ఏ సంఘటనని సాయి జీవితంలో దర్శించినా అది మూఢవిశ్వాసమనీ, హేతువాదానికి నిలవనే నిలవదనీ అనుకోనే అక్కర్లేదు. లో–పరిశీలించి చూస్తే తప్పక అందులో యదార్థత దాంతో పాటు సాయిని విశ్వసించి తీరాలనే దృఢబుద్ధీ కలుగుతాయి పాఠకులకీ, శ్రోతలకీ కూడా. ఈ నేపథ్యంలో సాయికున్న సమాన –వ్యాన వాయువుల మీద ఉన్న అధికారాన్ని గమనించుకుని పై శీర్షికకి సంబంధించిన– జరిగిన కథని వివరించుకుని ఆనందిద్దాం! ‘కాయస్థ’ అనే ఒక కులానికి చెందిన స్త్రీ ఉండేది.
గర్భవతి కథ
ఆమెకి ప్రతి కాన్పూ తీవ్రమైన ప్రాణాంతక స్థితిని గుర్తుచేస్తూ ఉండేది. దాంతో భయపడిన ఆ దంపతులు శ్రీరాం మారుతి అనే బాబాకి సన్నిహితుడైన ప్రముఖుణ్ణి కలిస్తే ఆయన ఈ దంపతుల్ని సాయి వద్దే ప్రసవం రోజుల్లో ఉండవలసిందని సూచించాడు. వాళ్లు అలాగే సాయి పూజని చేస్తూ షిర్డీలోనే ఉండిపోయారు. ఇక ప్రసవం కాబోతుందనగా ఆమె గర్భంలోని శిశువు అడ్డం తిరిగి యథా పూర్వంలా తల్లి ప్రాణాన్ని బలిగొనే స్థితిని కల్గించేసింది. సాయిధ్యానాన్నే చేస్తూ ఆ గర్భవతి ఉండగా, ఇతర భక్తులందరూ కూడా ఈమె కోసం ధ్యానాన్ని కొనసాగిస్తుండగా.. ఆమె ‘ప్రసవించింది’ అయితే పుట్టిన బిడ్డ మరణించింది. ఏ ఒక్కరూ కూడా ‘సాయి ఏం చేయగలిగాడు?’ అని నిందించలేదు, పరోక్షంగా– కుతర్కాన్నీ చేయలేదు. పైగా సాయి రక్షించడం బట్టే పెద్ద ప్రాణం(తల్లిప్రాణాలు) రక్షింపబడిందనే అన్నారు. సాయికి సమానవాయువు మీద (బొడ్డు భాగంలో ఉంటూ గర్భవతుల ఆహారసారాన్ని బొడ్డుతాడు ద్వారా సంతానానికి పంపుతూండే వాయువూ ఆధిపత్యం ఉంది కాబట్టే ఇలా సుఖ ప్రసవమయిందనే అనుకున్నారు. ఆ శిశువు శరీరంలో వ్యానవాయువు (శరీరంలో ఎక్కడెక్కడ ఏయే వాయుశాతం తగ్గిందో ఆ వాయువుని అక్కడికక్కడే అప్పటికప్పుడే నింపగల శక్తి ఉన్న వాయువు) సర్వ అవయవాల్లోకీ ప్రవహిస్తూ చరించలేదని తెలిసిన సాయి ఆ శిశువు మృతిపట్ల ఏవిధమైన బాధని పడనేలేదు. దానికి కారణం సాయికి వ్యానవాయువు మీద ఆధిపత్య శక్తీ, అలాగే అదే శిశువుకి ఉండాల్సినంత ప్రాణవాయు శక్తి లేక మరణిస్తుందనే భవిష్యత్కాలాన్ని తెలుసుకోగల శక్తీ ఉండటమే!
