణంగా నేతలకు నరేంద్రమోదీ మాట్లాడే అవకాశం లేదు'అని పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలకు సమాచారం అందజేసింది.