ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది.
థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
శిష్యుల అస్థికలు కూడా..
బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్‌లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది.
ఎక్కడెక్కడ ఉన్నాయి?
ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు.
రెండోసారి థాయ్‌లాండ్‌కు..
బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment