గౌతమ బుద్దుడు
మింగోరా : ఇస్లాం కంటే ముందు మా మతం బౌద్ధం. స్వాట్ వ్యాలీలో ఉంటున్న ముస్లిం క్యూరేటర్ అన్న మాట ఇది. రెండు నుంచి నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో పాకిస్తాన్‌లోని స్వాట్ వ్యాలీలో ఓ వెలుగు వెలిగిన బౌద్ధ మతం అక్కడ తిరిగి మళ్లీ ఊపిరిపోసుకుంటోంది. వాయువ్య పాకిస్తాన్‌లోని జహానాబాద్ పట్టణానికి చేరువలో గల స్వాట్ వ్యాలీలోని ఓ పర్వతంపై 7వ శతాబ్దంలో ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి రూపం చెక్కబడి ఉంది.
ఇస్లాం మత వ్యాప్తికి కట్టుబడి ఉండే పాకిస్తాన్ తాలిబన్ల కన్ను స్వాట్ వ్యాలీపై పడింది. బౌద్ధ మతం గురించి అవగాహన లేని చాలా మంది పాకిస్తానీలు అప్పట్లో వ్యాలీపై తాలిబన్ల దాడిని స్వాగతించారు. ఏ మతాన్ని వ్యతిరేకించని, ఆక్షేపించని బౌద్ధం ఇస్లాం వ్యాప్తిని అడ్డుకుంటుందనే భావనతో 2007లో డైనమైట్‌తో బుద్దుని ప్రతిమను పేల్చి వేసేందుకు యత్నించారు. విగ్రహం చుట్టూ బాంబులను అమర్చగా, కొన్నిమాత్రమే పేలడంతో బుద్దుని ముఖచిత్రంపై కొంతభాగం దెబ్బతింది. 2001లోనూ ఇదే తరహా దాడి జరిగింది.
ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఖండించారు. తాలిబన్లు తమ సంస్కృతిపై, చరిత్రపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో పాకిస్తాన్ ఆర్మీ తాలిబన్లను అణచివేసే ప్రక్రియలో స్వాట్ వ్యాలీలో వేలాది మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 15 లక్షల మంది ఈ ఘటనలో నిర్వాసితులు అయ్యారు. పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా అత్యధికమనే సంగతి తెలిసిందే. హిందూవులు, క్రైస్తవులు అక్కడ మైనార్టీలు. మతం పేరుతో వారిపై జరిగే దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇలాంటి దాడులతోనే 10వ శతాబ్దంలో స్వాట్ వ్యాలీలో బౌద్ద మతం తన ఉనికిని కోల్పోయింది. 1955 నుంచి ఇటలీ ప్రభుత్వం స్వాట్ వ్యాలీలో బౌద్ధ మత కట్టడాలను, సంస్కృతిని పునరుద్ధరించేందుకు 30 లక్షల డాలర్లను వెచ్చిచింది. తాలిబన్ల దాడి కాలంలో ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడులు జరిగాయి. 2009 పాకిస్తాన్ ఆర్మీ కలుగజేసుకున్న తర్వాత మళ్లీ ఇటలీ ఆర్కిటెక్ట్స్ ఇక్కడి వచ్చారు.
2012లో దెబ్బతిన్న బుద్దుడి ముఖాన్ని పునరుద్ధరించేందుకు ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం 3డీ ఇమేజ్‌ను ప్రత్యేకంగా రూపొందించి 2016లో అందమైన రూపుతో మళ్లీ గౌతముడి ముఖాన్ని సరి చేశారు. చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి ఇక్కడికి భారీగా పర్యాటకులు వస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాంత ప్రాముఖ్యత గురించి స్థానిక యువతలో ఇంకా అవగాహన కలిగించాల్సివుందని ఆర్కియాలజిస్టుల చెబుతున్నారు.
చరిత్రను తెలుసుకోకపోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. తాలిబన్ల నీలినీడల నుంచి బయటపడిన వ్యాలీలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. బౌద్ధ మతానికి ఆద్యుడైన గౌతమ బుద్ధుడు తన అతీత శక్తితో హింసను పెచ్చరిల్లేలా చేస్తున్న తాలిబన్లను ఓడించారని వ్యాలీలోని వారు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment