‘గ్రేటర్’లో సీన్ రివర్స్!
♦ 22 నెలల్లో హైదరాబాద్‌లో ఎంత తేడా
♦ 43.85 శాతం ఓట్లు కొల్లగొట్టిన టీఆర్‌ఎస్
♦ 23.45 శాతంతో టీడీపీ-బీజేపీ కూటమి కుదేలు
♦ కేవలం 10.40 శాతంతో పరాభవం పాలైన కాంగ్రెస్
♦ 15.85 శాతంతో చెక్కు చెదరని మజ్లిస్ బలం
సాక్షి, హైదరాబాద్: కేవలం 22 నెలల్లో హైదరాబాద్‌లో సీన్ రివర్సయిపోయింది. అధికార టీఆర్‌ఎస్ జోరుకు ప్రతిపక్షాలన్నీ కుదేలయ్యాయి. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ-బీజేపీ కూటమి 42 శాతానికి పైగా ఓట్లు సాధించగా, తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇటు టీడీపీ-బీజేపీ, అటు కాంగ్రెస్ కంచుకోటల్ని టీఆర్‌ఎస్ బద్దలు కొట్టింది. ఏకంగా 43.85 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకుపోయింది.గ్రేటర్‌లో ఏకంగా 17 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఆరింట మజ్లిస్ పతంగం రెపరెపలాడింది.
2014లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 7,92,792 ఓట్లు తెచ్చుకుంది. తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాటిన దాదాపు రెట్టింపు చేసుకుంది! దశాబ్దాలుగా బీజేపీ, మజ్లిస్‌లకు మంచి పట్టున్న ప్రాంతాల్లోనూ అనూహ్యంగా ఓట్లు రాబట్టగలిగింది. బీజేపీ ఎమ్మెఏ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి కేవలం 28,587 ఓట్లొచ్చాయి! అదే టీఆర్‌ఎస్ అభ్యర్థులు 61,423 ఓట్లు కొల్లగొట్టారు. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం పరిధిలోనూ టీడీపీ-బీజేపీ కూటమికి 30,776, టీఆర్‌ఎస్‌కు 74,330 ఓట్లొచ్చాయి.
మజ్లిస్ కోటల్లోనూ కారు జోరు
టీఆర్‌ఎస్ సర్కార్ సంక్షేమ నినాదం మజ్లిస్ ఓటర్లను సైతం ప్రభావితం చేసింది. మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మలక్‌పేట అసెంబ్లీ స్థానం పరిధిలోఆ పార్టీకి 35,615 ఓట్లొస్తే, టీఆర్‌ఎస్‌కు 44,025 వచ్చాయి! 2014 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ మజ్లిస్ 58,976 ఓట్లు రాబట్టగా టీఆర్‌ఎస్ కేవలం 11,378 ఓట్లతో సరిపెట్టుకుంది. అలాగే మజ్లిస్ సిటింగ్ అసెంబ్లీ స్థానమైన కార్వాన్‌లోనూ ఆ పార్టీని టీఆర్‌ఎస్ గట్టిగానే నిలువరించింది. అక్కడ 2014లో మజ్లిస్‌కు 86,391, టీఆర్‌ఎస్‌కు కేవలం 10,760 ఓట్లొచ్చాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ ఓట్లు 54,307కు తగ్గితే, టీఆర్‌ఎస్ ఏకంగా 52,402 ఓట్లను సంపాదించగలిగింది. నాంపల్లి, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా,బహుదూర్‌పురా అసెంబ్లీ స్థానాల పరిధిలోని డివిజన్లలో కూడా టీఆర్‌ఎస్‌కు భారీగా ఓట్లు పడ్డాయి.