ఆత్మహత్యా ఆలోచన
గోపాల్(నారాయణ్ అంబడేకర్) అనే ఓ భక్తుడు పూనా(పూణే)లో ఉంటుండేవాడు. ప్రభుత్వోద్యోగం చేసి పదవీ విశ్రాంతిని పొందాడు(రిటైర్మెంట్). దాంతో అతనికి ఏమి తోచనట్లయింది. ఏం చేయాలో పాలుపోయేది కాదు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకున్నా తాను చేసింది ఎక్సైజ్ ఉద్యోగం అయ్యేసరికి (మద్యాన్ని అమ్మించడం–అక్రమ మద్యాన్ని పట్టుకుని శిక్ష విధించడం) ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇదిలా ఉంటే అతను క్రమంగా దురదృష్టం పాలు కాసాగాడు. ఎందరి ద్వారానో.. ఏ తీరు ఉద్యోగమైనా సరే చేయగలనని అందరికీ సమాచారాన్ని పంపాడు గానీ ఏ ఒక్కరూ కూడా ఇతనికి సరిపడిన ఉద్యోగం తమ వద్ద లేనేలేదంటూ తిరస్కరించారు. దిక్కుతోచని దశలో ఆర్థికంగా కూరుకుపోతున్న స్థితిలో కూడా ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్లడాన్ని మానేవాడు కాదు. అయినా ఏ తీరుగానూ అతని పరిస్థితి పైకి వెళ్లిన సందర్భమే లేకపోయింది. సాయికి తన కష్టాన్ని విన్పించుకునేవాడు వెళ్లిన ప్రతిసారీ. సాయి అతని కథని విని మౌనంగా ఉండేవాడే తప్ప ఏమీ మాట్లాడే వాడే కాదు.
దాంతో తనలో తానే తన దురదృష్టాన్ని నిందించుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ ఎంతసేపో మౌనంగా ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. తన ఆలోచనలు ఇలా సాగాయి. ఎండవేడిమికి తట్టుకోలేక చల్లని నీడనిస్తున్న చెట్టునీడన చేరితే ఆ చెట్టుమీద మండే ఓ పసిరికపాము తలనపడితే ఎలా భయంతో వణికిపోతామో, ఏ చెట్టు నీడనీ ఆశ్రయించడానికి భయపడిపోతామో అలా అయింది అతని స్థితి. సాయిని ఆశ్రయించినా మార్పు రాలేదని బాధపడ్డాడు.అర్ధరాత్రివేళ ఇంట్లోకి దొంగ వచ్చి కత్తి చూపి భయపెడుతూంటే అకస్మాత్తుగా తలుపులో నుండి పారిపోయి మరో ఇంటివాళ్లని లేపబోతుంటే అక్కడే దొంగలు తనని పట్టుకుని కట్టేసినట్టయింది అతని దుర్దశ. సాయిని చేరినా మార్పు రానేలేదని మనోవ్య«థ పడ్డాడు. దైవం తప్ప రక్షించే వాడెవరున్నారు? అనే దృఢ విశ్వాసంతో దేవాలయంలోకి కంగారుగా ప్రవేశిస్తే ఆ గుడిలోని గంటే తలకి బలంగా కొట్టుకుని మూర్ఛపోయేంత స్థితిని కల్పించినట్టయింది అతని పరిస్థితి. సాయిని సేవించినా పరివర్తన(పరిస్థితిలో మార్పు) లేనేలేదని తీవ్రమైన అశాంతికి లోనయ్యాడు.ఎదురుగా వస్తున్న పులిని గమనించి పులి నోట్లో పడకుండా తప్పించుకున్న గోవు ‘బతికాను జీవుడా!’ అని మనశ్శాంతితో ఉండబోతే ఎదురుగా నిలుచున్న కటికవాడు బలంగా తన కొమ్ముల్ని పట్టి ముకుతాడుని చేత్తో పట్టుకుని వధ్యశాలకి తీసుకుపోతున్నట్లనిపించింది తనకి. సాయిసేవని చేసినా ఆరాధించినా కూడా తనకి ఏమాత్రమూ తోవ దొరకలేదని ఎంతో అలజడికీ అశాంతికీ గురి అయ్యాడు. ఇన్నీ ఆలోచనలని చేసి చేసి–కుటుంబానికి తానేమీ చేయలేని స్థితికొచ్చేసానని గమనించి, అండగా నిలిచే వాళ్లెవరూ లేరనే నిర్ధారణకొచ్చి– ఆ సమస్యకి పరిష్కారం కేవలం ఆత్మహత్య మాత్రమేననే స్థిరాభిప్రాయానికి వచ్చేసాడు. గోపాల్ నారాయణ్ కుటుంబం మొత్తాన్ని షిర్డీకి మార్చేసాడు. అయితే తనలో అభిప్రాయాన్ని ఏ ఒక్కరికీ కూడా చెప్పనేలేదు.ఏ రోజూ ఆత్మహత్యకి ఏది తేలికైన మార్గం? ఎలా బాధని అనుభవించకుండా క్షణంలో ప్రాణాన్ని తీసేసుకోవాలి? అంతే కాదు ఒకసారంటూ ఆత్మహత్యకి ప్రయత్నించి కార్యరంగంలోకి దూకాక ఆ ప్రయత్నం విఫలమై మళ్లీ జీవించవలసి వస్తే– ఇటు ప్రతిష్టాపోతుంది, మరోసారి ఆ ప్రయత్నం చేయవీలుకాదు. కనీసం ఆత్మహత్యని చేసుకోవడంలో కూడా ఓడిపోయాడనే మాట మిగిలిపోతుంది తనకి– అని ఈ తీరుగా మార్గాలను అన్వేషిస్తూ ఉండిపోయాడు. అంతే! అతనికో మంచి ఆలోచన తాననుకున్న పనిని ఏ ఒక్కరూ గుర్తించవీల్లేని ఆలోచన– తాను పడుతున్న కడగండ్లనీ– కష్టాలనీ– భవలోక బంధాలనీ క్షణంలో తీర్చేసుకోగల ఆలోచన– తన కొచ్చింది. అదే! బావిలోకి దూకి ఆత్మహత్యని చేసేసుకోవడమనే ఆలోచన!
ముసురుకున్న ఊహలు
ఆత్మహత్య అనుకోగానే ఎన్నో ఆలోచనలు రాసాగాయి గోపాల్‌కి. మనని నమ్ముకుని వచ్చిన పంచప్రాణాలనీ అలా ఉంచేసి అకస్మాత్తుగా ప్రాణాలని బలవంతాన తీసుకోవడం ఏమంత సబబు? చుట్టాలందర్నీ పిలిచి–ఇప్పుడే వస్తానని చెప్పి అకస్మాత్తుగా యజమాని ఎటో వెళ్లిపోతే వచ్చిన చుట్టాలంతా ఏమనుకుంటారు? అసలు ఆ కాడికి చుట్టాలని పిలవడం దేనికి? ఈ పంచప్రాణాలూ మనల్ని నమ్ముకుని వచ్చిన చుట్టాలవంటివే కదా! అనేది ఒక ఊహ! వీటిని కాదని వెళ్లిపోవడం ధర్మమా? నిజమే! కష్టం వచ్చింది! ఇంతకంటే కష్టపడ్డవాళ్లెందరు లేరు? ఓ ద్రౌపది నిండు సభలో హస్తినాపుర ప్రజలు రాజులు సామంతులు...ఇలా ఎందరో చూస్తుండగా, తనని రక్షించవలసిన బాధ్యతా ధర్మమూ ఉన్న భీష్మ ద్రోణ కృప బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులు మొదలైన వృద్ధులందరూ ఉండగా వస్త్రాపహరణమంత దుఃఖం అందునా ఏక వస్త్రకాలంలో (స్త్రీ అశుచిగా నెలకోసారి ఉండే 3 రోజుల్లో మొదటిరోజు సమయంలో) జరిగినా ఆమె దానిని తట్టుకుని తననెవరు అలా స్థాయిని దిగజార్చి పరువూ ప్రతిష్ఠ పోయేలా చేసారో, తనకే కాక తన భర్తలందరికీ అపకీర్తి కలగజేసారో, ఎవరు ఆ సమయంలో తమకేం పట్టనట్టుగా ఉంటూ మౌనసాక్షులుగా ఉండిపోయారో ఆ అందర్నీ కురుక్షేత్రమనే పేరున్న యుద్ధంలో సమూలంగా వధించలేదూ? అది కాదు చేయవలసిన కర్తవ్యం!? అనే మరో ఊహ కలిగింది గోపాల్‌కి. అయినా మళ్లీ తనకి పూర్వజన్మ సుకృతం కారణంగా ఉద్యోగం ఎప్పుడొస్తుందనీ –తన భార్య పుత్రుల్ని జాగ్రత్తగా చూసుకోగలననీ బాగా ఆలోచించాడు తనకి తాను. ఏ అంతూ పొంతూ దొరికే వీలే కనిపించలేదు.
