వసంత రుతువు వచ్చేసింది. వనమంతా పూలతో పరిమళిస్తోంది. హిమాలయ ప్రాంంతంలో కోలియులకు చెందిన కక్కరవస్తు నగరం అది. ఆ నగర సమీప వనంలో విశాలమైన రావిచెట్టు కింద కూర్చొని ఉన్నాడు బుద్ధుడు తన భిక్షు సంఘంతో. కోలియ యువకుడు దీర్ఘజాణుడు కూడా వచ్చి బుద్దుని దగ్గరే కూర్చుని తన సందేహాలు తీర్చుకుంటున్నాడు. ‘భగవాన్! లోకంలో హితకారి, సుఖకారి అయిన నాలుగు ధర్మాల గురించి చెప్పండి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నతో అక్కడ ఉన్న భిక్షువులందరూ సర్దుకు కూర్చున్నారు. అంతలో కొద్దిదూరంలో రైతులు లయబద్ధంగా అరిచే అరుపులు వినిపించాయి. కావళ్ళకు ధాన్యం మోపులు కట్టుకుని, భుజాన మోస్తూ, వేగంగా నడుస్తూ ఉన్నా రైతులు ‘ఓహోం.. ఓహోం..’’ అంటూ అరుస్తూ, ఆ వూపులో వేగంగా పోతున్నారు. వారి మధ్యలో ఉన్న రైతు కావడిని కాస్త ముందుకు సర్దుకున్నాడు. దానితో వెనుక బలం పెరిగింది. గట్టు దాటే సమయంలో వెనక్కు పడిపోయాడు. మరలా లేచి కావడిబద్దను భుజానికి ఎత్తి, ముందూ, వెనుకల బరువులు సర్దుకుని వారితో నడక సాగించాడు. కానీ, వెనుకపడ్డాడు. రైతులు వెళ్ళిపోయారు.
‘‘దీర్ఘజాణా; ఈ లోకంలో హితాన్ని, సుఖాన్ని కూర్చే ఉత్థాన సంపద, ఆరక్ష సంపద, కళ్యాణ మిత్రత, సమజీవనం– అనే నాలుగు సంపదలు ఉన్నాయి’’ అన్నాడు. ‘‘భగవాన్! వాటి గురించి చెప్పండి’’ అడిగాడు దీర్ఘజాణుడు నమ్రతగా.
‘‘దీర్ఘజాణూ! వృత్తి ద్వారా సంపాదించేది ఉత్థాన సంపద. పశుపాలనం, వ్యవసాయం, వాణిజ్యం, శిల్పకళ, ఉద్యోగం... సోమరితనాన్ని వీడి ఈ వృత్తులు నిర్వహించడంలో నేర్పరి అవుతారు. ఇలా సాధించుకున్నదే ఈ సంపద’’ ‘‘అలాగే! ఒకరు తమ కండబలాన్ని ఉపయోగించి, నిరంతరం శ్రమించి, కష్టపడి చమటోడ్చి, సంపద కూర్చుకుంటాడు. తాను శ్రమించి పొందిన ఈ సంపదని రాజులు, దొంగలు కాజేయకుండా, అగ్నికి ఆహుతి కాకుండా, వరదపాలు కాకుండా రక్షించుకుంటాడు. దీన్నే ఆ రక్ష సంపద అంటారు.
‘‘మరి, దీర్ఘజాణూ! మిత్రులు కూడా మనకు సంపదే! శీలవంతులు, సదాచారులు, శ్రద్ధావంతులు, ప్రజ్ఞానులు, త్యాగబుద్ధి కలిగిన మిత్రులు ఉంటే... మనం కూడా వారిలా శీలసంపద పొందుతాం. శ్రద్ధాసంపద సాధిస్తాం. సదాచారులై జీవిస్తాం. ఇలా శీల, జ్ఞాన సంపదలు మనకు మంచి మిత్రుల వల్ల వస్తాయి. అందుకే కల్యాణ(మంచి) మిత్రులు కూడా మనకు ఒక సంపదే. ఇక, సమజీవనం అంటే అన్నింటికంటే మనకు హితకారి. కొందరు ఆడంబరాల కోసం తమ ఆదాయానికి మించి వ్యయం చేస్తారు. ఇంకొందరు ఎక్కువ ధనం ఉన్నప్పటికీ పిసినారితనం చూపుతారు. వీరిద్దరూ మోసే కావడి ఏదో ఒకవైపు బరువు పెరిగో, తరిగో సమతుల్యత కోల్పోతుంది. దానివల్ల మోసేవాడి భుజం పట్టు తప్పుతుంది. కావడి పడిపోతూ... మోసేవారినీ పడేస్తుంది.’’
‘‘దీర్ఘజాణూ..! అలా కాకుండా ఆదాయ వ్యయాలను సరితూచుకుంటూ జీవించే వారే ‘సమజీవనం’ సాగించేవారు. విలాసాలూ, విందులూ, ఇతరులతో పోల్చుకుని అతిగా వ్యయం చేయడం మాని, అవసరాల మేరకు జీవిస్తే... కొద్దిగా ఆదాయం కూడా సమకూరుతుంది. వారి జీవితం నిశ్చింతగా సాగుతుంది; దీర్ఘజాణూ! సకల గృహస్తులకు ఈ సమజీవనం చాలా అవసరం! ఎందుకంటే... ఇదే హితం! ఇదే సుఖం!’’ అన్నాడు బుద్ధుడు. దూరం నుండి రైతులు కావళ్ళు మోస్తూ లయబద్ధంగా అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి! ధీర్ఘజాణు వంగి బుద్ధుని పాదాలకు నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment