బుద్ధం శరణం శాలిహుండం | On April 21, Buddha Purnima | Sakshi
Sakshi News home page

బుద్ధం శరణం శాలిహుండం

Published Tue, May 17 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

బుద్ధం శరణం శాలిహుండం

బుద్ధం శరణం శాలిహుండం

 ఈ నెల  21న బుద్ధ పూర్ణిమ
శాలిహుండం


చరిత్రకు సజీవ సాక్ష్యాలు బౌద్ధ ఆరామాలు    పశ్చిమ దేశాలకు బౌద్ధం వ్యాప్తికి ఇదే మార్గం ర్యాటకులకు ఆకర్షణగా కాలచక్రం, బౌద్ధమ్యూజియం   శాలిహుండం పేరు చెప్పగానే బౌద్ధం మదిలో మెదులుతుంది. బుద్ధుడు ఉత్తర భారతదేశంలో తన బోధనలు ప్రవచించినా దక్షిణ భారతదేశంలోనే అవి సంపూర్ణ వికాసం చెందినవనడానికి సజీవ సాక్ష్యం శాలిహుండం. అంతేకాదు ఇక్కడికి సమీపంలోని కళింగపట్నం రేవు ద్వారానే బౌద్ధ ప్రచారకులు పశ్చిమ దేశాలకు వెళ్లారనడానికి కూడా సాక్ష్యాలు కళ్లకు కడుతున్నాయి. కళింగ రాజ్యంలోని శాలిహుండం బౌద్ధమత వికాసంలో కీలకపాత్ర పోషించింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్ది వరకూ ఓ వెలుగు వెలిగిన ఈ శాలిహుండం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నగరానికి సమీపంలోని ఓ కొండపై ఉంది.

 
అనేక చారిత్రక ఆధారాలకు నిలయమైన శాలిహుండంను తొలుత శాలివాటిక (బియ్యం తదితర ఆహార పదార్థాలు దాచే స్థలం) అని, తర్వాత శాలిపేటిక (మరణించిన బౌద్ధుల ఎముకలు, అవశేషాలు ఉంచే స్థలం) అని పిలిచేవారు. కాలక్రమేణ శాలిహుండంగా స్థిరపడింది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని సింహపురి (సింగుపురం) రాజధానిగా కళింగ రాజ్యాన్నేలిన శ్వేత చక్రవర్తి ఈ శాలిహుండం కొండకు పక్కనే ఉన్న మరో కొండపై కొలువైన కాళీయమర్ధన వేణుగోపాలస్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసేవారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాత కాలంలో శాలిహుండం కొండల నుంచి జనజీవన స్రవంతి దూరంగా జరిగింది. కాలగర్భంలో కలిసిన శాలిహుండం బౌద్ధ ఆరామాలను, వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చారిత్రక పరిశోధకుడు గిడుగు వెంకట రమణమూర్తి 1919 సంవత్సరంలో  వెలుగులోకి తెచ్చారు.



ప్రకృతి శోభితం
పక్కనే వంశధార నదీ పరవళ్లు, కనుచూపు దూరంలో బంగాళాఖాతం సముద్రం, మరోవైపు పచ్చని పంటపొలాలు, కొబ్బరిచెట్ల మధ్య శాలిహుండం ప్రకృతి శోభితంగా కనిపిస్తుంది. ఇక కొండపై బౌద్ధారామాలు, స్తూపాలు, కాలచక్రం, సొరంగమార్గం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కొండపైకి వెళ్లేందుకు అప్పట్లోనే ఇరువైపుల కాల్చిన ఇటుకలతో నిర్మించిన గోడలతో రాతిమార్గం ఉంటుంది. కొండ దిగువన కేంద్ర పురావస్తుశాఖ నిర్మించిన మ్యూజియం ఉంది.

 
పశ్చిమ దేశాలకు మార్గం

 క్రీ.పూ 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ ధర్మం ప్రచారం చేయించారు. అలా దక్షిణ భారతదేశంలో బౌద్ధం అడుగు పెట్టింది. అప్పట్లో బౌద్ధం విరాజిల్లిన దక్షిణ ప్రాంతాల్లో శాలిహుండం ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడికి సమీపంలోని కళింగపట్నం ఓడరేవు నుంచి బౌద్ధులు సింగపూర్, జపాన్, చైనా దేశాలకు సముద్రమార్గంలో వెళ్లి అక్కడ బౌద్ధాన్ని ప్రచారం చేశారు. అలాగే బౌద్ధమత ప్రబోధకుల్లో ముఖ్యమైన తార, మరీచి రాతివిగ్రహాలు కూడా శాలిహుండం నుంచే పశ్చిమ దేశాలకు తరలి వెళ్లాయనడానికీ ఇక్కడ శాసనాలే సాక్ష్యం.

 
మహాయాన పాఠశాల
బౌద్ధులు మహాయానం, హీనయానం శాఖలుగా విడిపోయిన తర్వాత శాలిహుండం మహాయాన పాఠశాలకు వేదికైంది. ఇక్కడ బౌద్ధంతో పాటు సంస్కృతం కూడా బోధించేవారట. తర్వాత క్రీ.శ.7, 8 శతాబ్దాల నాటికి తాంత్రిక ప్రక్రియలతో కూడిన వజ్రయానం కూడా ఇక్కడే వర్థిల్లింది. దీన్ని చాటి చెప్పే మహిషాసుర మర్దిని, ధ్యాన బుద్ధ, అక్షోజ్యబుద్ధ, నందితల విగ్రహాలు శాలిహుండంలో లభించాయి. ప్రస్తుతం వాటిని ఇక్కడి మ్యూజియంలో చూడవచ్చు. రోమన్ నాగరికతకు చెందిన రౌలెటెడ్‌వేర్ శకలాలు కూడా శాలిహుండంపై తవ్వకాల్లో లభించాయి.


అద్భుత కట్టడాలు...
కప్ప హుండీ: శాలిహుండం బౌద్ధారామాలకు దిగువన పశ్చిమ భాగంలో రాళ్ల మధ్యన కప్పహుండీ ఉంది. ఈ హుండీలో ఎల్లప్పుడూ నీరు ఉండేదట. దీనిలో భక్తులు నాణేలు వేస్తే శాలిహుండానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మనాథ ఆలయంలోని గర్భగుడికి చేరుకునేవట.

 
సొరంగమార్గం: కొండ అగ్రభాగంలో చతురస్రాకార కట్టడం. దీని దిగువ నుంచి కళింగపట్నం వద్దనున్న చిన్న బౌద్ధారామం వరకూ సొరంగ మార్గం ఉంది. దీన్ని శ్వేత చక్రవర్తి రాకపోకలకు వినియోగించేవారని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. బౌద్ధారామాలు కనుగొనే సమయంలో ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు.

 
కాలచక్రం: ధర్మచక్రంలో మాదిరిగా ఎనిమిది ఆకుల మధ్య పుష్పం ఆకారంలో ఎతై ్తన కట్టడం శాలిహుండం కొండపై కనిపిస్తుంది. సూర్యగమనం ఆధారంగా ఈ కట్టడంపై పడే నీడను చూసి సమయం లెక్కించేవారు. అందుకే దీన్ని కాలచక్రం అని పిలుస్తున్నారు. దీనిని నవగ్రహ ధ్యానానికి ఉపయోగించేవారట. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.            - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement