పెళ్లి ఖర్చు పెరిగిపోతోంది | Survey on average wedding cost in the country | Sakshi
Sakshi News home page

పెళ్లి ఖర్చు పెరిగిపోతోంది

Dec 1 2024 4:10 AM | Updated on Dec 1 2024 4:10 AM

Survey on average wedding cost in the country

దేశంలో సగటు వివాహ ఖర్చు రూ.36.5 లక్షలు 

డెస్టినేషన్‌ వివాహాల సగటు వ్యయం రూ.51.1 లక్షలు.. ఏటికేడాది పెరుగుతున్న ఖర్చు 

9 శాతం వివాహాల ఖర్చు రూ.కోటి పైనే 

పిల్లల పెళ్లి కోసం పొదుపు చేస్తున్న తల్లిదండ్రులు 82 శాతం మంది 

రుణాలు తీసుకుంటున్న వారు 12 శాతం 

నవంబర్‌ – డిసెంబర్‌ నెలల్లో దేశంలో పెళ్లిళ్ల ఖర్చు రూ.6 లక్షల కోట్లు

వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ వెడ్‌మీగుడ్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: పెళ్లి అంటే ఓ పెద్ద వేడుక. రెండు కుటుంబాల మధ్య బలపడే బంధం. బంధు మిత్రుల సందడి, విందు, వినోదాలతో సాగే పెద్ద తంతు. దానికి తగ్గట్టే ఖర్చూ ఉంటుంది. నిరు పేదల నుంచి బిలియనీర్ల వరకు ఎవరికి తగ్గ రేంజ్‌లో వారు పెళ్లి వేడుక జరిపిస్తారు. గతంలో ఇళ్లలోనో, ప్రార్ధన మందిరాల్లోనో పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, కన్వెన్షన్‌ హాళ్లలో భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నాయి. ఫొటోలు, వీడియోలు.. వీటికీ పెద్దపీటే. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లు మరో రకం. ఇలా రాన్రాను పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగిపోతోంది.

పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులో భారతీయులు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. భారత దేశంలో వివాహాల ఖర్చు ఏటికేడాది భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ వెడ్‌మీగుడ్‌ తెలిపింది. దేశంలో ఈ ఏడాది సగటున ఒక్కొక్క వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక సర్వే నివేదికలో వెల్లడించింది. 

అదే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అయితే ఈ సగటు వ్యయం రూ.51.1 లక్షలుగా ఉందని తెలిపింది. 2022లో సగటు వివాహ ఖర్చు రూ.25 లక్షలుగా ఉండగా, 2023లో రూ.28 లక్షలకు చేరి, ఇప్పుడు మరింత ప్రియమైందని పేర్కొంది. ఈ ఏడాది ఆతిథ్యం, విందు ఖర్చు భారీగా పెరగడమే వివాహ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ప్రతి ఐదు వివాహాల్లో ఒక పెళ్లి ఖర్చు రూ.50 లక్షలకు పైనే ఉంటోందని ఈ సర్వే వెల్లడించింది. 

మొత్తం 3,500 మంది జంటలపై ఈ సర్వే నిర్వ­హించగా అందులో తొమ్మిది శా­తం మంది పెళ్లి కోసం కోటి రూపా­యల పైనే ఖర్చు చేసినట్లు తెలిపారు. 40 శాతం మంది వారి వివాహ ఖర్చు రూ.15 లక్షల లోపే అని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. 

పెళ్లి కోసం డబ్బు దాచుకుంటున్న వారే ఎక్కువ 
పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి తల్లిదండ్రులు తగినంత పొదుపుతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెడ్‌మీగుడ్‌ సర్వేలో వెల్లడయ్యింది. 82 శాతం మంది వారి పిల్లల వివాహన్ని సొంతంగా దాచుకున్న నిధులు లేదా స్నేహితుల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. 12 శాతం మంది మాత్రమే పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటున్నారు. మరో 6 శాతం మంది పిల్లల పెళ్లిళ్ల కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. 

మిలీనియల్స్, జనరేషన్‌ జెడ్‌కు చెందిన వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వెడ్‌మీగుడ్‌ సహ వ్యవస్థాపకుడు మెహక్‌ సాగర్‌ షహానీ పేర్కొన్నారు. పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయాలకు అనుగుణంగా కాక్‌టెయిల్స్, గేమింగ్స్‌ , రెస్టారెంట్‌ ఏర్పాట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడం కోసం వీరు సోషల్‌ మీడియా మేనేజర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

వీటివల్ల సరికొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయని మోహక్‌ సాగర్‌ పేర్కొన్నారు. ఏటా నవంబర్‌ – డిసెంబర్‌ నెలల్లోనే అత్యధిక వివాహాలు జరుగుతాయని, ఈ ఏడాది ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ అంచనా వేస్తోంది. ఈ రెండు నెలల్లో వివాహల కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా.

పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తున్నవారి శాతం
రూ. కోటి పైన 9%
రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి 9%
రూ.25 నుంచి రూ. 50 లక్షలు    23%
రూ.15 నుంచి రూ. 25 లక్షలు    19%
రూ.15 లక్షల లోపు 40%

డబ్బు సమీకరణ ఇలా..
సొంతం లేదా కుటుంబ పొదుపు 82%
రుణాలు 12%
ఆస్తులు అమ్మకం 6%

సగటు వివాహ ఖర్చు
ఏడాది    సగటు వ్యయం 
2022    రూ.25 లక్షలు 
2023    రూ.28లక్షలు 
2024    రూ.36.5 లక్షలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement