బుద్ధుడు దోషాలు చేసేవారిని సంస్కరించడానికి శతవిధాలా ప్రయత్నం చేసేవాడు. అప్పటికీ, ఎప్పటికీ ఇక వీరు మారరు అనుకుంటే వారిని సంఘానికి దూరం పెట్టేవాడు. సంఘానికి ఇచ్చే గౌరవం వ్యక్తికి ఇచ్చేవాడు కాదు. భిక్షువులందరూ కుటుంబాల్ని, ఆస్తిపాస్తుల్ని వదిలి వచ్చినవారే! కానీ తాము మాత్రమే త్యాగం చేశామని గప్పాలు కొట్టుకునేవారు, విహారానికి దానాలు చేసే ఉపాసకులు (గృహస్తులు) దగ్గర ఇతరుల మీద లేనిపోని అపవాదులు వేసేవారు. అలాంటివారిలో చంపావిహారంలోని కణ్ణథేరుడు ఒకడు.
విహారానికి ఎవరైనా దానాలు సమర్పిస్తే... అవి నావల్లే వారు సమర్పించారు..’’ అని ప్రగల్భాలు పలికేవాడు. భోజనాల్ని పంచే పదవిలో ఉంచితే, కొన్నాళ్లు ఉండి ‘‘ఈ పదవి నేను తప్ప మరొకరు నిర్వహించలేరు. నా సామర్థ్యం ఈ సంఘానికి తెలియాలి’’ అనుకొని దానినుండి ఏవో సాకులు చెప్పి వైదొలగేవాడు. మరొక భిక్షువు ఆ పదవిని చేపట్టి ఎంతో సమర్థవంతంగా నిర్వహించడంతో తట్టుకోలేకపోయేవాడు. ఈర్ష్య చెందేవాడు. ఆ ఈర్ష్యని సంఘం మీద రుద్దేవాడు. పదవినుండి తానే దైదొలగి, వచ్చినా ఉపాసకులతో–‘‘నన్ను బలవంతాన తొలగించారు’’ అని అబద్ధాలు చెప్పేవాడు.
అలా ఆ కణ్ణ భిక్షువు తోటి భిక్షువుల మీదే కాకుండా, సంఘం మొత్తం మీద విమర్శలు చేస్తుండేవాడు. వారు నిర్వాకుల్లో కొందరినే కీర్తిస్తూ వారి ప్రాపకం కోసం ఆరాటపడేవాడు. వారిలో ‘‘నేను ఈ విహార నిర్మాణం నుండి ఉన్నాను. దీని నిర్వహణకు నేను తగునా?’’ అని నర్మగర్భితంగా అడిగేవాడు. వారు ఎవరూ పట్టించుకోకపోతే ‘‘ఈ విహార స్థాపకుణ్ణి నేనే.. నేనే మొదటి నుండి ఉన్నాను. నన్ను గౌరవించరా?’’ అంటూ వచ్చిన ప్రతివారి దగ్గర ఏకరువు పెట్టేవాడు. ఇలా.. సంఘం ఐక్యతకి చేటుగా తయారయ్యాడు. తోటి భిక్షువులు, అనేక సార్లు బుద్ధుడు కూడా చెప్పి చూశాడు. కొంతకాలం బాగానే ఉంటాడు. మరలా కువిమర్శలు మొదలు పెట్టేవాడు. ఆ విరామంలో భిక్షువులు అతని విచిత్ర మనస్తత్వాన్ని తట్టుకోలేకపొయారు.
అప్పుడు బుద్ధుడు చంపావద్ద గల గగ్గిరా పద్మాల పుష్కరణ్ తీరంలో ఉన్నాడు. అదే సమయంలో చంపా విహార భిక్షువులు సమావేశమై కణ్ణ భిక్షువుని పిలిచి అతని తప్పులు చెప్పి, వివరణ అడిగారు. వారు అడిగిన విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయం మీద చర్చ పెట్టుమన్నాడు. ఇలా అడిగిన దానికి కాకుండా పొంతన లేనిది వాగుడు వాగడంతో వారి మీద కోపాన్ని, ద్వేషాన్నీ, తిరస్కారాన్నీ చూపడంతో వారంతా పద్మాల పుష్కరిణికి దగ్గరకు వెళ్ళి, బుద్ధునికి వివరించాడు– అప్పుడు బుద్ధుడు కణ్ణభిక్షువు ఇది తెలియజేసిన దోషాలు కాదు. కావాలనే చేస్తున్నాడు. అతని మనస్తత్వం మార్చలేనిది. ఇది అతని సహజాత స్వభావంగా భావించి...
‘‘భిక్షువులారా! ఒకరైతు బార్లీ పంట వేస్తాడు. ఆ మొక్కల మధ్య తెగులు సోకిన ఒక బార్లీ మొక్క ఉంటుంది. దానితో తెగులు మొదట్లో బయటకు వ్యక్తం కాదు. ఆరోగ్యకరమైన బార్లీ మొక్కల్లానే పెరుగుతుంది. దాని కాండం, వేర్లు, అకులు ఎంతో ఆరోగ్యంగానే కనిపిస్తాయి. పైకి ఎలాంటి తేడా వ్యక్తం కాదు. కానీ అది కంకి తొడిగినప్పుడు దాని తలను చూస్తే అది తెగులు సోకిన మొక్క అని రైతుకు తెలుస్తుంది. ఇక అప్పుడు ఆ రైతు దీని కాండం బాగుంది, అకులు బాగున్నాయి, వేరు బలంగా ఉంది అని ఆలోచించడు. దానివల్ల ఆ తెగులు ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది అని భయపడి వెంటనే దాన్ని పీకేస్తాడు. చేనులోంచి తొలగిస్తాడు.’’
అలాగే మరో రైతు తాను పండించిన వరి ధాన్యాన్ని నూర్చి, తూర్పారబోస్తాడు. అప్పుడు తుక్కు ధూళి దూరంగా పోయి పడతాయి. కానీ, తాలుగింజలు, తప్పలు మంచి విత్తనాల రాశి పక్కనే పడతాయి. అప్పుడు ఆ రైతు ఇవి చూడ్డానికి మంచి గింజల్లానే ఉన్నాయని వాటిని రాశిలోకి నెట్టడు. పొలికట్ట (చీపురు) తీసుకుని వాటిని రాశికి దూరంగా ఊడ్చేస్తాడు. రాశి నుండి తొలగిస్తాడు’’.
కాబట్టి... ఈ కణ్ణ భిక్షువు ఇక సంఘంలో పనికిరాడు. మారడు. ఇలాంటి వారు చాలా చాలా అరుదు. ఇతని వల్ల సంఘం మొత్తం నిందల పాలవుతుంది. కాబట్టి ఇతన్ని మీ సంఘం నుంచి బహిష్కరించండి’ అని చెప్పాడు. ఎలాంటి దోషాలు లేని ఒక వ్యక్తి కంటే కొద్దో గొప్పో దోషాలతో ఉన్నప్పటికీ సంఘమే గొప్పది అని చెప్పిన బుద్ధుడు గొప్ప ప్రజాస్వామ్యవాది. ఐక్యతకు మించిన బలం మరొకటి లేదని చెప్పిన సమైక్యతావాది.
Comments
Please login to add a commentAdd a comment