బుద్ధుని సత్యాన్వేషణ
సందేశం
‘‘తర్జనీ దర్శయత్యన్యం సద్యస్త్వామంగుళీత్రయమ్’’ నీచూపుడు వేలుతో ఇతరులను చూపిస్తావు కాని, అదే సమయంలో మూడు వేళ్ళు నిన్ను చూపిస్తాయి... గ్రహించు!’’ అందుకే సత్యాన్నే పలకాలి. దాన్ని ప్రియంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యాన్నే కదా అని ఎన్నడూ కఠినంగా, పౌరుషంగా చెప్పరాదు. బుద్ధ భగవానుని చరిత్ర మనకు తెలిసిందే. ఆయన జీవితం మానవ జాతికి చాలా ఆదర్శమైనది. బుద్ధుడు మహారాజవంశంలో పుట్టినా, అనేక భోగభాగ్యాలున్నా కూడా వాటిని త్యాగం చేసి సర్వసంగపరిత్యాగి అయ్యాడు. సత్యాన్వేషణకై తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు.
అలాంటి బుద్ధ భగవానుని ఒక వ్యక్తి ప్రతిరోజూ దూషించేవాడు. ముఖం ఎదుటే దుర్భాషలాడేవాడు. కాని అందుకు బుద్ధునిలో ఎలాంటి స్పందన ఉండేది కాదు. మౌనంగానే వుండిపోయేవాడు. కొంత కాలం గడిచిన తర్వాత బుద్ధ భగవానుడు నోరు మెదిపాడు.‘‘అయ్యా! ఏదైనా మనం ఇతరులకిచ్చినప్పుడు మనం ఇచ్చింది వారు తీసుకోకపోతే అది తిరిగి ఇచ్చిన వారికే చెందుతుంది కదా! అలాగే మీ దూషణలను కూడా నేను స్వీకరించలేదు’’ అని చాలా ప్రశాంతంగా బదులు పలికాడు.
ఆ వ్యక్తిలో చలనం కలిగింది. ఆలోచించే కొద్దీ భయం కలిగింది. ‘అనవసరంగా ఒక దయామూర్తిని నిందించానే’ అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు అంతే ప్రశాంత వదనంతో ‘‘నేనెప్పుడో క్షమించి వేశాను. మీ తిట్ల వల్ల నాలో ఎలాంటి భావమూ లేదు. మీరు బాధపడవలదు’’ అని ఓదార్చి పంపించాడు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం జరుగుతుంటాయి.వాటన్నింటినీ పట్టించుకుంటే గమ్యం చేరలేము. సాధకులైన వారు ఏకాగ్రత వీడకుండా వుండాలి. ఇతర విషయాలేవీ పట్టించుకోరాదు.సాధకుడికి సాధన కాలంలో అనేక అంతరాయాలేర్పడతాయి. వాటిని లెక్క చేయకుండా గమ్యం వైపు దృష్టి సారించి కృషి చేయడమే ముఖ్యం. దేనిని సాధించాలన్నా నిర్దిష్ట మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి.
ఉత్తమ సాధకులెవ్వరూ తమ గమ్యం చేరే వరకూ వదిలిపెట్టరు. వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక ప్రారబ్ధార్ధాన్ని వదిలిపెట్టరు. విఘ్నాలు ఎన్ని వచ్చినా వారి ప్రయత్నానికి ఆటంకం కలిగించలేవు. సత్యదర్శనం కలిగే వరకు నిరంతర సాధన జరగడమే సరైన నిర్ణయం.బుద్ధ భగవానుని సత్యాన్వేషణలో చెదరని పట్టుదల ఉంది. అందుకు తగిన నిరంతర సాధన వుంది కనుకనే జీవిత సత్యాన్ని కనుగొన్నాడు. ఆయన మాట, ఆయన బాట ఎన్ని యుగాలకైనా ఆదర్శవంతమైంది... ఆచరణీయమైంది.