‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది.
స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా
‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది.
నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు.
ఆహారం– మానసిక అనారోగ్యం!
మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం.
ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి
వార్థక్యం పోంచి ఉంటుంది
బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్‌ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్
Comments
Please login to add a commentAdd a comment