ఇంతగా ఆలోచించాక– ఇక లాభం లేదు, చర్చించుకుంటూ కూచుంటే కర్తవ్యం దెబ్బతింటుంది! తాననుకున్న కార్యాన్ని నెరవేర్చుకున్న వాడూ తాను కాలేడని ఆలోచించి ఎవరూ చూడని సమయంలో టక్కున ఆ పాడుబడ్డ బావిలోనికి దూకెయ్యాలనే నిశ్చయానికొచ్చేసాడు గోపాల్. మంచి విద్వాంసుడులా గ్రంథకర్తా వేదాంత ప్రశ్నలని అందరికీ అర్థమయ్యేంత దిగువస్థాయికి వచ్చి మరీ సమాధానాన్ని వివరించ గల శక్తిమంతుడు అయిన గోపాల్ ఆ బావిలోనికి దూకడమనే అకృత్యానికి పాల్పడరాదని నిశ్చయించుకున్నాడు మరుక్షణంలో.ఇలా తర్జనభర్జనలతో ఊçహాపోహలతో తలకిందులౌతున్న గోపాల్ –ఇక ఆలస్యం చేయకూడదంటూ నిశ్చయించుకుని పాడుబడ్డ బావిలో దూకడానికే నిశ్చయించుకున్నాడు కూడా. ఇలా ఊగిసలాటలో ఉన్న గోపాల్ అకస్మాత్తుగానూ శీఘ్రంగానూ తాననుకున్న పనిని చేయదలిచి కొత్త ఆలోచనలని రానీయకుండా దృఢమైన నిర్ణయాన్ని చనిపోవడానికే తీసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు ఏమిటా? అనే ఆలోచనలో పడ్డాడు.
ఇది చదివావా?
గోపాల్ ఇంటికి కొంత సమీపంలో వ్యాపారుల అంగడులున్నాయి! ఆ ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే సగుణ్(మేరు నాయక్) ఇల్లు ఉంది. ఆయన భోజనశాలకి అధిపతి. అప్పగించిన పనిని శ్రద్ధతో చేస్తూ పరమధర్మబద్ధంగా ఉండే వ్యక్తి సగుణ్.అంతలో గోపాల్ ఇంటికి సగుణ్ వచ్చాడు. తనకు తానుగా ఆశ్చర్యమయింది గోపాల్‌కి. ‘గోపాల్! మాంచి పుస్తకాన్నిస్తాను చదువుతావా?’ అనడిగాడు సగుణ్. ‘ఓ! తప్పక’ అంటూ ఆనందంగా ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు గోపాల్.వెంటనే పుస్తకంలో అలా పుటలని తిప్పుతూ ఒక పుట దగ్గర ఆగిపోయాడు. అక్కడ పుటల్లో ఇలా ఉంది! అక్కల్ కోట్ మహారాజును తీవ్రంగా సేవిస్తూ ఉండే ఒక భక్తుడుండేవాడు! అతడికి ఆ అక్కల్ కోట్ మహారాజే సర్వస్వం. అలా ఉంటున్న కాలంలో తీవ్రమైన రోగం వచ్చింది ఆయనకి. ఎవరెవరో ఎందరెందరో వైద్యాన్ని ప్రారంభించారు. ఆ వ్యాధికి తగ్గుముఖం పడుతుందనే నమ్మకం తమకి లేదనే విషయాన్ని వైద్యులే చెప్పారు. అంతే! ఆ భక్తునికి ఓ ఆలోచన వచ్చింది!
తాను జీవించి ఉన్నందుకు ఒకరి కష్టాన్ని తాను ఎంతగా తీర్చగలనా అని ఆలోచించాడు. ఏమాత్రమూ సహాయపడలేదనే నిర్ధారణకి వచ్చేసాడు ఆ భక్తుడు. దాంతో తానెవరికీ సహాయపడలేదు– తన కొచ్చిన వ్యాధిని తగ్గించుకోగల శక్తిమంతుడు కాదు. ఇలాంటప్పుడు జీవించి ఏం ప్రయోజనం? అనే ఆలోచనకొచ్చి చావు మాత్రమే శరణ్యమనుకున్నాడా భక్తుడు అని అనిపించింది ఆ సందర్భంలో.సరిగ్గా తనకి ప్రతిబింబాన్ని చూస్తున్నట్లుగా అన్పించింది. అంతే! ఆ భక్తుడు తీవ్ర నిరాశతో బావిలో దూకెయ్యకనే దూకేసాడని ఉంది! వెంటనే అక్కల్ కోట్ మహారాజే అక్కడి కొచ్చి ప్రాణాపాయం నుండి రక్షించాడు. రక్షించాక అన్నాడు–! ‘భక్తుడా! ఆత్మహత్య చేసుకోవాలనే ఈ దురదృష్టకర ఆలోచన రావడంలో నీ తప్పు లేదు సుమా! ప్రారబ్ధ రీత్యా మనం అనుభవించవలసిన బాధలు ఏమున్నాయో వాటిని సాక్షాత్తు ఆ దైవమైనా సరే ఈ భూమిలో గాని జన్మించి ఉంటే అనుభవించక తప్పదు. ఆ కర్మల ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందే. ఆ పాపాల ఫలితాన్ని అనుభవించకుండా దాచుకోవడమో, జాగ్రత్త పడడమో చేయదలిస్తే... మరింత పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంకా పాపాల సంఖ్య తీవ్రత పెరిగినట్లయితే మరో జన్మని కూడా ఎత్తవలసి ఉంటుంది.
ఇప్పుడే కష్టాన్ని దాటలేక నూతిలోపడి ఆత్మహత్య చేసుకుంటే కచ్చితంగా రాబోయే పాపఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుచేత కష్టాలని భరించక తప్పదు. ఆత్మహత్య అనేది పిరికి పందలు– దద్దమ్మలు చేసే పని. దాన్ని ఓ సంచలనాత్మక వార్తగా పదిమందికీ ప్రచారం చేస్తే గనుక ఆ ఆత్మహత్యల కథా చరిత్ర అలా సాగుతూనే ఉంటుంది! కాబట్టి ఆత్మహత్య అనేది ఏమాత్రమూ సరికాదనే నిశ్చయజ్ఞానం కలిగింది. అక్కల్ కోట్ మహారాజ్ గారి ద్వారా వెంటనే గోపాల్ సాయి మసీదు కెళ్లి పాదాలమీద పడి వెక్కి వెక్కి చిన్నపిల్లవానిలా ఏడ్చాడు.సాయిలో ఉన్న గొప్పదనమేమంటే తన వద్ద కొచ్చిన ఎవరైనా ప్రారంభించి తమ విశేషాలని చెప్తూంటే– తల్లి మాటలని పిల్లవాడు శ్రద్ధగా ఆలకించినట్లు వినేవాడు తప్ప, మధ్య మధ్యలో ప్రశ్నించడం చేసేవాడు కాదు. అందుకే గోపాల్ బాధనంతా సాయి చూసి చూసి స్పష్టంగా అతని ఆత్మహత్య ఆలోచనను పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని తెలిసి అప్పుడు మాట్లాడడం ప్రారంభించి ‘గోపాల్! వచ్చిన ఆలోచనని వచ్చినట్లుగానే అమలు చేసెయ్యకూడదు. ఆలోచించగలగాలి తరువాత ఏమౌతుందో అని! అన్నాడు.గోపాల్ మరో మారు తీవ్రంగా తన కన్నీటితో తన మనోబాధని వ్యక్తీకరించి ఆత్మహత్య మహాపాతకమని తేల్చి ఆత్మహత్యా ఆలోచననే గాని ఎవరికి వచ్చినా షిర్డీకి గాని వస్తే పూర్తిగా ఆలోచన తొలగి పోతుందని తన అనుభవంతో చెప్పాడు. ఇది ఎంత దివ్య ఔషధమో కదా. ‘సాయికి శ్రీ విష్ణు సహస్రనామం చాలా ఇష్టమా? ఎందుకు?
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు
ఆత్మహత్య ఆలోచనలా? షిర్డీకి వచ్చేయ్!
Published Sun, Jan 20 2019 12:40 AM | Last Updated on Sun, Jan 20 2019 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment